Jul 27,2021 16:39

న్యూఢిల్లీ : నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనలను విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో కూడా నిరసనలు చేపట్టేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని అన్నారు. సెప్టెంబర్‌ 5 నుండి పశ్చిమ యుపిలోని ముజఫర్‌ నగర్‌ నుండి నిరసనలు ప్రారంభం కానున్నాయని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) అధ్యక్షుడు రాకేష్‌ తికాయత్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాకేష్‌ తికాయత్‌, యోగేంద్రయాదవ్‌లు మాట్లాడారు. దేశంలో వ్యసాయ సంక్షోభానికి కారణమైన కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోడీ సర్కార్‌ రైతులను తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిందని, బిజెపి నేతలను బహిష్కరించాలని రాకేష్‌ తికాయత్‌ పేర్కొన్నారు. కార్పొరేట్‌లైన అదానీ, అంబానీ వ్యాపార సంస్థల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రైతులకు సూచించారు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం ఉపసంహరించుకునేంత వరకు తమ నిరసన ముగిసేది లేదన్నారు. కాగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు ప్రారంభించి ఎనిమిది నెలలు పూర్తయిన సంగతి తెలిసిందే.

నిరసనల సందర్భంగా.. రెండు రాష్ట్రాల్లోని గ్రామాల్లో మహాపంచాయత్‌ ర్యాలీలను, సమావేశాలను నిర్వహించాలని.. ఈ నల్ల చట్టాల గురించి వివరించాలని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలుపుతారన్న ప్రశ్నకు తికాయత్‌ స్పందిస్తూ... రైతులను వ్యతిరేకించే పార్టీలకు మద్దతు తెలిపేది లేదని స్పష్టం చేశారు. రైతుల డిమాండ్‌లను ప్రభుత్వం అంగీకరించకపోతే... ఢిల్లీలో చేపడుతున్న నిరసనలను లక్నోలో కూడా ప్రారంభిస్తామని చెప్పారు. యుపి రాజధాని లక్నోకు చేరుకునే అన్ని సరిహద్దులను బ్లాక్‌ చేస్తామని తెలిపారు. ఈ నిరసనలకు విదేశీ నిధులు వచ్చాయన్న ఆరోపణలను ఖండించారు. కొందరు రైతుల పిల్లలు విదేశాల్లో ఉన్నారని... వారు తమ తల్లిదండ్రులకు డబ్బు పంపితే అది.. విదేశీ నిధి ఎలా అవుతుందని ప్రశ్నించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిరసన తెలిపేందుకు ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేయలేదని అన్నారు. చౌదరి చరణ్‌ సింగ్‌ మహేంద్రసింగ్‌ తికాయత్‌ వంటి నేతలు నివసించిన భూమిపై నివసిస్తున్న తమపై వ్యవసాయాన్ని కార్పొరేట్‌ శక్తుల బారిన పడకుండా కాపాడే బాధ్యత తమపై ఉందని అన్నారు.

యుపిలో కనీస మద్దతు ధర, గోరక్షణ పేరుతో ఆవులను వదలివేయడం వంటి రైతుల సమస్యలను కూడా ఈ ఆందోళనల్లో లేవనెత్తుతామని రాజకీయ నేత, విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్‌ అన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన గోధుమ పంటను కొనుగోలు చేయడం లేదని, గతంలో తమ ఉత్పత్తులను సేకరిస్తామని తప్పుడు వాగ్ధానాలు చేశారని యోగిఆధిత్యనాథ్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు 308 లక్షల టన్నుల గోధుమలను ఉత్పత్తి చేస్తున్నారని, కానీ ప్రభుత్వం కేవలం 56 లక్షల టన్నులను మాత్రమే సేకరించిందని, ఇది మొత్తం ఉత్పత్తిలో 18 శాతం మాత్రమేనని అన్నారు. ప్రభుత్వ ఉదాసీనత కారణంగా రైతులు తమ పంటను ఎంఎస్‌పి కన్నా తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చిందని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలోని చెరకు రైతులు కూడా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, మూడేళ్లుగా చెరకు ధరలో మార్పు లేదని చెప్పారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు రూ. 5 వేల కోట్ల వడ్డీని రైతులకు చెల్లించలేదని అన్నారు. ఆవుల కోసం సరైన ఆశ్రయాన్ని ఏర్పాటు చేయలేదని.. దీంతో ఇవి పంటలపై పడి నాశనం చేస్తున్నాయని అన్నారు. ఉచిత విద్యుత్‌ సరఫరా వాగ్దానాన్ని పక్కన పెట్టి అధిక విద్యుత్‌ చార్జీల పేరుతో రైతులను పీడిస్తున్నారని ఇరువురు నేతుల రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. బిజెపి హయాంలో యుపి పోలీసుల రాజ్యంగా మారిందని, పోలీసుల సాయంతో మీడియా, రైతుల గొంతులను నొక్కివేస్తుందని అన్నారు.