Oct 28,2021 06:58

రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాలయాలకు గ్రాంటును నిలిపివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పేద విద్యార్థులకు శాపంగా మారింది. విద్యా సంవత్సరం మధ్యలో అమలులోకి వచ్చిన ఈ నిర్ణయం కారణంగా లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరమయ్యింది. ఎయిడ్‌ను నిలిపివేయడం, ఉపాధ్యాయులను, అధ్యాపకులను ప్రభుత్వ సంస్థలకు తరలించడంతో విద్యాసంస్థలు మూసివేయడమో, అన్‌ ఎయిడెడ్‌గా మారి ఫీజుల మోత మోగించడమో జరుగుతోంది. ఈ కారణంగానే విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రోడ్లమీదకు వస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు. ప్రభుత్వ వైఖరి ఇదే మాదిరి కొనసాగితే ఈ ఆందోళనలు మరింత ఉధృతం కావడం ఖాయం. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యారంగం తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. పేద విద్యార్థులపై దీని దుష్ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. బడులు మూసివేయడంతో ఆన్‌లైన్‌ ద్వారా బోధన జరిగినప్పటికీ, ఆ సాంకేతికతను అందిపుచ్చుకునే ఆర్థిక స్థోమత లేని విద్యార్థులు పాఠాలకు దూరమయ్యారు. రాష్ట్రంతో పాటు, దేశ వ్యాప్తంగా జరిగిన అనేక సర్వేల్లో ఈ విషయం స్పష్టమైంది. ఇలా నష్టపోయిన వారిలో అత్యధికులు ఎయిడెడ్‌ సంస్థల విద్యార్థులే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిని ఆదుకోవడానికి, మిగిలిన విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా పెనం మీద నుండి పొయ్యిలో పడేయటం దుర్మార్గం.
విద్యారంగం నుండి ప్రభుత్వం తప్పుకుని, ప్రైవేటుకు అప్పగించాలన్న ప్రపంచ బ్యాంకు ఆదేశాల అమలులో భాగంగానే ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ఈ దాడి జరుగుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలోనే దీనికి బీజం పడింది. 2003 నుండి ప్రతి సంవత్సరం 10 శాతం ఎయిడ్‌ను కోత పెట్టడం అప్పట్లో బాబు ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తరువాత వై.ఎస్‌ హయాంలోనూ కొనసాగిన అదే పద్ధతి జగన్మోహన్‌రెడ్డి పాలనలో పతాక స్థాయికి చేరింది. ఎయిడ్‌ పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎయిడ్‌ లేకుండా విద్యాసంస్థలు నడుపుకుంటారా? ప్రభుత్వానికి అప్పచెబుతారా? అని యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. కోట్ల రూపాయల విలువచేసే భూములను, భవనాలను ఏ యాజమాన్యమైనా ప్రభుత్వానికి అప్పనంగా అప్పచెబుతుందా? కోట్ల రూపాయల ఆస్తులను సొంతం చేసుకోవడంతో పాటు, అన్‌ ఎయిడెడ్‌ సాకుతో భారీగా ఫీజులు పెంచుకునే అవకాశం విద్యాసంస్థల పాలకవర్గాలకు ప్రభుత్వ ఉత్తర్వులతో లభించింది. దీనిని వారు పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ ఉండగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అన్‌ ఎయిడెడ్‌గా మారుతున్న విద్యాసంస్థలు నిర్ణయిస్తున్న భారీ ఫీజలు కట్టలేక అనేక చోట్ల తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు మాన్పిస్తున్నారంటూ వస్తున్న వార్తలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లోని అన్‌ ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకుల పరిస్థితీ అయోమయంగా మారింది. అయినా, రాష్ట్ర ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ల మాదిరి వ్యవహరించడం ఎంతమాత్రం సబబు కాదు.
ఎయిడెడ్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులను ప్రభుత్వ విద్యాసంస్థలకు మారుస్తున్నామంటూ చేస్తున్న ప్రకటనలు ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. అనేకచోట్ల ప్రభుత్వ సంస్థలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటును ఆశ్రయించక తప్పనిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా మధ్యాహ్న భోజనం, విద్యా కానుక వంటి ప్రభుత్వ పథకాలు కోల్పోవడంతో పాటు, భారీ ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఇక ఎయిడ్‌ కొనసాగిస్తామని చెప్పకుండా యాజమాన్యాలపై ఒత్తడి చేయడం లేదంటూ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలు తప్పుదోవ పట్టించేవే. ప్రభుత్వానికి విద్యారంగం మీద, పేద ప్రజల ప్రయోజనాల పరిరక్షణ మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వివాదాస్పదంగా మారిన ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలి. ఎయిడెడ్‌ విద్యాలయాలను కొనసాగించేలా, వాటిని మరింత బలోపేతం చేసి పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలి. అప్పటికీ విద్యాసంస్థలను నిర్వహించడానికి యాజమాన్యాలు సిద్ధపడకపోతే వాటిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నడపాలి. అన్‌ ఎయిడెడ్‌ సిబ్బందిని కూడా రెగ్యులర్‌ చేయాలి. విద్యారంగాన్ని పరిపుష్టం చేయడంతో పాటు, పేదలకు చదువును గ్యారంటీ చేసే ఈ తరహా చర్యల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు మేధావులు, ప్రజాతంత్ర శక్తులు ఉద్యమించాలి.