‘ఆ’ సమస్యపై బహిరంగ చర్చ అవసరం..

కొన్ని విషయాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ ఆరోగ్యపరంగా వాటి పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళల విషయంలో ఇవి చాలా ప్రభావం చూపిస్తుంటాయి. అలా పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు అంతంతమాత్రమే ఉన్నచోట వారు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇటీవల రైల్వే బోర్డుకు మహిళా లోకో పైలట్లు రాసిన లేఖలో ఇది స్పష్టమైంది. ‘పేలవమైన పని పరిస్థితులు తమ ఆరోగ్యానికి హాని కలిగించాయని, సరైన మరుగుదొడ్లు లేక యుటిఐ, గర్భస్రావాలకు కూడా కారణమయ్యాయ’ని ఆ ఉద్యోగినులు ఆవేదనతో రాసిన లేఖ చర్చకు దారితీసే అంశం. తాము ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి ఎదురైన అనుభవాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం.

మీనా (పేరు మార్చబడింది) మధ్యప్రదేశ్‌ వాసి. అసిస్టెంట్‌ లోకోపైలట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 2021 మే నెలలో విధుల్లో ఉండగానే ఆమెకు పొట్టకింద భాగంలో విపరీతమైన నొప్పి వచ్చింది. మొదట్లో అది మామూలు గ్యాస్‌ నొప్పని ఆమె అశ్రద్ద చేసింది. అంతకుముందు చాలాసార్లు తను ఆ నొప్పిని భరించింది. కానీ ఈసారి అలా లేదు. దీంతో డాక్టరుని కలిసింది. అక్కడ ఆమెకి ఓ చేదు నిజం తెలిసింది. ‘డాక్టర్లు మొదట నాకు పెయిన్‌కిల్లర్‌లు ఇచ్చారు. అయితే సోనోగ్రఫీ చేయించుకోమని సూచించారు. నేను మొదట ఇది గ్యాస్‌ నొప్పని భావించాను. ఒకవేళ అదీ కాకపోతే యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటుందని అనుకున్నాను. కానీ ఆ రెండు జరగలేదు. సోనోగ్రఫీ పరీక్షలో నా కిడ్నీ పక్కన పెద్ద చీముగడ్డ తయారైందని తేలింద’ని ఆమె చెప్పింది. వెంటనే దానికి చికిత్స తీసుకోకపోతే, ఆ గడ్డ పగిలి, అంతర్గత అవయవాలు దెబ్బతింటాయని డాక్టర్లు మీనాకి చెప్పారు. సిక్‌ లీవ్‌ తీసుకుని ఆపరేషన్‌ చేయించుకుంది. సకాలంలో తెలుసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డావని డాక్టరు అన్నారు. యూరినరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్లే గడ్డ ఏర్పడినట్లు తెలుసుకున్న మీనా పని ప్రదేశంలో తను, తనలాంటి వారు పడే ఎన్నో ఇబ్బందులపై మాట్లాడారు.

నీళ్లు తక్కువ తాగేవాళ్లం
గూడ్సు ట్రైన్‌ లోకో పైలట్‌గా మీనా సుదీర్ఘ పని గంటలు పనిచేస్తున్నారు. ‘బ్రేక్‌ లేకుండా 12 గంటలు పనిచేయాలి. ఈ సమయంలో మా సిబ్బందిలో ఎవరమూ వాష్‌రూమ్‌ ఉపయోగించుకునేవాళ్లం కాదు. యూరిన్‌ రాకుండా ఉండేందుకు నీళ్లు తక్కువ తాగేవాళ్లం. ఒకవేళ వెళ్లాల్సివచ్చినా, బలవంతంగా ఆపుకునేవాళ్లం. ఇలా చాలా సార్లు జరిగింది. ఇలా చేయడం వల్లే నేను ఇంత అనారోగ్యానికి గురయ్యాను. అయితే ఈ సమస్య నా ఒక్కదానిదే కాదు’ అంటున్నారు ఆమె.

ప్లాట్‌ఫామ్‌, రన్నింగ్‌రూమ్‌లోనే..
ఉత్తరప్రదేశ్‌కి చెందిన సమీరా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి ఇలా చెబుతోంది. ‘సాధారణంగా చాలా ట్రైన్లలో వాష్‌రూమ్‌ క్యాబిన్లు ఉండవు. ఒకవేళ ఉన్నా వాటిల్లో ఎక్కువ గంటలు నీటి సౌకర్యం ఉండదు. స్టేషన్లో కూడా మాకోసం స్పెషల్‌ వాష్‌రూమ్‌లు లేవు. అర్జంటుగా వెళ్లాల్సివచ్చినప్పుడు మేము స్టేషను ప్లాట్‌ఫామ్‌ లేదా రన్నింగ్‌ రూమ్‌ వరకు వెళతాం. అక్కడికి చేరుకోవడానికి సుమారు 5 నిమిషాలు పడుతుంది’ అని అంటోంది.

30 ఏళ్ల సమీర వివాహిత. పిల్లలను కనాలని ప్లాన్‌ చేసుకుంటోంది. ఈ సమయంలోనే ఆమె మొదటిసారి గర్భం దాల్చింది. పుట్టబోయే పండంటి బిడ్డ కోసం ఎన్నో కలలు కంది. అయితే విపరీత పనిగంటలు, ఒత్తిడి వల్ల మూడు నెలలకే ఆమె తన బిడ్డను కోల్పోయింది. ఇది ఒకటి, రెండు సార్లు కాదు. వరుసగా నాలుగైదు సార్లు జరిగింది. ఈ బాధ ఆమెని మానసికంగా కుంగదీసింది. ఇప్పుడు ఆరోసారి గర్భందాల్చినా ఆమె తీవ్ర భయందోళనల మధ్యే విధులకు హాజరవుతోంది.

ప్రత్యేక సదుపాయాలు లేవు
లోకోపైలట్‌ జూహీ కూడా తన అనుభవాన్ని ఇలా చెబుతోంది.. ‘పని ప్రదేశంలో మరుగుదొడ్ల సమస్య ప్రతి మహిళా ఎదుర్కొనే సాధారణ సమస్య. ఒక్క మరుగుదొడ్లే కాదు, ఏ పని చేయాలన్నా వారి శక్తికి మించి పనిచేయాల్సి వస్తుంది. మాల్స్‌, హోటల్స్‌, హాస్పిటల్స్‌, బట్టల దుకాణాలు వంటి తదితర సంస్థల్లో పనిచేసే మహిళల కోసం అక్కడ ప్రత్యేక సదుపాయాలంటూ ఏమీ ఉండవు. మా క్యాబిన్‌ నుండి కిందకి దిగడానికి మేము నిచ్చెనలు ఉపయోగించాల్సి వస్తుంది. అవి నేల నుండి చాలా ఎత్తుకి బిగించబడి ఉంటాయి. దీంతో మేము 3 నుండి 4 అడుగుల దూరం కిందికి, పైకి దుమకాల్సి వస్తుంది. ఒక్కోసారి గూడ్సు ట్రైను ప్లాట్‌ఫారమ్‌ దగ్గర ఆగదు. అప్పుడు మా బాధ మరింత పెరుగుతుంది’ అని చెప్పిన జూహీ, గతేడాది తన క్యాబిన్‌ నుండి కిందికి దిగుతూ కాలు జారి పడిపోయింది. భుజాలకి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స తీసుకుని విధుల్లో చేరినా లోకోపైలట్‌గా పనిచేసే శక్తి లేక ఆఫీసుపని చేస్తానని అభ్యర్థించింది. అయితే చాలా తక్కువ కాలంలోనే తిరిగి విధుల్లోకి చేరమని ఆమెపై ఒత్తిడి ఎక్కువైంది. ఈ పరిస్థితినే ఆమె తన మాటల్లో ఇలా చెబుతోంది.
‘చాలా మంది మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని కోరుకుంటారు. కానీ పని చేసే చోట సరైన మౌలిక సదుపాయాలు లేక నానా యాతనలు పడతారు. మహిళలు పనిచేసే ప్రతి రంగంలోనూ ఆమెకంటూ ప్రత్యేక వసతులు కల్పించడం కనీస బాధ్యత’ అని జూహీ తన ఆవేదనను వ్యక్తపరిచారు.
ఇండియన్‌ రైల్వేస్‌లో మహిళా లోకోపైలట్లు 2000 మందికి పైగా ఉన్నారు. వీరిలో అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న వారిలో అత్యధికులు యూరినరీ ఇన్‌ఫెక్షన్ల సమస్యతో బాధపడుతున్నవారేనని ఓ ప్రముఖ మీడియా సంస్థ చేసిన సర్వేలో తేలింది. అపరిశుభ్ర వాతావరణం వల్ల యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌, యుటైరన్‌ ఫైబ్రాయిడ్స్‌, అధిక రక్తపోటు, గర్భస్రావాలు తరచూ ఈ లోకోపైలట్లు ఎదుర్కొంటున్నట్లు కూడా నివేదికలో స్పష్టమైంది.

మీనా, సమీర, జూహీ.. మాత్రమే పని ప్రదేశంలో సమస్యలు ఎదుర్కొనడం లేదు. ఏ రంగమైనా, ఏ స్థాయి ఉద్యోగమైనా ప్రతి మహిళా కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఆ సమస్యలు వెలుగులోకి వస్తాయి. సమస్యలపై స్పందించడంలో ఈ మహిళలు ఒకడుగు ముందుకు వేశారు. వీరు వేసిన బాట ఎంతోమందికి ఆదర్శం.

➡️