Feb 19,2021 19:36

నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. నలుగురు తోబుట్టువులున్నా అప్పటికే వారందరికీ వివాహాలై తలోదారి వెళ్లిపోయారు. అక్కలు అక్కున చేర్చుకున్నా ఆమె జీవితంలో ఏదో వెలితి. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతుండేవి. అయినా నిస్పృహనెప్పుడూ దగ్గరకు రానీయలేదు. అవరోధాలను అధిగమిస్తూనే తనను తాను నిరూపించుకుంది. ఎత్తైన పర్వతాలను అవలీలగా ఎక్కేస్తూ.. ఎవరెస్టు ఎక్కడమే ఆశయంగా ముందుకు నడుస్తోన్న సమీరాఖాన్‌ జీవన యానం ఇది... 

ఎవరెస్టు దిశగా...

అనంతపురం కళ్యాణదుర్గం బైపాస్‌రోడ్డులో అక్క ఇంట్లో ప్రస్తుతం తలదాచుకుంటోంది సమీరా. తొమ్మిదేళ్ల వయసులో అనారోగ్యంతో తల్లి మృతి చెందింది. ఆరేళ్ల క్రితం తండ్రి కూడా చనిపోయారు. పదవ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పిన ఆమె జీవనం కోసం బెంగళూరు కాల్‌ సెంటర్‌లో బిపిఒ ఉద్యోగంలో చేరి ప్రైవేటుగా డిగ్రీ చేసింది. కానీ ఒంటరి జీవితంలో ఎదురయ్యే నిరాశనిస్పృహలు ఆమెను నిశ్చింతగా ఉండనివ్వలేదు. వాటిని అధిగమించడమే లక్ష్యంగా ఎప్పుడూ ఏదొక వ్యాపకం పెట్టుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే సొంత ఖర్చులతో దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు, ఉత్తర ఆసియా, దక్షిణ ఆసియా దేశాలు కలిపి మొత్తం 20 దేశాల్లో సైకిల్‌ యాత్ర చేసింది. రోజుకు 70 నుంచి 100 కిలోమీటర్లు అవలీలగా సైకిలింగ్‌ చేసేదంట. క్రమంగా హిమాలయ పర్వతాలపై ట్రెక్కింగ్‌ చేయడంపై ఆసక్తి పెంచుకుంది. అలా ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తైన పర్వతాలను అధిరోహించాలని లక్ష్యం పెట్టుకుంది సమీరా.

పర్వతారోహణలు
ఏడు ప్రధాన పర్వతాల్లో ఇప్పటివరకు రెండిటిని విజయవంతంగా అధిరోహిం చింది. వాతావరణం అనుకూలించక నాలిగింటిని చివరివరకు ఎక్కలేకపోయిం ది. నేపాల్‌ 'అమ దబలాం' 6859 మీటర్ల ఎత్తున్న పర్వతాన్ని 2018 నవంబరు 13న అధిరోహించింది. తరువాత 6160 మీటర్ల ఎత్తున్న మరో పర్వతం హై ఇమ్‌జాత్సేని అధిరోహించింది. దీంతో పాటు మన దేశంలోని హిమాలయ శిఖరాలన్నింటినీ ఎక్కి, విజయపతాక ఎగురవేసింది. ఇప్పుడు ఎవరెస్టు లక్ష్యంగా అవసరమైన కసరత్తు చేస్తోంది. ఇది విజయవంతంగా పూర్తి చేయగలిగితే ప్రపంచంలో ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన పర్వతశ్రేణులను అధిరోహించిన ఘనత ఆమెకు దక్కుతుంది.

తోడ్పాటు అవసరం
ఎవరెస్టు శిఖరం అధిరోహించాలంటే శరీర దారుఢ్యంతో పాటు ఆర్థిక చేయూత కూడా కావాలి. 30 రోజుల నుంచి 40 రోజుల కాలవ్యవధిలో శిఖరం అధిరోహించవచ్చు. దానికి రూ.35 లక్షలు ఖర్చు అవుతుంది. అంత పెద్ద మొత్తం సమకూర్చుకోవడం నాకు చాలా కష్టం. కొంత మొత్తం సమకూర్చుకున్నా... ఇంకా చాలా డబ్బు అవసరం అవుతుంది. సహకారం కోసం అనేక ప్రయత్నాలు చేశాను. గతేడాదే ఎవరెస్టు అధిరోహించాల్సి ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో వెళ్లలేకపోయాను. ఎవరైనా ఆర్థిక తోడ్పాటునందిస్తే కనీసం వచ్చే ఏడాది అయినా వెళ్లాలనుకుంటున్నాను. మహిళలు అందునా ఒంటరి జీవితం గడుపుతున్న వారిని చాలామంది చులకనగా చూస్తారు. వారిని చూసి అవహేళన చేయడం కాదు... సరైన తోడ్పాడునందించాలి. అప్పుడే వారు ఎంత ఎత్తుకైనా ఎదగగలరు. అదే నేను నిరూపించాలనుకుంటున్నాను. * సమీరాఖాన్‌

- సంభాషణ : ఎ.షఫీఉల్లా, అనంతపురం.