గంతకు తగ్గ బొంత

Oct 11,2024 04:48 #feachers, #jeevana

రాజీపేట గ్రామంలో అప్పారావు, అప్పయ్యమ్మ దంపతులు నివసిస్తున్నారు. వారు వ్యవసాయ కూలీలు. రెక్కాడితే కాని డొక్కాడని జీవనం వారిది. వారి ఒక్కగానొక్క కొడుకు రాకేష్‌. వాడికి చదువు సంధ్యలు ఒంటబట్టలేదు. అమ్మనాన్నకి పనిలో సాయం కూడా చేసేవాడు కాదు. ‘తిండికి తిమ్మరాజువి పనికి పోతురాజువి’ అని తండ్రి ఎప్పుడూ తిట్టేవాడు. అయినా ‘దున్నపోతు మీద వాన పడ్డట్లు’ అవేవీ పట్టించుకునే వాడు కాదు రాకేష్‌.
‘పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందన్నట్లు’ అప్పుడైనా పిల్లాడికి బాధ్యత వస్తుందేమోనన్న ఆశతో కొడుక్కి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు అప్పారావు. అది విన్న వారంతా ‘తాదూర సందులేదు, మెడకో డోలు’ కూడానా అని నవ్వుకున్నారు. ఎలాగైతేనేం కొన్నాళ్లకి కాకుల పాలెం గ్రామానికి చెందిన తిక్కల కుమారితో రాకేష్‌ వివాహం జరిగింది.
తిక్కల కుమారికి కట్టు బొట్టు, వంటా వార్పూ, పనీ పాటు ఏమీ చేతకావు. ఈ జంటని చూసి ఊళ్ళో వాళ్ళంతా ‘గంతకి తగ్గ బొంత’ అనడం మొదలుపెట్టారు. ‘నాన్నా అందరూ మా జంటని చూసి ‘గంతకు తగ్గ బొంత’ అంటున్నారు ఎందుకు?’ అని అడిగాడు రాకేష్‌. అప్పుడు అప్పారావు ఇంట్లో ఉన్న నులక మంచాన్ని చూపించి ‘దీనిని చూడు నులక తెగిపోయి కుక్కి అయిపోయింది. గంత ఉండటం వల్ల పడుకోవడానికి అవడం లేదు. అలాగని కొత్త నులక కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకని దీనిమీద ఒక బొంత పర్చుకుని పడుకుంటున్నాను. ‘గంతకు తగ్గ బొంత’ అంటే ఇదే. నువ్వు ఏ పనీ చెయ్యవు. నీ పెళ్ళానికీ ఏ పనీ చేతకాదు. ఇద్దరూ ఒకరికి కొకరు సరైన జోడీ అని ఊళ్ళో వాళ్ల ఉద్దేశం. అందుకే అలా అన్నారు’ అని చెప్పాడు తండ్రి.

– కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445.

➡️