Apr 20,2021 22:07

ప్రజాశక్తి-నెల్లూరు : రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్‌ కళాశాలలను వ్యాపార సంస్థలుగా మార్చొద్దని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు. మంగళవారం విఆర్‌ కళాశాల సెమినార్‌ హాల్‌లో 'ఎయిడెడ్‌ కళాశాలలను కాపాడాలి' అని సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు పలు కళాశాలల అధ్యాపకులు పాల్గన్నారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందనే సాకుతో అధ్యాపకులను, ఉద్యోగులను బదిలీ చేసిందన్నారు. కళాశాలలను యాజమాన్యాలకు అప్పజెప్పేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోందన్నారు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు విద్యకు దూరమవుతారన్నారు. ఇటువంటి చర్యల వల్ల జిల్లాలోని వి.ఆర్‌., సర్వోదయ, వేణుగోపాలస్వామి, జవహర్‌ భారత్‌ వంటి కళాశాలలు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయన్నారు. నగరంలో మహాత్మ గాంధీ పునాది వేసిన కస్తూర్బా విద్యాలయం కనుమరుగవుతుందన్నారు. ఎయిడెడ్‌ కళాశాలలకు కేరళ రాష్ట్రం ఏ తరహాలో ప్రోత్సాహం అందజేస్తుందో అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. సుదీర్ఘ చరిత్ర, సామాజిక ఆవశ్యకత కలిగిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలను కాపాడాలని, ప్రభుత్వం తన ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సదస్సులో వి.ఆర్‌, ఎన్‌బికెఆర్‌ , జెబి, సర్వోదయ, వేణుగోపాల స్వామి కళాశాలల అధ్యాపకులు పాల్గన్నారు.