
న్యాయం చేయాలంటూ ఎంఎల్‌సి సాబ్జీకి వినతి
ప్రజాశక్తి - ఏలూరు
ఎయిడెడ్ ఉపాధ్యాయుల సర్వీసును దెబ్బతీసే 157 జిఒను రద్దు చేయాలని యుటిఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం యుటిఎఫ్ జిల్లా ట్రెజరర్ ముస్తఫా అలీ, జిల్లా ఆడిట్ సభ్యులు తేరా ప్రసాద్, మరియరాజు, సరిపల్లి కాంతారావు, దాసరి థామస్, ఆస్కార్, ఆశీర్వాదం, ప్రశాంతి, సరోజిని, జోస్ఫిన్, మరికొందరు ఉపాధ్యాయులు ఎంఎల్‌సి షేక్ సాబ్జీని కలిసి సమస్యలను వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎయిడెడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వంలో విలీనం చేశారని, అయితే ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన 157 జిఒ ప్రకారం ఎయిడెడ్ ఉపాధ్యాయుల సర్వీస్ జీరో సర్వీసుగా పరిగణించబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా ఉపాధ్యాయుల మాదిరిగానే జిపీఎఫ్ హెల్త్ కార్డులు, ఎపిజిఎల్‌ఐ, జిఐఎస్ తదితరుల సౌకర్యాలు పొందేందుకు వారికి అర్హతను, ప్రస్తుతం వారికి కేటాయించబడ్డ పోస్టులను బదిలీల ప్రక్రియలో ఖాళీగా చూపితే వారు సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఇలా ప్రతివిషయంలోనూ వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఈ సమస్యలపై తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సాబ్జీ మాట్లాడుతూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఉన్నతాధికారులతో మాట్లాడి విలీనమైన ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తామని, ఇటీవల ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు జారీచేసేలా, ఎపిజిఎల్‌ఐ, పిఎఫ్, జిఐఎస్ ఖాతాలు తెరిచేలా, సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏలూరు జిల్లా విద్యాధికారికి లేఖ రాసినట్లు తెలిపారు. అలాగే ఎయిడెడ్ ఉపాధ్యాయుల ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసిన సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకునే విధంగాను వారికి కేటాయించిన పోస్టులను బదిలీ ప్రక్రియ నుండి తప్పించి వీరి పోస్టులను క్లియర్ వేకెన్సీగా చూపించకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా, మండల పరిషత్, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉన్న రాయితీలను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.