May 27,2023 22:04
  • తీర్మానం ఆమోదించిన యూరోపియన్‌ టియుసి

బెర్లిన్‌ : కార్మికులకు ఉన్న సమ్మె హక్కుపై ప్రభుత్వాల దాడులను యూరోపియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ తీవ్రంగా ఖండించింది. సమ్మె హక్కుపై అత్యవసర తీర్మానాన్ని యూరోపియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాన్ఫడరేషన్‌ (టియుసి) కాంగెస్‌ ఆమోదించింది. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. 'సమ్మె చేసే హక్కు ప్రజాస్వామ్యబద్ధమైన హక్కు. సంఘటితంగా డిమాండ్ల కోసం చేసే పోరాటంలో అంతర్భాగం' అని తీర్మానం పేర్కొంది. సమ్మె హక్కుపై ఇంగ్లండ్‌లో కఠినమైన చట్టం చేసిన నేపథ్యంలో టియుసి ఈ తీర్మానం చేసింది. సమ్మె హక్కుపై దాడులు బ్రిటన్‌కు మాత్రమే పరిమితం కాలేదని విమర్శించింది. ఈ సందర్భంగా టియుసి సహాయ ప్రధాన కార్యదర్శి కేట్‌ బెల్‌ మాట్లాడుతూ 'యూరోపియన్‌ యూనియన్‌ నుంచి ఇంగ్లండ్‌ వైదొలిగి ఉండవచ్చు. కానీ యూరప్‌ అంతటా ఉన్న కార్మికులను అనుసంధానించే సంఘీభావ బంధాలు ఎప్పటికీ విచ్ఛిన్నం కావు' అని చెప్పారు. బెల్జియంలో కూడా సమ్మె చేస్తున్న కార్మికులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చాయని యూరోపియన్‌ యూనియన్‌ గుర్తు చేసింది. ప్రజాస్వామ్య హక్కులను, స్వేచ్ఛను యూనియన్లు దృఢంగా రక్షించుకోవాలని పిలుపునిచ్చింది.