Aug 10,2022 07:53

అప్పుడే రెండో ప్రపంచయుద్దం ముగిసింది. భారత దేశం సంపూర్ణ స్వాతంత్రం ముగింట్లో ఉంది. కానీ దేశవ్యాప్తంగా అధికారాన్ని అడ్డంపెట్టుకొని అధిపత్యం చెలాయిస్తున్న భూస్వాముల అరాచకాలపై రైతులు, వ్యవసాయకార్మికులు భగభగ మంటున్నారు. రైతులు ఉప్పెనలా తమపై జరిగే పీడనకు, దోపిడికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఒక్కో పోరాటం ఒక్కొ అద్భుతమైన వీరోచిత స్ఫూర్తి, పోరాటాల అనుభవాలను భవిష్యత్‌ తరాలకు అందించింది.

తెభాగా పోరాటం
1946 చివర్లో బెంగాల్లో ఈ ఉద్యమం ప్రారంభమయింది. భూమిని దున్ని పంటపండించే (బర్గాదార్ల)వారిపైన భూస్వాముల పెత్తనం, దోపిడీకి వ్యతిరేకంగా తెభాగా పోరాటం ప్రారంభమయింది. కిసాన్‌సభ, కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో జరిగిన ఈ ఉద్యమంలో 50 లక్షలమందికిపైగా పాల్గొన్నారు. తాము పండించే పంటలో మూడింట రెండింతలు తమకే కావాలని బర్గాదార్లు డిమాండ్‌ చేశారు. ఈ ఉద్యమంపై అప్పటి ముస్లింలీగ్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున అణిచివేతను ప్రయోగించింది. పోలీసులు ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. 70 మంది రైతులు ప్రాణత్యాగం చేశారు.

ఎర్రజెండా సాక్షిగా వీరోచిత రైతాంగ పోరాటాలు
పున్నప్ర, వాయిలార్‌ వీరగాథ
అలెప్పిలో పున్నప్ర, వాయిలర్‌ అనేవి రెండు పల్లెలు. ఈ పల్లెల్లో జరిగిన అసాధారణ పోరాటం కేరళ ప్రాంతం మొత్తానికి స్ఫూర్తి నిచ్చింది. ఆకలి, నిరుద్యోగం పెచ్చుమీరిన పరిస్థితుల్లో ప్రజలు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రతిఘటనా ఉద్యమం ప్రారంభించారు. అయితే ప్రజల డిమాండ్‌ను ట్రావెన్‌కోర్‌ రాజు, అతని దివాన్‌ అంగీకరించలేదు. రాజు, అతని దివాన్‌ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా ట్రావెన్‌కోర్‌ రాజ్యమంతటా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వీటిని పోలీసులు, సైన్యం సహాయంతో అణిచివేయడానికి ప్రయత్నించారు. కౌలు రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో ప్రదర్శనలో పాల్గొని వున్నప్ర రిజర్వ్‌ పోలీసులు క్యాంపు వరకు ప్రదర్శనగా వెళ్లి స్వేచ్ఛను డిమాండ్‌ చేశారు. అక్కడ ప్రదర్శకులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనేకులు మరణించారు. పోలీసుల దారుణాలను ప్రతిఘటించడానికి వారులార్‌లో 1946 అక్టోబర్‌ 27వ తేదీన రైతుల శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడ భోజనాలు చేస్తుండగా అకస్మికంగా సైన్యం వారిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. అక్కడ ఉన్న వారందరూ చనిపోయిన తర్వాతే ఈ మారణకాండ ఆగింది.
వర్లీ అదివాసులు...తిరుగుబాటుతో విజయం సాధించారు
మహారాష్ట్రలోని థానే, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వర్లీ అదివాసులు అనాదిగా అక్కడి భూస్వాముల చేతిలో దోపిడికి, పీడనకు గురయ్యారు. వెట్టి చాకిరి కూడా చేసేవారు. పండించిన పంటలో అత్యధిక భాగాన్ని భూస్వాములే కాజేసే వారు. కూలి ఇవ్వకుండానే వర్లీ ఆదివాసులతో పని చేయించుకునేవారు. వీటన్నింటిపై కిసాన్‌ సభ అక్కడి గిరిజనుల్లో చైతన్యాన్ని రగల్చింది. ఒక గ్రామం నుండి మరో గ్రామం అలా 200 గ్రామాలు సంఘటితమయ్యాయి. భూస్వాములు రోజువారీ వేతనాలు ఇవ్వాలని, వెట్టి చాకిరీ రద్దు చేయాలని, భూస్వామి దాడి చేస్తే ప్రతిఘటించాలని, అందరూ ఐక్యంగా ఉండాలని కిసాన్‌ సంఘం డిమాండ్లు పెట్టింది. దీంతో మహారాష్ట్రలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, భూస్వాములు అణిచివేత చర్యలు ప్రారంభించారు. దీనికి ప్రతిగా వర్లీ గిరిజనులు సమ్మెకు పిలుపునిచ్చారు. నెలరోజుల పాటు జరిగిన ఈ సమ్మె ఎక్కడా ఆగే పరిస్థితి కానరాలేదు. దీంతో భూస్వాములు, కలప వ్యాపారులు దారికొచ్చారు. వెట్టిచాకిరి రద్దు చేయబడింది. భూస్వాములు కూలి చెల్లించి పని చేయించుకోవడం ప్రారంభించారు. వర్లీ ఆదివాసులు తిరుగుబాటు చేసి విజయం సాధించారు.
చిరస్మరణీయం తెలంగాణా ప్రజా సాయుధ పోరాటం
భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన తెలంగాణా ప్రజా సాయుధ పోరాటం భారత దేశ చరిత్రలో చిరస్మరణీయమైనది. 1946 నుండి 1951 వరకు సాగిన ఈ విప్లవ రైతాంగ పోరాటం దున్నే వానికే భూమి అనే నినాదాన్ని తొలిసారిగా వినిపించింది. తరతరాలుగా తెలంగాణ సమాజంలో కొనసాగుతున్న వెట్టి చాకిరిని అంతం చేసింది. రైతులకు దాదాపు 10 లక్షల ఎకరాల భూమి పంచబడింది. వ్యవసాయ కార్మికులకు కూలిరేట్లు పెరిగాయి. ఈ రైతాంగ పోరాటం కారణంగా దాదాపు 30 లక్షల మంది ప్రజలు, 16 వేల చదరపు మైళ్ల ప్రాంతంలోని మూడు వేల గ్రామ పంచాయితీల్లో గ్రామరాజ్యాలు స్థాపించబడ్డాయి. రైతులు, ప్రజలు గెరిల్లా దళాలుగా ఏర్పడి తుపాకులు చేతబట్టి భూస్వాములను తరిమివేశారు. నిజాం సైన్యాన్ని, రజాకార్లను ధైర్యం ఎదుర్కొన్నారు. భారత్‌ యూనియన్‌లోనే కలవనన్న నిజాం సర్కార్‌ గెరిల్లా దళాల దెబ్బకు బలహీనపడి భారత సైన్యం ముందు వారం రోజులకే సాగిలపడ్డాడు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి దేశమంతా ఎక్కడ వ్యాపిస్తుందనే భయంతో నెహ్రూ ప్రభుత్వం దాదాపు 50 వేల మంది సైన్యాన్ని పంపించి తీవ్రమైన అణిచివేతను ప్రయోగించింది. దాదాపు నాలుగు వేల మంది కమ్యూనిస్టులు, రైతులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, ప్రజాపోరాట యోధులు మూడు నుంచి నాలుగేళ్ల వరకు డిటెన్షన్‌ క్యాంపులలో మగ్గారు. ఇంత నిర్భంధం, అణిచివేత మధ్య 1951లో సాయుధ పోరాటం విరమింపజేశారు. తెలంగాణా సాయుధ పోరాటం సాధించిన విజయాలలో అతి ముఖ్యమైంది భారత దేశంలో ప్రజాతంత్ర విప్లవం సాధించడానికి, భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ మౌలిక సమస్యలు, వ్యూహాలకు, ఎత్తుగడలకు సంబంధించిన అంశాలకు శాస్త్రీయమైన సమాధానాలను, ఆచరణాత్మక పరిష్కారాలను చూపించడమని కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య పేర్కొన్నారు.