రాయి కాదు.. ‘రత్న’౦.. ఎక్కడైనా మెరుస్తుంది..

Jun 11,2024 05:55 #feachers, #Jeevana Stories

మీ అమ్మ ఏం చేస్తోంది? అని ఎవరైనా అడిగితే, ‘మా అమ్మ వంట చేస్తుంది. చదువుతుంది. లా అండ్‌ ఆర్డర్‌ కాపాడుతుంది. ఆటలు ఆడుతుంది. పరుగులు పెడుతుంది. బాక్సింగ్‌ చేస్తుంది. పతకాలు సాధిస్తుంది’ అని చెప్పే పిల్లలు ఎంతమంది ఇళ్లల్లో ఉన్నారు? తెలంగాణ, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఇన్ని పనులు చేసే మహిళ ఉన్నారు. రెండేళ్ల బిడ్డకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బుర్రి రత్నకుమారి, మధిర మండలం కృష్ణాపురం త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పగలంతా పోలీసు డ్యూటీలో నిమగమైనా, నెలల బిడ్డకు తల్లైనా, ఇల్లాలిగా తీరిక లేని సమయమున్నా, తనకిష్టమైన క్రీడల్లో ఆమె రాణిస్తున్నారు. ఇల్లాలిగా, తల్లిగా, ఉద్యోగినిగా, క్రీడాకారిణిగా, విద్యార్థిగా బహుముఖ ప్రజ్ఞతో రాణిస్తున్న రత్నకుమారి ఎందరో తల్లులకు ఆదర్శం. మరెందరో గృహిణులకు స్ఫూర్తి.
రత్నకుమారి తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆమె విద్యాభ్యాసం కొనసాగింది. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్‌ చదివింది. సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ కావాలని కలలుగంది. రెండుసార్లు ప్రయత్నించి విఫలమైంది. అయినా వెనుకంజ వేయకుండా కానిస్టేబుల్‌ పోస్టును సంపాదించి, అందులోనే తన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశ పడుతోంది. బాల్యం నుండి క్రీడల పట్ల ఆసక్తి ఉన్న రత్నకుమారి, ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో పతకం తేవాలని లక్ష్యం పెట్టుకున్నారు. పోలీసు విధుల్లో ఉంటూనే పలు క్రీడా పోటీల్లో పాల్గొంటూ తన సత్తా చాటుతున్నారు.
తాజాగా 2024 మే 21 నుండి మాస్టర్స్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన 100 మీటర్లు, 400 మీటర్ల హర్డిల్స్‌ పరుగు పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించారు. అంతకుముందు జరిగిన వివిధ జాతీయ స్థాయి పోటీల్లో రజతం, బంగారు పతకాలు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. ఒక్క పరగు పందెంలోనే కాదు, బాక్సింగ్‌లో కూడా ఆమె రాణిస్తున్నారు. ప్రస్తుతం జాతీయస్థాయి బాక్సింగ్‌ పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ రోజు (జూన్‌ 11) న్యూఢిల్లీలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనబోతున్నారు.


రత్నకుమారి భర్త శ్రీకాంత్‌ ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్నారు. ‘నా భర్త, బంధువులు ప్రోత్సాహం లేకుండా నేను ఈ విజయాలు సొంతం చేసుకోలేను. విధుల్లో ఉన్నప్పుడు, పోటీలకు వెళ్లినప్పుడు పాప బాధ్యత మొత్తం శ్రీకాంత్‌ చూసుకుంటారు. అతని సహకారం లేకుండా నేను ఇదంతా సాధించలేను’ అంటూ తన విజయం వెనుక కుటుంబ సభ్యుల సహకారం గురించి ఆమె చెబుతున్నారు.
‘ఒలింపిక్‌ పతకం గెలవడం, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికవడం నా ముందున్న లక్ష్యాలు. వాటిని సాధించేవరకు వెనుదిరగను’ అంటున్న రత్నకుమారి తల్లి కరోనా సమయంలో మరణించారు. తల్లిదండ్రులు లేకపోయినా, అత్తింటి సహకారం, భర్త ప్రోద్బలంతో ఆమె ఈ విజయ పరంపర కొనసాగిస్తున్నారు. ప్రతి మహిళకూ ఇలాంటి సహకారం, ప్రోత్సాహం ఉండాలి. అప్పుడే ఆమె, వంటింటి నుండి విభిన్న రంగాల్లో అడుగు పెడుతుంది. అనితర సాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. ఎందరో మహిళల్లో గొప్ప స్ఫూర్తిని నింపుతోన్న రత్నకుమారికి ఈ సందర్భంగా హాట్సాప్‌ చెప్పకుండా ఉండలేం..

➡️