బాల్యం నుంచే సమానత్వ భావన

Jun 8,2024 04:05 #Jeevana Stories

‘అమ్మ వంటింట్లో పనిచేస్తుంది. నాన్న ఆఫీసుకు వెళ్తాడు. అమ్మ ఇంటి పనులు చేస్తుంది. నాన్న బజారుకెళ్లి కూరగాయలు, సరుకులు తెస్తాడు’.. ఇదే, ఏళ్ల తరబడి మన సమాజమూ, చదువులూ పిల్లలకు చూపిస్తున్న దృశ్యం. స్త్రీ పురుషుల మధ్య అంతరాలను కొనసాగించే ఈ ధోరణి మారాలంటే ఓ ఉద్యమమే రావాలి. ప్రణాళికాబద్ధమైన కృషి జరగాలి. ఈ విషయంలో కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేస్తోంది. బాల్యం నుంచే పిల్లలకు లింగ సమానత్వ భావనను అలవాటు చేస్తోంది.
వేసవి సెలవులు ముగిసి మళ్లీ బడికి సిద్ధమైన పవిత్ర కృష్ణ, ఈ ఏడాది 3వ తరగతిలోకి అడుగు పెడుతోంది. కొత్త పాఠ్య పుస్తకాలు తీసుకుని ఇంటికి వచ్చాక, ఆ చిన్నారి వాటన్నింటినీ పరిశీలనగా చూసింది. మలయాళ మీడియం టెక్స్ట్‌ బుక్‌పై ముద్రించిన ఓ చిత్రం తనని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఉత్సాహంతో పరుగున నాన్న దగ్గరికి వెళ్లింది. ‘నాన్నా… నాన్నా … ఈ బమ్మ చూడు. వంటగదిలో అమ్మతో పాటు నాన్న కూడా పనిచేస్తున్నాడు. అమ్మకు సాయం చేస్తున్నాడు. మరి నువ్వెందుకు నాన్నా, ఎప్పుడూ వంటగదిలోకి రావు? అమ్మ ఒక్కత్తే కష్టపడుతుంది!’ అని అడిగింది. పవిత్ర లాంటి చిన్నారుల మెదళ్లలో అలాంటి ఆలోచనలు, ప్రశ్నలూ రేకెత్తేలా కేరళ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను రూపొందించింది. పవిత్ర తన తండ్రికి చూపించిన బమ్మలోా వంటగదిలో పనిచేస్తున్న అమ్మ, కత్తిపీటతో కొబ్బరి తురుముతున్న నాన్న, చుట్టూ పిల్లలు ఉంటారు. చాలా చిన్న చిన్న బమ్మలతోనే పిల్లలకు అర్థమయ్యే భాషలో లింగ సమానత్వం గురించి వివరంగా చెప్పారు.
2021 నుంచీ …
రాష్ట్రంలో లింగ సమానత్వాన్ని పాటించటానికి, వరకట్న నేరాలకు అడ్డుకట్ట వేయటానికీ కేరళ ప్రభుత్వం 2021లో ఒక బృహత్తర కార్యక్రమం ప్రారంభించింది. మహిళలకు తక్కువ చేసి చూపించే పదాలను పాఠ్య పుస్తకాల నుంచి తొలగిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పట్లో ప్రకటించారు. ఆవిధంగానే పాఠ్య పుస్తకాల్లో మహిళలను ఉద్దేశించి లిఖించిన అగౌరవ పదాలను తొలగించారు. లింగ సమానత్వాన్ని ప్రబోధించే కథలూ, బమ్మలూ పాఠ్యపుస్తకాల్లో ఉండేలా చర్యలు చేపట్టింది.
కొన్ని రాష్ట్రాల్లో వివక్షపూరిత రాతలు
కొంత కాలంగా బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాల ద్వారా, చిన్నారి మెదళ్లల్లో విషపు బీజాలు నాటుతున్నాయి. లింగవివక్షను పెంచి పోషించే కథనాలు ప్రచురిస్తున్నాయి. 2017లో మహారాష్ట్ర 12వ తరగతి పాఠ్య పుస్తకంలో వరకట్నంపై రాసిన రాతలు అందుకు ఒక ఉదాహరణ. ‘అందవికారంగా, అంగవైకల్యంగా ఉన్న అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడం చాలా కష్టం. అటువంటి వారిని పెళ్లి చేసుకోవడానికి వరుడు అధిక కట్నం డిమాండ్‌ చేస్తార’ని అందులో రాశారు. 2006లో రాజస్థాన్‌ పాఠ్య పుస్తకాల్లో గృహిణులను గాడిదలతో పోల్చిన కథనాలు వల్లె వేయించారు. ‘గాడిద, ఒక గృహిణి లాంటిది. అది రోజంతా కష్టపడుతుంది. తిండి, నీళ్లు లేకుండా పనిచేస్తుంది’ అని రాశారు. ఇంకా ‘గృహిణి కంటే గాడిద చాలా ఉత్తమమైనది. గృహిణులు ఏదైనా సందర్భాల్లో చాకిరీ నుంచి తప్పించుకునేందుకు పుట్టిళ్లకి వెళతారు. కానీ గాడిదలు అలా కాదు, ఎంత చాకిరీ చేసినా యజమానిని వదిలిపెట్టవు’ అని ప్రచురించారు. ఈ కథనంపై తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత అదంతా సరదా కోసం చేసిన పోలికని సమర్థించుకున్నారు. నిజానికి ఈ రాతలు, పోలికలు హాస్యాన్ని కలిగించవు. పిల్లల మెదళ్లలో పురాతన భావాలను పెంచి పోషిస్తాయి.
యునెస్కో ఏం చెప్పింది?
యునెస్కో వారి గ్లోబల్‌ ఎడ్యుకేషనల్‌ మోనిటరింగ్‌ రిపోర్ట్‌ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ముద్రితమవుతున్న పాఠశాల పాఠ్య పుస్తకాల్లో మహిళలు, బాలికలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పితృస్వామ్య భావాలను, సనాతన అభిప్రాయాలను బలపరిచే కాలం చెల్లిన పాత్రల్లోనే వారు తరచూ కనిపిస్తున్నారు. ఒక సర్వే ప్రకారం 188 భారతీయ టెక్స్ట్‌ బుక్స్‌ల్లో అధిక భాగం అంటే 114 (60.6) పుస్తకాల్లో పురుష పాత్రలే ప్రధాన భూమికగా ఉన్నాయి. 13 (6.9) మాత్రమే మహిళ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చాయి. ఇంగ్లీషు, హిందీ, గణితం, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ పాఠ్య పుస్తకాల్లో సగానికి పైగా చిత్రాలు, కథనాలు పురుష పాత్రలతోనే నిండిపోయాయి.
ఉదాహరణకు రాజస్థాన్‌ 9వ తరగతి, ఇంగ్లీషు రాపిడ్‌ రీడర్‌ పాఠ్య పుస్తకంలో ‘రిజిగేషన్‌’ (రాజీనామా) అన్న పాఠంలో మగపిల్లలు లేని కథానాయకుని బాధలను ఒక వాక్యంలో ఇలా రాశారు. ‘అతని చుట్టూ ఒక నిరాశ, ఓటమి ఉంది. అతనికి కొడుకులు లేరు. ముగ్గురూ కుమార్తెలే. సోదరులు లేరు. మేనకోడళ్లే ఉన్నారు’. ఈ వ్యాఖ్యలు భ్రూణ హత్యలకు ప్రేరేపించేవిగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి.
పాఠశాల స్థాయిలోనే పిల్లల మెదళ్లలో విష బీజాలు నాటడం భవిష్యత్తు సమాజాన్ని తిరోగమనం పట్టించడమే. లింగ వివక్ష, స్త్రీద్వేషం, పితృస్వామ్య ఆదర్శాలు వంటి భావనలకు విద్యావ్యవస్థలో శాశ్వత స్థానం కల్పించడం హానికర పరిణామాలకు దారితీస్తాయి. పిల్లల్లో గ్రాహక శక్తి అద్భుతంగా ఉంటుంది. వారి చుట్టూ ఏర్పడిన వాతావరణం, నమ్మకాలు యుక్తవయసులో వారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి. వారి దృక్పథంలో మార్పులు తెస్తాయి. ఇలాంటి వాతావరణంలో కేరళ చేస్తున్న కృషి అభినందనీయం. అనుసరణీయం.

➡️