Oct 03,2022 18:05

లక్నో  :   పశ్చిమ యుపిలోని వివిధ జిల్లాలకు చెందిన రైతులు ఆదివారం హవన్‌ పూజ నిర్వహించారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో మరణించిన రైతులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్న అనంతరం బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాది పాటు రైతులు ఢిల్లీలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో ఆత్మహత్య, ఆరోగ్య కారణాలతో మరణించిన రైతుల జ్ఞాపకార్థం 2018 నుండి అక్టోబర్‌ 2వ తేదీన కిసాన్‌ క్రాంతి దివస్‌గా పరిగణిస్తూ రైతులు కిసాన్‌ యాత్ర చేపడతారు. ఈ యాత్ర హరిద్వార్‌ నుండి ప్రారంభమై ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ దగ్గర ముగుస్తుంది. అయితే యుపి గేట్‌ వద్ద రైతులను ప్రభుత్వం అడ్డుకుంది.
ఆందోళన సమయంలో రైతులపై నమోదు చేసిన కేసులను మోడీ ప్రభుత్వం వెనక్కు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన వరికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టాన్ని రూపొందించలేదని మండిపడ్డారు. హవన్‌పూజ నిర్వహించేందుకు అనుమతించాల్సిందిగా యుపి ప్రభుత్వాన్ని కోరామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) యుపి-ఎన్‌సిఆర్‌ అధ్యక్షుడు తెలిపారు. అయితే శనివారం రాత్రి అనుమతించిందని, అయితే అప్పటికే భారీగా పోలీసులు మోహరించారని అన్నారు. ఎంఎస్‌పి చట్టం రూపొందించకపోతే... ప్రధాని మోడీ నివాసం ఎదుట ఆందోళన చేపడతామని రాజేంద్రయాదవ్‌ అనే రైతు తెలిపారు.