వేసవి వేళ ఎన్నో పానీయాలు…

Mar 9,2025 23:49 #basic features, #cool drink, #Summer

ఎండాకాలం క్రమంగా పెరుగుతోంది. విపరీతమైన చెమట కారణంగా డీహైడ్రేషన్‌ సమస్య ఎక్కువగా ఉంటోంది. అలసట కూడా వస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ మాదిరిగానే పొట్టలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా జీర్ణక్రియ సమస్యలు ఎక్కువవుతుంటాయి. ప్రధానంగా అతిసారం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్‌, మలబద్ధకం వంటి జీర్ణక్రియ సమస్యలు పెరుగుతుంటాయి. ఈ సమస్యలకు ముగింపు పలకాలన్నా, కడుపును శాంతపర్చటానికి పొట్టను చల్లబర్చే ఆహారం తినటం చాలా ముఖ్యం. కడుపును చల్లగా ఉంచే పానీయాలు సేవించటం మరింత ఉత్తమం కూడాను. శరీరానికి ఎండల నుంచి ఉపశమనం కోసం ఈకాలంలో లభించే పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే ఎంతోకొంత ఉపశమనం పొందొచ్చు. సీజనల్‌లో దొరికే పండ్లను తీసుకోవటం ద్వారా శరీరానికి మరింత శక్తి ఒనగూరుతుంది. పండ్లుగా తినటమే కాకుండా రసాలు (జ్యూసులు)గా కూడా వీటిని తీసుకుంటే చక్కటి ఆరోగ్యం సొంతమవుతుంది. బొప్పాయి, జామ, ఆపిల్‌, ద్రాక్ష, మామిడి, పుచ్చకాయ వంటివి మార్కెట్లో ప్రస్తుతం విరివిగా దొరుకుతున్నాయి. పండ్లలో బెటాకెరోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌-సి, పొటాషియం, విటమిన్‌-బి కలిగివుండటం వల్ల శరీరానికి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది. మంచి ఆరోగ్యానికి కూడా ఇవి దోహదపడతాయి. పుల్లని నిమ్మ, నారింజ పండ్లలో విటమిన్‌-సి అధికంగా ఉంటుంది. పండ్లుగానూ, జ్యూస్‌లుగానూ కూడా వీటిని తీసుకోవచ్చు. జ్యూస్‌ కన్నా పండ్లను నేరుగా తీసుకోవటం మంచిది. పండ్లలో ఎక్కువశాతం విటమిన్లు, మినరల్స్‌, ఫైబర్లు, ఫ్లావానోయిడ్స్‌ ఉంటాయి. జ్యూస్‌ చేసేటప్పుడు తొక్కను తీసేస్తుంటాం. అలాంటప్పుడు వాటిలో ఉండే ఫైబర్‌, మినరల్స్‌, విటమిన్స్‌ తగ్గిపోతాయి. పండ్లను తీసుకోవటం ద్వారా శరీరంలో షుగర్‌ శాతం పెరుగకుండా ఉంటుంది. పీచు శాతం ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి గ్యాస్ట్రిక్‌ తగ్గిస్తుంది. పండ్ల రసాల్లో పీచుపదార్థం లేకపోవటంతో త్వరగా జీర్ణం అయ్యి, రక్తంలోని షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. పండ్ల రసం కన్నా పండ్ల వల్ల వచ్చే కేలరీలు తక్కువగా ఉంటాయి. జ్యూస్‌లో వాడే చక్కెర వల్ల కేలరీలు పెరిగి, అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. పిల్లలకు జ్యూస్‌లను అలవాటు చేయటం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫాయిటో స్టేరోల్స్‌, ఫ్లావనోయిడ్స్‌ వంటివి శరీర ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. అదే జ్యూస్‌ అయితే ఈ ఫాయిటోకెమికల్స్‌ పండ్ల తొక్కలోనే ఉండిపోతాయి.

కొన్ని పానీయాల గురించి తెలుసుకుందాం
మజ్జిగ : వేసవి పానీయాల్లో మొదటిగా చెప్పుకునేది మజ్జిగ గురించే. శరీరాన్ని ఎండల నుంచి కాపాడి వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోబయాటిక్స్‌ ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. క్యాల్షియం,ప్రొటీన్‌, బి 12 వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజూ కనీసం ఒక్క గ్లాసైనా తాగాల్సిందే.
కొబ్బరి బోండాం : సమ్మర్‌లో మరో హెల్దీ డ్రింక్‌గా కొబ్బరిబోండాంను చెబుతుంటారు. వేసవి తాపాన్ని తట్టుకోవటానికి రోజుకు ఒక గ్లాస్‌ కొబ్బరినీటిని తీసుకుంటే మంచిది. దీనివల్ల అందులోని ఎలక్ట్రోలైట్స్‌ మన శరీరానికి అందుతాయి. మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంట వంటి సమస్యలు పోతాయి. శరీరాన్ని చల్లబరుస్తాయి. ఈ కాలంలో తరచూ కొబ్బరినీటిని తాగటం ఎంతో మంచిది. ఒక గ్లాసు కొబ్బరి నీటిలో 9 శాతం ఫైబర్‌ ఉంటుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎసిడిటీ వేధిస్తుంటే గ్లాసు కొబ్బరినీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది.
చెరకు రసం : చెరకును ముక్కలుగా కట్‌ చేసి నమలొచ్చు. మిషన్‌ ద్వారా చెరకు రసం కూడా తీసి తాగొచ్చు. దీనిని తీసుకోవటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. వేడికారణంగా అలసిన శరీరానికి దీనివల్ల ఉపశమనం లభిస్తుంది. చెరకు రసాన్ని కూడా బెస్ట్‌ సమ్మర్‌ డ్రింక్‌గా చెబుతారు. అలసట, నిస్సత్తువ మాయమవుతాయి. శరీరాన్ని రీ హైడ్రేట్‌ చేస్తుంది. ఇందులో సమృద్ధిగా ఉన్న ఫైబర్‌ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు పోతాయి.
పుచ్చకాయ : వేసవిలో శరీరానికి ఉపశమనం కల్పించేవాటిలో పుచ్చకాయలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులో నీటిశాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని తినటం వల్ల డీహైడ్రేషన్‌ సమస్య తగ్గుతుంది. కాయను ముక్కలుగా చేసి తినొచ్చు. లేదా డ్రింక్‌గా తయారుచేసుకుని తాగొచ్చు. వేసవిలో దీనిని బెస్ట్‌ సమ్మర్‌ డ్రింక్‌గా పిలుస్తుంటారు.
పచ్చి మామిడి రసం : పచ్చిమామిడిని కూడా ముక్కలుగా కోసి తినొచ్చు. లేదా మిక్సీలో వేసి రసంలా చేసి తాగొచ్చు. ఇది కూడా వేసవి తాపాన్ని తగ్గించేసి శరీరానికి శక్తినిస్తుంది. దీనివల్ల హైడ్రేట్‌గా కూడా ఉండొచ్చు. టిఫిన్‌ లేదా భోజనం ఒకవేళ ఆలస్యమైనా రోజంతా అలసట రాకుండా ఉంటుంది. ప్రస్తుతం తోతాపురి, చిన్నరసాలు, బంగినపల్లి మామిడి కాయలు మార్కెట్లోకి వస్తున్నాయి.
కోల్డ్‌ కాఫీ, టీ: చాలామంది ప్రతిరోజూ కాఫీ తాగుతుంటారు. ప్రతిసారీ హాట్‌ కాఫీ తాగేబదులుగా ఈ సీజన్‌కు తగ్గట్టుగా కోల్డ్‌ కాఫీ తాగటం కూడా మంచిదే. మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. టీ కూడా అంతే. చల్లగా కూడా తీసుకోవచ్చు. పాలు లేకుండా డికాషన్‌లో నిమ్మరసం వేసి దానిని చల్లబరిచి తీసుకోవచ్చు. తద్వారా అలసట కూడా తగ్గుతుంది.
లస్సీ : పెరుగుతో చేసిన లస్సీ కూడా మంచి రీఫ్రెషింగ్‌ డ్రింక్‌గా చెబుతారు. దీనిని తీసుకోవటం వల్ల శరీరం చల్లబడుతుంది. ఎంత వేడిగా ఉన్నా కాస్తా లస్సీ తాగితే చాలా రిలాక్స్‌గా ఉంటుంది. పడుకునే ముందు పటిక బెల్లం వేసిన పాలు తాగితే చాలా మంచిది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది.
నిమ్మనీరు : ఎండాకాలంలో తప్పకుండా తాగాల్సిన నీరు నిమ్మరసం. ఈ రసాన్ని నీటిలో పిండి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పంచదార వేసి షర్బత్‌లా తీసుకోవచ్చు. చక్కటి ఉపశమనం శరీరానికి వస్తుంది. మనం తీసుకునే ఆహారం జీర్ణం కావటానికి నిమ్మరసంలోని యాసిడ్స్‌ తోడ్పడతాయి.ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి జీర్ణ సమస్యలు రావు. ఒంట్లో నీటిశాతం పడిపోకుండా రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగటం అలవాటు చేసుకోవాలి. సబ్జాగింజలు నానబెట్టిన నీటిలో నిమ్మరసం పిండి తీసుకుంటే ఇంకా మంచిది. ఈ డ్రింక్‌ శరీరంలో ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది.

➡️