May 09,2022 07:35

అంతా చినిగిన నోటు బతుకే !
రాజు, పేద తేడా లేని వీధుల్లో
ఏకాంతంగా వెర్రి బూరలూదుతూ
పాములాడిస్తున్న మీ మొహాల దైన్యం చూసేదెవ్వరు?
వెర్రి వేషాలేస్తూ కోతుల్ని ఆడిస్తున్న
మీ హావభావాల యాతన వినేదెవ్వరు?

ఓ నా సోదరా!
ఏనాడు ఏ నావలో తరలిపోయావో!
నీ భాషను ఎంతకాలంగా
ఎన్ని భాషల నడుమ మోస్తూనే ఉన్నావో!
బుట్టలో దాచుకున్న నీ కడుపు నకనకను
భుజాన ఎక్కిన నీ ఆకలి రోదనను
కనీసం పట్టించుకోలేని
చేతులు తెగిన దేశం నాది
అనాసక్త అవిటి రాష్ట్రాలు నావి
గాంధారి వారసుల జనబలం నాది

అహికుంతికా!
ఎండిన ఆనాటి ఏ లంకల నుంచి
నీ వంశవృక్షపు వేర్లు
ఆ లంక కనుమల్లో ఊడలుగా విస్తరించాయో
ఏ అంటకాగిన క్షామం నిన్ను
అక్కడిదాకా తరిమి కొట్టిందో
ఏ అధికారమదం నిన్ను
తరలించి బలిపశువు చేసిందో

ఓ బతుకు బాటసారీ!
నా భాషలోనే నువ్వు కంటున్న కలల పదును
నా కనుగుడ్డును తాకుతూనే ఉంది
ఉలికిపాటుకు గురిచేస్తూనే ఉంది
నీ చిన్నారుల ఏడుపు ఊయల
నా గుండె తలుపు తడుతూనే ఉంది
నిదురను కొల్లగొడుతూనే ఉంది

ఓ తెలుగు మూలమా!
జీవన్మరణ పోరాటంలో
చంటిబిడ్డల పాలకీ చిల్లర రాలని
చిరిగిన బతుకుతో నీవెంత క్షోభిస్తున్నావో
కన్నవారి కడుపుకు కలో గంజో తాపలేక
వెతల వేటలో నువ్వెంత వేగిపోతున్నావో
ఆటముగిసిన రాజకీయ చదరంగంలో
మిగిలిన పావువై ఆకాశానికి ఉరేసిన
చూపులతో ఎలా నెట్టుకొస్తున్నావో?

'అన్నొస్తాడన్న' నీ ఆశ
ఎప్పుడో ఆవిరైందని నీకెప్పటికి తెలిసేది?
నీదంటూ ఓ జాడ ఉందని ఏ నాయకుడికి పట్టేది?
నా మట్టి పంచుకు పుట్టినా
ఇక్కడ ఓటు లేకుంటే నువ్వెక్కడున్నా ఒంటరివే!
ఉక్రెయిన్‌ రణస్థలి నుంచైనా దేశీయులను తరలించే
నాయకుల అరికాలికి తగిలిన పల్లేరువే !
 

(శ్రీలంక మూల వాసులు, జిప్సీ తెగకు చెంది, తెలుగు భాష మాట్లాడే అహికుంతకల కోసం ..)
- కరణం కళ్యాణ్‌ కృష్ణ కుమార్‌,
98484 28978