Aug 04,2022 07:47

ప్రజలను చైతన్యపరచడంలో.. విశేష పరిజ్ఞానాన్ని అందించడంలో కీలక భూమిక పోషించిన ఎన్నో కళలు రానురాను కనుమరుగయ్యాయి. కళనే నమ్ముకున్న ఆ కళాకారులు దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు. అటువంటి అంతరించిపోతున్న కళలలో తోలుబొమ్మలాట ఒకటి. గుంటూరు సమీపంలోని పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన శ్రీకాశీ విశ్వనాథస్వామి తోలుబొమ్మలాట బృందం తిరుపతిలో ఇటీవల ప్రదర్శన ఇచ్చింది. జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న 'ఆలాపన' కార్యక్రమంలో భాగంగా తొలిరోజున ప్రదర్శించబడిన ఈ తోలుబొమ్మలాట చిన్నారులను, పెద్దలను విశేషంగా ఆదరించింది. ఆ సందర్భంగా ఉబికివస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ తమ బతుకుగోడును వెల్లబుచ్చారు ఆ కళాకారులు.

  'ఒకప్పుడు తోలుబొమ్మలాటకు మంచి ఆదరణ ఉండేది. ఇపుడు మా 'బతుకే' బొమ్మలాటయ్యింది. అంతరించిపోతున్న తోలుబొమ్మలాటను బతికించుకునేందుకు, భవిష్యత్‌ తరాలకు అందించేందుకు అడపాదడపా అక్కడక్కడా ప్రదర్శిస్తున్నా తిండిగింజలకు సరిపడని ఆదాయంతో పస్తులు పడుకుంటున్నాం' అంటున్నారు ఆ బృందం పెద్ద వీరవెంకట సత్యనారాయణ.
'ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లదే రాజ్యం.. అవే బతుకులను శాసిస్తున్నాయి.. మనుషులను ఒంటరిపాటు చేస్తున్నాయి.. కానీ ఒకప్పుడు తోలుబొమ్మలాట వినోదానికి ప్రతీకగా, మంచి ఆటవిడుపుగా అలరించేది. నాటకరంగం రాక మునుపే, వీధి నాటకాల కంటే ముందే భారతీయ పురాణగాథలైన మహాభారతం, రామాయణం, సత్య హరిశ్చంద్ర, సతీసావిత్రి, సతీ సక్కుబాయి, సతీ అనసూయ, మైరావణం, చిన్నమ్మదేవి కథ, చింతామణి, సారంగధర వంటి గాథలను బొమ్మల ద్వారా ప్రదర్శనలు ఇచ్చేవారు. సినిమాల కంటే ముందే ఈ తోలుబొమ్మలాట పేరుతో కొన్ని రకాల బొమ్మలతో కథలకు తగ్గట్టు గంతులువేస్తూ ఇచ్చే ప్రదర్శనలకు ఆయా ప్రాంత ప్రజలు తండోపతండాలుగా వచ్చి వీక్షించేవారు. అప్పట్లో ఇవే జనానికి ఆనందాన్ని పంచేవి.
ఒకప్పుడు గ్రామాలకు గ్రామాలే దీనిపై ఆధారపడి జీవించేవారు. రోజుల తరబడి రాత్రంతా ప్రదర్శనలు సాగేవి. రానురాను గంటలకే పరిమితమయ్యింది. ప్రస్తుతం 20 నిమిషాలకే కథను ముగిస్తున్నాం. దాదాపు తోలుబొమ్మలాట అంతరించిపోయిందనే చెప్పవచ్చు' అంటున్నప్పుడు సత్యనారాయణ గొంతు దు:ఖంతో జీరబోయింది.

 బతుకు 'బొమ్మ'లాట..!
             'మా తాతముత్తాతల నాటి నుంచి అనేక దశాబ్దాలుగా తోలుబొమ్మలాట ప్రదర్శనలతో కుటుంబాలను పోషించుకునేవాళ్లం. మా ముత్తాత కాలంలో తోలుబొమ్మలాట ప్రదర్శన చేయాలంటే ముందస్తుగా బుకింగ్‌ చేసుకునేవారంట. చాలామందికి ఎంత ప్రయత్నించినా ప్రదర్శనకు సమయం కేటాయించలేకపోయేవారు. అంత తీరిక లేకుండా కళాకారులు ఉండేవారు. ఆ తరువాత మా తాతల కాలం వచ్చాక రోజూ ప్రదర్శనలతో బిజీగా ఉండేవారు. ఇక మా నాన్న కాలంలో అంత గిరాకీ లేకపోయినా నెలకు 20 - 25 ప్రదర్శనలు ఉండేవి. తరతరాలుగా మా కుటుంబం తోలుబొమ్మలాటనే నమ్ముకుని జీవిస్తోంది. మాకు తెలిసిన ఏకైక వృత్తి తోలుబొమ్మలాట ప్రదర్శించడమే. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఈ వృత్తిలోనే కొనసాగుతున్నాం. మా నాన్న నుంచి వారసత్వంగా తీసుకున్న ఈ తోలుబొమ్మలాట ప్రదర్శనను దాదాపు 10 మంది బృందంతో కలిసి ప్రదర్శనలు ఇస్తున్నాం. ప్రదర్శన ఇవ్వాలంటే అందుకు అవసరమయ్యే బొమ్మలను ముందే సిద్ధం చేసుకోవాలి. ప్రత్యేకంగా స్టేజిని ఏర్పాటు చేసుకోవాలి. లైటింగ్‌ కూడా దానికి తగ్గట్టు మేమే పెట్టుకోవాలి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని. ఒక ప్రదర్శనకు అవసరమయ్యే బొమ్మల ఖర్చు కనీసం లక్ష రూపాయలు అవుతుంది. మా తాతల నుంచి బొమ్మలను నాకు అప్పగించడంతో పాడైపోయిన వాటికి మరమ్మతులు చేయిస్తూ ఒకటో అరో కొత్తవి కొనుక్కుంటూ ప్రదర్శనలు ఇస్తున్నాం. నేటికీ ధర్మవరం, కాకినాడ, రాజమండ్రి, గుంతకల్లు, గుంటూరు, అనంతపురం ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కుటుంబాలు దీన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. నెల్లూరు, విజయనగరం, ఒంగోలు, కర్నూలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఒకటో రెండో గ్రూపులు ఈ ప్రదర్శనలు ఇస్తున్నాయి. అయితే తోలుబొమ్మలాటనే నమ్ముకున్న ఎంతోమంది కళాకారులు ప్రదర్శనలు లేక వృత్తిని వదిలి బతుకుదెరువు కోసం కూలి పనులకు వెళ్లక తప్పడం లేదు.

                                                                బతుకు 'బొమ్మ'లాట..!
               ఒకప్పుడు ఎంతో వెలుగు వెలిగిన మా తోలుబొమ్మలాట ఆదరణ లేక ప్రాచీన కళగా మిగిలిపోయింది. ప్రభుత్వం ఎక్కడైనా కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రదర్శనలు ఇచ్చేందుకు పిలుస్తుంటారు. గతంలో నెలలో మూడు నుంచి నాలుగు ప్రోగ్రామ్‌లు ఇచ్చేవారు. ఒక్కో ప్రదర్శనకు 20 వేల రూపాయల వరకు పారితోషకం ఇచ్చేవారు. అయితే కరోనా కారణంగా ప్రదర్శనలు ఆగిపోయాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హ్యాండీక్రాఫ్ట్‌ మార్కెటింగ్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ ద్వారా మేం తయారు చేసిన బొమ్మలకు మార్కెటింగ్‌ అవకాశం కల్పించారు. ఇప్పుడు వాటికి సైతం ఆదరణ కరువయ్యింది. ప్రస్తుతం అర్థించినా ప్రదర్శనలు అడిగేవారే లేరు. మాకు ఈ వృత్తి తప్ప వేరే తెలియదు. దీంతో మంచాలు అల్లే నవారు దారాలను సైకిల్‌పై పెట్టుకుని ఊరూరు తిరిగి అమ్ముకుంటున్నాం. అరకొర డబ్బులతో, పస్తులతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మా కుటుంబాలను ఆదుకోవాలి. తోలుబొమ్మలాట అంతరించిపోకుండా చర్యలు తీసుకోవాల'ని వేడుకొంటున్నారు సత్యనారాయణ. కళనే నమ్ముకున్న ఎంతోమంది కళాకారుల దీనస్థితికి ఈ ఉదంతం ప్రత్యక్ష నిదర్శనం. అంతరించిపోయిన, అంతరించిపోతున్న ఎన్నో కళలను బతికించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిదీ. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, కళాకారులను ఆదుకోవాలని కోరుకుందాం.
                      - పాటూరు సురేంద్ర బాబు,    తిరుపతి సిటీ విలేకరి.