
* అగ్నివీరులకు పుష్కల అవకాశాలంటే నమ్మేదెలా?
* కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నామమాత్రపు నియామకాలతో సరి
* గ్రూప్ సి పోస్టుల్లో 1.29 శాతం, గ్రూపు డిలో 2.66 శాతమే
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సైన్యంలో చేరాలనే భారత యువత కలలను సాకారం చేసే గొప్ప లక్ష్యంతోనే అగ్నిపథ్ పథకాన్ని రూపొందించామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బిజెపి నాయకులు ఊదరగొడుతున్నారు. ఇందులో చేరే యువతకు నాలుగేళ్ల పాటు కాంట్రాక్టు కింద నైపుణ్య శిక్షణ ఇస్తామని, ఆ తర్వాత పుష్కల అవకాశాలుంటాయని వీరు చేస్తున్న ప్రచారానికి కార్పొరేట్ అధిపతులు కూడా వత్తాసు పలికిన సంగతి తెలిసిందే. కానీ రెగ్యులర్ నియమాకాల ద్వారా భారత సైన్యంలో విశేష సేవలందించి..ఉద్యోగ విరమణ చేసిన మాజీ ఉద్యోగులకే మోడీ సర్కార్ మొండి చేయి చూపుతోంది. సైనిక నిబంధనావళి ప్రకారం.. మాజీ సైనికులకు వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా కేటాయించారు. గ్రూపు సి, గ్రూపు డి పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఈ పోస్టుల్లో మాజీ సైనికుల కోటానే పూర్తిగా భర్తీ చేయడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ సేవలో విశేష అనుభవం గడించి, మాజీ సైనికులు అనే గౌరవ హోదా ఉన్నవారికే పోస్టుల భర్తీలో రిక్తహస్తం చూపుతున్న మోడీ సర్కార్ ..నాలుగేళ్ల కాంట్రాక్టు ముగిసిన తర్వాత ఏ హోదాకూ నోచని అగ్నివీరులను అందలం ఎక్కిస్తుందంటే నమ్మేదెలా అని ఆర్మీ అభ్యర్థులు పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఎపిఎఫ్), రక్షణ మంత్రిత్వ శాఖ, రక్షణ ప్రభుత్వ రంగ సంస్థల (పిఎస్‌యులు)లో అగ్నివీర్లకు 10 శాతం కోటాను కేంద్రం ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగాలలో రిక్రూట్ చేయబడిన మాజీ సైనికుల సంఖ్యలో భారీ కొరత ఉన్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయలేకపోవటంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ సైనికోద్యోగులలో కేవలం 2.4 శాతం మంది మాత్రమే ఉద్యోగం పొందగలిగారు.
ఉద్యోగ విరమణ పొందిన సైనిక సిబ్బందికి పునరావాస ఉపాధి కల్పించే బాధ్యతతో డైరెక్టర్ జనరల్ రీసెటిల్మెంట్ (డిజిఆర్) అనే ఒక ప్రత్యేక
నోడల్ బాడీ ఉంది. ఈ సంస్థ గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రాలు, రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలతో సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్) రిక్రూట్మెంట్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఒపిటి) నిబంధన ప్రకారం గ్రూప్ సిలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం, గ్రూప్ డిలో 20 శాతం ఖాళీలు మాజీ సైనికులకు కేటాయించాలి. కానీ కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ల్లో గ్రూప్ సిలో 1.29 శాతం, గ్రూప్ డిలో 2.66 శాతం మాత్రమే మాజీ సైనికులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మాజీ సైనికులకు 14.5 శాతం, కేంద్ర ప్రభుత్వ రంగ యూనిట్లు, సిఎపిఎఫ్లకు మాజీ సైనికులకు 24.5 శాతం కోటా ఉంది.
కానీ, గత ఏడాది జూన్ 30 నాటికి సిపిఎస్యుల్లో మాజీ సైనికులు గ్రూప్ సి ఉద్యోగాల్లో 1.15 శాతం, గ్రూప్ డి ఉద్యోగాల్లో 0.3 శాతం మాత్రమే ఉన్నారు. కోల్ ఇండియా, మహారత్న వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో మాజీ సైనికులు కొరత ఉంది. ఇది మాజీ సైనికులకు రిజర్వ్ చేయబడిన 251 గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల్లో ఒక్కదాన్ని భర్తీ చేయలేదు. కేంద్ర మంత్రిత్వ శాఖలలో ఈ చిత్రం మరింత దుర్భరంగా ఉంది. అందులో 32 మంత్రిత్వ శాఖల్లో రిజర్వు చేసిన 22,168 స్థానాల్లో 1.60 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. ఉదాహరణకు, ప్రపంచంలోని అతిపెద్ద ఉద్యోగులలో ఒకటైన భారతీయ రైల్వేలు కేవలం 1.4 శాతం (11.5 లక్షల్లో కేవలం 16,264) ఉద్యోగాలను సాయుధ బలగాలకు చెందిన మాజీ సైనికులతో భర్తీ చేసింది.
77 కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఉండగా అందులో 34 డిపార్ట్మెంట్లో మాత్రమే మాజీ సైనికులు గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాల్లో అరకొరగానే నియామకాలు జరిగాయి. 34 డిపార్ట్‌మెంట్‌ల్లో గ్రూప్ సి (పది శాతం రిజర్వ్డ్) 10,84,705 పోస్టులకు గానూ కేవలం 13,976 (1.29 శాతం) మంది మాజీ సైనికులు మాత్రమే ఉన్నారు. అలాగే గ్రూప్ డి (20 శాతం రిజర్వ్డ్) 3,25,265 పోస్టులకు గానూ కేవలం 8,642 (2.66 శాతం) మంది మాజీ సైనికులు మాత్రమే ఉన్నారు.
పారామిలటరీ బలగాలు కూడా మాజీ సైనికుల నియామకానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్), సెంట్రల్ పారా మిలటరీ ఫోర్స్స్ (సిపిఎంఎఫ్)ల్లో పది శాతం మాజీ సైనికులు కోటా ఉండగా, 2021 జూన్ 30 నాటికి కేవలం 0.47 శాతం మాత్రమే మాజీ సైనికులు ఉద్యోగులుగా ఉన్నారు. సిఎపిఎఫ్, సిపిఎంఎఫ్ల్లో ఎనిమిది విభాగాలు ఉండగా, అందులో ఏడు విభాగాల్లోని ఈ నియామకం జరిగింది. సిఎపిఎఫ్, సిపిఎంఎఫ్ల్లో ఏడు విభాగాల్లో 8,81,397 గ్రూప్ సి పోస్టులకు గానూ, కేవలం 4,146 ( 0.47 శాతం) మంది మాత్రమే మాజీ సైనికులు ఉన్నారు. 61,650 గ్రూప్ బి పోస్టులకు గానూ, కేవలం 539 (0.87 శాతం) పోస్టులు మాత్రమే మాజీ సైనికులుకు ఉద్యోగాలు లభించాయి. 76,681 గ్రూప్ ఎ పోస్టులకు గానూ, కేవలం 1,687 (2.2 శాతం) ఉద్యోగాలు మాత్రమే మాజీ సైనికులు పొందారు. గ్రూప్ డిలో 20 శాతం కోటా ఉన్నప్పటికీ ఒక్క పోస్టు కూడా మాజీ సైనికులుకు భర్తీ చేయలేదు. భర్తీ చేసిన వాటిలో రైల్వే ప్రోటెక్ష్ ఫోర్స్ (ఆర్పిఎఫ్), సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి), శాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బి), సెంట్రల్ ఇండిస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్), అస్సాం రిఫైల్స్ ఉన్నాయి. 2021 మే 15 వరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జి) రిపోర్టు దాఖలు చేయలేదు.
170 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా, అందులో 94 సిపిఎస్యుల్లో మాజీ సైనికులకు ఉద్యోగాలు కల్పించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సిపిఎస్‌యు)ల్లో గ్రూప్ సి పోస్టులకు 14.5 శాతం, గ్రూప్ డి పోస్టులకు 24.5 శాతం మాజీ సైనికుల కోటా ఉంది. 2,72,848 గ్రూప్ సి పోస్టులు ఉండగా, 3,138 (1.15 శాతం) పోస్టులు మాత్రమే మాజీ సైనికులు ఉన్నారు. 1,34,733 గ్రూప్ డి పోస్టులకు గాను, 404 (0.3 శాతం) పోస్టుల్లో మాత్రమే మాజీ సైనికులు ఉన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా గ్రూప్ సి పోస్టులకు 14.5 శాతం, గ్రూప్ డి పోస్టులకు 24.5 శాతం మాజీ సైనికుల కోటా ఉంది. అయితే 13 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2,71,741 గ్రూప్ సి పోస్టులు ఉండగా, 24,733 (9.1 శాతం) పోస్టులు మాత్రమే మాజీ సైనికులు ఇచ్చారు. 1,07,009 గ్రూప్ డి పోస్టులకు, 22,839 (21.34 శాతం) పోస్టులు మాజీ సైనికులు ఇచ్చారు. అగ్నిపథ్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్‌ను ప్రకటించిన 10 డిఫెన్స్ పిఎస్యులల్లో ప్రస్తుతం 3.45 శాతం గ్రూప్ సి, 2.71 శాతం గ్రూప్ డి పోస్టులను మాత్రమే మాజీ సైనికులతో భర్తీ చేశారు.2021 జూన్ 30 నాటికి మొత్తం 26,39,020 మంది మాజీ సైనికులు ఉన్నారు. అందులో 22,93,378 మంది ఆర్మీ, 1,38,108 మంది నేవి, 2,07,534 మంది ఎయిర్ ఫోర్స్ నుంచి మాజీ సైనికులు ఉన్నారు.
మరోవైపు రాష్ట్రాలు కూడా మాజీ సైనికులకు ఉద్యోగాలు కల్పించలేకపోయాయి. ఉదాహరణకు, డిసెంబర్ 2019 నాటికి దేశంలోని 80 శాతం సాయుధ బలగాలను కలిగి ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలు ఉద్యోగం కోసం నమోదు చేసుకున్న 2 లక్షల మంది మాజీ సైనికుల్లో కేవలం 1.5 శాతానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాయి.