Jul 21,2021 20:52

కార్మిక నేతలు,జెఎన్‌యు విద్యార్థులు, అంబేద్కరిస్టులపైనా నిఘా 
న్యూఢిల్లీ : రాజకీయ నాయకులు, జర్నలిస్టులే కాదు, ప్రభుత్వ విధానాలను విమర్శించేవారినందరిపైనా 'పెగాసస్‌' స్పైవేర్‌ నిఘా కొనసాగింది. ఉమర్‌ ఖలీద్‌తో సహా పలువురు జెఎన్‌యు విద్యార్థులు, అంబేద్కర్‌వాదులు, కార్మిక సంఘాల కార్యకర్తలు, కుల వ్యతిరేక పోరాటవాదులు ప్రజా ఉద్యమాలు నడిపే వారంతా ఈ నిఘా నీడలో ఉన్నారు. లీకైన రికార్డులో వెలుగుచూసిన నెంబర్లలో అంబేద్కర్‌వాది అశోక్‌ భారతి, జెఎన్‌యు మాజీ విద్యార్థులు ఉమర్‌ ఖలీద్‌, అంబిరన్‌ భట్టాచార్య, రైల్వే యూనియన్‌ నేత శివ గోపాల్‌ మిశ్రా, ఢిల్లీకి చెందిన కార్మిక హక్కుల కార్యకర్త అంజని కుమార్‌, బగ్గు మైనింగ్‌ వ్యతిరేక కార్యకర్త అలోక్‌ శుక్లా, ఢిల్లీ వర్శిటీ ప్రొఫెసర్‌ సరోజ్‌ గిరి, బస్తర్‌కి చెందిన శాంతి కార్యకర్త శుభ్రంశు చౌదరి, బిబిసి మాజీ జర్నలిస్టు, కార్మిక సంఘ నేత సందీప్‌ కుమార్‌ రారు తదితరులు ఉన్నారు. ఎన్‌ఎస్‌ఓ గ్రూపు నుంచి గుర్తు తెలియని క్లయింట్‌ ఆసక్తి చూపించే వ్యక్తులని ఆ జాబితా చూస్తే అర్థమవుతోంది. తమను సంప్రదించిన ప్రభుత్వాలకే ఈ స్పైవేర్‌ను విక్రయించామని ఎన్‌ఎస్‌ఓ చెబుతోంది. ఈ ఎన్‌ఎస్‌ఓకి తాము క్లయింటా, కాదా అనేది మోడీ ప్రభుత్వం ఇదమిత్థంగా ఏమీ చెప్పడం లేదు.
2018 ఏప్రిల్‌ 2న దళిత గ్రూపులు పిలుపిచ్చిన భారత్‌ బంద్‌, దేశవ్యాప్త సమ్మెపై దృష్టి సారించిన కేంద్రం అందులో కీలకంగా ఉన్న వారిపై నిఘా పెట్టినట్లు తాజాగా వెలుగు చూసిన అంశాలను బట్టితెలుస్తోంది. దీనిపై అశోక్‌ భారతిని వైర్‌ ప్రశ్నించగా, చట్టాన్ని నీరుగార్చడానికి చేసే ఏ ప్రయత్నాలనైనా తాను వ్యతిరేకిస్తానని, అందుకోసం ఉధృతంగా ప్రచారం చేస్తానని అన్నారు. ఈ నిఘా తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు.
2019లో సరోజ్‌ గిరి, బెలా భాటియా, అలోక్‌ శుక్లా, శుభ్రంశు చౌదరిలపై పెగాసస్‌ నిఘా వున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. కంపెనీ సెక్యూరిటీలో వున్న నిర్దిష్ట లోపం ద్వారా ఈ దాడి జరిగిందని తెలిపింది. లీకైన జాబితాలో వున్న ఈ నెంబర్లలో కొందరిపై 2017 నుంచి 2019 వరకు నిఘా కొనసాగింది. ఆ ఏడాది జులై వరకు మాత్రమే డేటా బేస్‌లో ఎంట్రీలు ఉన్నాయి. తాజా పరిస్థితి ఏంటనేది తెలియరాలేదు. అమెరికాలో, భారత్‌లో తమ కస్టమర్‌ ఖాతాలు హ్యాక్‌ చేశారంటూ ఎన్‌ఎస్‌ఓకి వ్యతిరేకంగా ఒక కేసులో వాట్సాప్‌ పోరాడుతోంది.
నిఘా నీడలో జెఎన్‌యు విద్యార్థులు
జెఎన్‌యులో పిహెచ్‌డి చేస్తుండగా అంబిరన్‌ భట్టాచార్య, ఉమర్‌ ఖలీద్‌లపై దేశద్రోహం అభియోగాలు నమోదయ్యాయి. ఉమర్‌ ఖలీద్‌ ప్రస్తుతం అండర్‌ ట్రయల్‌ ఖైదీగా జైల్లో ఉన్నారు. అసమ్మతిని అణచివేయడానికి ప్రభుత్వం ఎంచుకున్న మరో మార్గమే ఈ నిఘా అని అంబిరన్‌, బనోజ్యోత్స్న 'ది వైర్‌'తో వ్యాఖ్యానించారు.
తన రాజకీయ లక్ష్యాలు, వైఖరులు అందరికీ తెలిసినవేనని, అయినా తన ఫోన్లపై నిఘా ఉంచడం ఆశ్చర్యం కలిగిస్తోందని సరోజ్‌ గిరి ఆన్నారు. ఇదంతా చూస్తుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ప్రజల గురించి ఏ మాత్రం పట్టడం లేదని అర్థమవుతోందని శివ గోపాల్‌ మిశ్రా వ్యాఖ్యానించారు.
శశిధరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్‌ ముందుకు నిఘా వ్యవహారం
దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్‌ వ్యవహారం పార్లమెంటరీ ప్యానెల్‌ ముందుకు రానుంది. పెగాసస్‌ స్పైవేర్‌ నిఘా నీడలో వివిధ పార్టీల నేతలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, జెఎన్‌యు మాజీ విద్యార్థులు ఉన్నారన్న వార్తల నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ ఐటి, హోం శాఖలను ఈ నెల 28న ప్రశ్నించనుంది. ''పౌరుల సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యత అంశాలపై చర్చిస్తాం'' అని కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ ఎంపి శశి థరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. సమాచార, ఐటి, హోం మంత్రిత్వ శాఖల ప్రతినిధులు కూడా కమిటీ ముందు హాజరవ్వాల్సి ఉంటుందని తెలిపింది.