Sep 14,2021 16:00

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలను ప్రభుత్వం పలుమార్లు హింసాత్మకంగా మార్చింది. దీనిపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) తీవ్రంగా స్పందించింది. ఈ ఆందోళనలు మానవ హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఎన్‌హెచ్‌ఆర్‌సి రాజస్థాన్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి తాజాగా నోటీసులు జారీ చేసింది. కొన్ని నెలలుగా జరుగుతున్న రైతుల ఆందోళనల వల్ల సాధారణ ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి అందిన ఫిర్యాదుల మేరకు.. తాజాగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శాంతియుత పద్ధతుల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా జరిగే ఆందోళనలను కమిషన్‌ గౌరవిస్తుందని తెలిపింది.