మూగజీవులు చెప్పే పాఠం …

Sep 30,2024 05:45 #feachers, #Jeevana Stories

మనం పరికించి చూస్తే చాలు; ఈ విశ్వంలో ప్రతిదీ ప్రేమను పంచమనే చెప్తుంది. మానవుని శ్రమ, మేథస్సులతో పాటు ఈ భూమ్మీద ఉన్న సకల చరాచర జీవరాశుల్లోని ప్రేమ కూడా మానవ పురోభివృద్ధికి కారణమైంది. ప్రేమరాహిత్యపు తనంలో కొట్టుకుపోతున్న మానవాళికి ప్రకృతి ఎప్పటికప్పుడు కొత్త పాఠాన్ని చెప్తూనే ఉంది.
మూగజీవులైన కుక్కలు మనుషుల పట్ల విశ్వాసంతో ఉంటాయి కానీ, నిజానికి మనుషులే వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. మనుషులు ట్రైనింగ్‌ పేరుతో కుక్కలకు ఏదో బోధించేసేమని, తెగ గొప్పలు పోతుంటారు. వాస్తవానికి ఒక కుక్కని దగ్గరికి తీసుకుంటే చాలు… విశ్వాస పాఠాన్ని బోధిస్తుంది. అవసరమైన చోట ఎదిరించి నిలిచే సంఘ చైతన్యాన్ని వివరిస్తుంది.
కుక్కలు మనుషులను ప్రేమించే కథలనూ, మనుషులు కుక్కలను ప్రేమించే కథలనూ చాలా వినే ఉంటాం. అయితే కుక్కలు తోటికుక్కలను ప్రేమించే కథలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈ రోజున ఒక రెండు కుక్కలు- క్లియో, రెయిన్బో మనకొక పాఠాన్ని చెప్పబోతున్నాయి. మానవత్వం పలచనవుతోన్న తరుణాన ప్రేమమయమైన లోకంలోకి నడవమని తమను తామే ఉదాహరణలుగా చూపుతున్నాయి. రండి. క్లియో, రెయిన్బోలను పరిచయం చేసుకుందాం. అవి నేర్పే పాఠాన్ని చేతులు కట్టుకుని విందాం.

ఒకరికి ఒకరై …
ఆ కుక్క పేరు రెయిన్బో. గుంటూరు లక్ష్మీపురం వీధుల్లో తారసపడొచ్చు. బాగా బతికిన మనిషి అన్న చందాన బాగా బతికిన కుక్కే. మంచి బ్రీడ్‌. కారణాలు తెలీదు. అప్పటివరకూ పెంచుకున్న వాళ్ళు రోడ్డున వదిలేశారు. బ్రీడ్‌ డాగ్స్‌ను పెంచేవాళ్లలో ఎక్కువ మంది వాటిని వీధి కుక్కలతో కలవనిచ్చేందుకు ఇష్టపడరు. కానీ, రెయిన్బో తీరు వేరు. రోడ్డు మీద పడ్డాక కొన్నాళ్ళు ఆహారం కోసం బాగా ఇబ్బంది పడింది. ఆ సమయంలో ఒకే ఒక్క రోజు ఒక గోధుమ రంగు కుక్క తన ఆహారాన్ని రెయిన్బోతో షేర్‌ చేసుకుంది. ఆరోజు నుంచీ ఇద్దరికీ స్నేహం కుదిరింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఒక కారు తొక్కడంతో గోధుమ రంగు కుక్క కాలు విగిరింది. ఒకే ఒక్కరోజు తనతో ఫుడ్‌ షేర్‌ చేసుకున్న స్నేహానికి ఈరోజు వరకూ ఆ గోధుమ రంగు కుక్క కోసం కూడా రెయిన్బోనే ఆహారాన్ని సంపాదిస్తుంది.

మనిషిని తట్టిలేపింది!
చిన్నప్పుడు ఆ ఇంట్లో ఏడు కుక్కలూ, అక్షరాలా పద్దెనిమిది పిల్లులూ ఉండేవి. పల్లె వాతావరణంలో ఉండే ఆ ఇంటి చుట్టూ అవి స్వేచ్ఛగా తిరిగి, ఇంట్లో తినేసి చెట్ల కింద పడుకుని నిద్ర పోయేవి. వ్యవహారమంతా సహజంగా ఉండేది. అయితే కెరీర్‌ వాళ్లను నగరానికి తీసుకొచ్చి పడేసింది.
నగర జీవనం వల్లా, అపార్ట్‌మెంట్లలో ఉండటం వల్లా, ప్రవాస జీవితాల వల్లా ఆ కుటుంబం మళ్లీ
పిల్లుల్ని, కుక్కల్ని పెంచే సాహసం చేయలేదు. అయితే ఇంట్లోని చిన్ని పాప పట్టుబట్టడంతో ఒక జర్మన్‌ షెఫర్డ్‌ కుక్క పిల్లను తెచ్చుకున్నారు. బ్రీడ్‌ డాగ్‌ని తెచ్చుకోవాలనే పట్టింపు లేకపోయినా, తెల్సిన వాళ్ల ఇంట్లో అదే జాతి కుక్కని చూసి, ఇష్ట పడింది పాప. అలా క్లియో ఆ ఇంటికి వచ్చింది. అయితే ఆ కుటుంబం అత్యంత ప్రేమతో ఏమీ క్లియోను ఆహ్వానించలేదు. పాప కోరుకుంది కాబట్టి వచ్చింది, అంతే! ఎంతటి అయిష్టం చూపినా, దగ్గర చేరి ప్రేమలో పడేసే మాజిక్‌ జంతువులకు తెలుసు. అలా క్లియో కూడా ఆ కుటుంబాన్ని జయించి ప్రేమలో పడేసింది.
దాన్ని ఉదయం వాకింగ్‌కి తీసుకెళ్ళే డ్యూటీ ఆ పాప వాళ్ల అమ్మ సుజాతది.

ఆ కాలనీలో బ్రీడ్‌ కుక్కల్ని పెంచుకునే చాలామంది ”ఇక్కడ వీధి కుక్కలు తిరుగుతుంటాయి. వాటిని దగ్గరకు రానీకండి. మన కుక్కలకి రోగాలు వస్తాయి” అని ఆమెని చాలా మంది హెచ్చరించారు. ఆమె మాత్రం వాకింగ్‌లో తమ వెంట వచ్చి క్లియోతో స్నేహం చేయాలనుకున్న ప్రతి వీధి కుక్కనూ దగ్గరకు రానిచ్చేది. చిన్ను, కాలూ, తెల్ల మెడ గాడు, ఎర్ర మూతి గాడు, ఇంగ్లీష్‌ బుల్‌ డాగ్‌ గాడు, బిస్కెట్‌ గాడు (ఇవన్నీ ఆమె పెట్టిన పేర్లు) … వాళ్లతోనే నడిచి క్లియోతో ఆడుకునేవి. వాటికి కొన్ని బిస్కెట్లు పెట్టేవాళ్లు. కానీ, వాటికి తిండి సరిగా దొరుకుతుందా లేదా అని ఆలోచించలేదు. అలా బిస్కెట్లు పెట్టడాన్ని రోజూ క్లియో గమనించి, ఆమె చేతిని తన కాలితో తట్టి, కురు కురు అని ఏదో చెప్పేది. ఆటల్లో భాగమనుకుని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. వచ్చేటపుడు మిగిలిన బిస్కెట్లన్నీ తన స్నేహితులకు పెట్టేసే దాకా క్లియో ఊరుకునేది కాదు.
ఒకరోజు క్లియో ఎవరూ ఊహించని పని చేసింది. దానికి అప్పుడు ఏడాది వయసుంటుది. పొద్దున్నే తిండి పెట్టమని దాని బౌల్‌ తెచ్చుకుని కూచుంది. మామూలుగా తొమ్మిదింటికి పెట్టేవాళ్లు.
అది అలా అడుగుతుంటే, ”పాపం బిడ్డకి ఎంత ఆకలి వేసిందో” అని కడుపు నిండా పెట్టారు. మొత్తం తినేసాక వాకింగ్‌కి వెళ్ళారు. చిన్నూ, కాలూ పరిగెత్తుకుని వాళ్ల దగరికి వెళ్లారు. అప్పుడే ఊహకు అందని పని చేసింది క్లియో. వాటిని పక్కకు లాక్కెళ్ళి, ఒక సిమెంట్‌ గట్టు మీద, తను తిన్న ఆహారాన్ని మొత్తం కక్కేసి, వాటి ఎదురుగా కూచుని ”భౌ భౌ” మని అరిచింది. అవి రెండూ వెంటనే దాన్ని తినేశాయి. వేరే చోట దొరికిన ఆహారాన్ని కుక్క తన పిల్లలకు ఇలాగే తెచ్చి పెడుతుంది, ఇదే పద్ధతి! ఆరోజు ఆ దృశ్యాన్ని చూసిన ఆమెకు చెమట్లు పోశాయి. ”వాటికి ఆకలేస్తుంది. బిస్కెట్లు కాదు, కడుపు నిండా తిండి పెట్టు” అని క్లియో ఆమెకు స్పష్టంగా చెప్పింది. ”తనలోని మనిషిని తట్టి లేపిన ఏంజెల్‌ క్లియో” అని ఆమె ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంది.

-జీవన డెస్క్‌.

➡️