కృషి ఉంటే ఉన్న స్థానంలో నుంచి ఉన్నత స్థానానికి చేరుకోవొచ్చని; చదువూ, సాధనలను జంట దీపాలుగా వెంట పెట్టుకొని సమస్యల చీకట్లను అధిగమించవచ్చునని ఉదాహరణగా చూపే జీవితం బి.నాగరాజుది. అర్ధాంతరంగా ఆగిపోయిన చదువుని పట్టుదలతో సాగించాడు. కుటుంబంకోసం చిరుద్యోగం చేస్తూనే – చదువులో ఒక్కొక్క మెట్టూ ఎక్కాడు. ఉద్యోగం చేసే చోట ఖాళీ సమయాన్ని నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని పెంచుకోవటానికి ఉపయోగించుకున్నాడు. ఆఫీసు బారు దశ నుంచి పిహెచ్‌డి స్కాలర్‌గా, అసిస్టెంటు ప్రొఫెసరుగా ఎదిగాడు. ఆయన ప్రస్థానాన్ని తన మాటల్లోనే విందాం.
మాది కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని ఒక మారుమూల గ్రామం. మా తాత గారు కాలువల్లో చేపలు పట్టి ఊళ్లో అమ్మేవారు. ఉన్న గ్రామంలో బతుకుదెరువు కష్టం కావడంతో మా కోసం మా నాన్న విజయవాడ వచ్చి చిన్న చిన్న పనులు చేసేవారు. రోడ్లపై తిరుగుతూ ఇడ్లీలు అమ్మేవారు. తరువాత కొంత కాలానికి ప్రజాశక్తి దినపత్రికలో ఆఫీస్ బోరుగా కుదిరారు. నేను పదవ తరగతిలో వుండగా ఆయనకు ఆకస్మికంగా ఆరోగ్యం క్షీణించి మంచాన పడ్డారు. కుటుంబ పరిస్థితుల కారణంగా మా నాన్న చేసే పనిలో నేను చేరాను.
విలేకరులు బస్సు ద్వారా పంపిన వార్తా కవర్లను బస్టాండుకు వెళ్లి అక్కడ బాక్స్ నుండి ప్రజాశక్తి కార్యాలయానికి తీసుకురావడం, కార్యాలయంలోని సిబ్బందికి టీలు, కాఫీలు తెచ్చి పోసివ్వడం నా పని. పనిలేని సమయంలో వార్తా పత్రికలు చదువుకుంటూ కూర్చునేవాడిని. కంప్యూటర్‌పై తెలుగు ప్రాక్టీసు చేస్తూ ఉండేవాడిని. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా కంప్యూటర్‌ని వదిలేవాడిని కాదు. కృష్ణాజిల్లా డెస్క్ ఇన్‌ఛార్జి రామకృష్ణ, కంప్యూటర్ విభాగపు ఇన్‌ఛార్జి జె.వి.శ్రీనివాసరావు నన్ను కంప్యూటర్ నేర్చుకోమని ప్రోత్సహించారు. ఆఫీసు బోరుగా రెండేళ్లు గడిచిపోయాయి.
చిన్నప్పటి నుండి మా నాన్న పడే కష్టాన్ని చూసి, బాగా చదువుకోవాలని, ఉన్నత స్థితికి వెళ్లాలని మనసులో బలంగా అనుకునేవాణ్ణి. ఆ కోరిక నన్ను ఇంటర్‌లో చేరేలా చేసింది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల సహాయంతో విజయవాడ ఎస్.ఆర్.ఆర్.అండ్ సి.వి.ఆర్. గవర్నమెంట్ కళాశాలలో ఇంటర్ చేరాను. పగలు కళాశాలకు వెళుతూ, రాత్రి ఆఫీసు బోరుగా పనిచేసేవాడిని.
ఒకరోజు కృష్ణాజిల్లా డెస్క్ డిటిపి ఆపరేటర్ రాకపోవడంతో డెస్క్ ఇన్‌ఛార్జి నాతో వార్తలను టైప్ చేయించారు. ఒకటి, అర మినహా దాదాపు తప్పులు లేకుండానే టైప్ చేశాను. కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడానికి అన్నివిధాలా సరిపోతానని సిబ్బంది దృష్టిలో పడింది. అప్పటి ఎడిషన్ ఇన్‌ఛార్జి ఎస్.వెంకట్రావు గారి అనుమతితో తెలుగు టైపు పరీక్ష పెట్టారు. గంటకు మూడు వేల క్యారెక్టర్స్ టైప్ చేస్తే పాసైనట్లే. అయితే నేను ఏడు వేల క్యారెక్టర్ టైప్ చేశాను. దీంతో కృష్ణా జిల్లా డెస్క్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా నియమించారు. రోజూ వార్తలను టైప్ చేయడంవల్ల వాక్యాలను సరళంగా రాయడం, ఎడిటింగ్ చేయడం నేర్చుకున్నాను. దీంతో నన్ను కంప్యూటర్ ఆపరేటర్ నుండి సబ్ ఎడిటర్‌గా ప్రమోట్ చేశారు.
మరోపక్క ఇంటర్ పూర్తిచేసి అదే కళాశాలలో డిగ్రీ చేరాను. పగలు కళాశాలకు వెళుతూ, రాత్రి ప్రజాశక్తిలో పనిచేస్తూ డిగ్రీ కూడా పూర్తిచేశాను. ఇంకా ఉన్నత చదువులకు వెళ్లాలని మనసులో వున్నా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు నన్ను వెనక్కి నెట్టేస్తూ వుండేవి. మళ్లీ రెండు సంవత్సరాలు చదువు ఆపాల్సివచ్చింది. ఆ రెండేళ్లూ మా అమ్మానాన్నలకు తెలియకుండా ఆరువేల రూపాయలు దాచిపెట్టాను.
నేను ఉద్యోగం మానేసి ఎం.ఎ. (ఇంగ్లీషు) చదువుతానని మా అమ్మానాన్నలకు చెబితే వారు షాక్‌కు గురయ్యారు. నా ఆర్థిక పరిస్థితి చూసి రామకృష్ణ గారు ఉద్యోగం మానవద్దని వారించారు.
‘అసలే ఇల్లు గడవడం కష్టంగా వుంది. నాన్న మంచాన ఉన్నారు. నువ్వు తెచ్చే ఆదాయంతోనే ఇల్లు గడపగలుగుతున్నావు. ఈ పని మానేసి చదువుకుంటే, ఇల్లు ఎలా గడుస్తుంది?’ ఉద్యోగం మానొద్దని హితవు పలికారు. తెలిసినవారంతా కుటుంబానికి బతుకుదెరువేంటని ప్రశ్నించారు.
ఈ చిన్న జీవితానికి చదువు కోవడం ఇంత కష్టమైపోయిందా అనిపించింది. ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేసినా మనస్సు మాత్రం ‘చదువే నీ జీవితం’ అని సమాధానం చెప్పింది.
ఉద్యోగం వదిలేసి జీవితంలో పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. దాచుకున్న ఆరువేల రూపాయలతో విజయవాడ పి.బి.సిద్ధార్థ కళాశాలలో ఎం.ఎ.(ఇంగ్లీషు)లో చేరాను. కుటుంబ అవసరాల కోసం తెలిసినచోటల్లా అమ్మ అప్పు తెచ్చింది. ఎం.ఎ. ఆఖరి సంవత్సరంలో వుండగా మరో పెద్ద అవాంతరం జీవితాన్ని కుదిపేసింది. పాన్‌క్రియాటిక్ (క్లోమగ్రంధి)ఇన్‌ఫెక్షన్ రావడంతో దాదాపు 15 రోజులు హాస్పిటల్‌లో ఉంచారు. తిండి లేకుండా 15 రోజులు సెలైన్లు, మందులపైనే హాస్పిటల్‌లో వుంచడంతో శరీరంలో శక్తి అంతా పోయి, బతుకుతానో, లేదో అనే అనుమానం కలిగింది.
‘సాగిపోవడమే జీవితం, ఆగిపోవడమే మరణం’ అని ఎవరో మహానుభావుని మాటలు గుర్తొచ్చాయి. సత్తువంతా కూడగట్టుకొని మళ్లీ జీవితాన్ని గాడినపెట్టాను. ఎం.ఎ. ఇంగ్లీషు పూర్తిచేసిన తర్వాత చదువుపై ఉన్న ఆసక్తి వల్ల ఉపాధ్యాయ వృత్తిపై నా దృష్టి మళ్లింది. ఉపాధ్యాయ వృత్తిలో నిరంతరం జ్ఞాన సముపార్జన చేసే అవకాశం ఉంటుంది. ఎంతో మంది యంగ్‌మైడ్స్‌కి జ్ఞాన సంపాదన ప్రాముఖ్యాన్ని తెలిపే అవకాశం దక్కుతుంది. ఆ ఉద్దేశంతో ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని నిశ్చయించు కున్నాను. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం తెచ్చుకోగలిగాను. ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఈ రంగంలో మెళకువలు తెలుసు కోవడానికి, విద్యార్థులకు ఆసక్తిగా పాఠ్యాంశాలు చెప్పడానికి ఎంతో సాధన చేసేవాడిని. కళాశాలలో పనివేళలు అయిన తర్వాత పుస్తకాలు ముందువేసుకొని రాత్రి 11, 12 గంటల వరకు సమయం తెలియకుండా చదువుతుండేవాడిని. ఏరోజైనా వార్తాపత్రిక, పుస్తకాలు చదవకపోతే, ఆ రోజు నాకు అసంపూర్తిగా వుండేది.
2014లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో ఎం.ఫిల్ పూర్తిచేశాను. తర్వాత అదే విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి.లో చేరి అభివృద్ధి చెందుతున్న దేశాలపై తెల్లవారి వలస వాదం (కలోనియలిజం) అనే అంశంపై పరిశోధన చేసి, పరిశోధనా గ్రంథాన్ని (థీసిస్) సమర్పించాను. 2022లో ఎ.పి.సెట్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో, 2023లో టి.ఎస్.సెట్ (తెలంగాణా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో అర్హత సాధించాను.
జీవితం అల్లకల్లోలమైనా, అనుకోని అవాంతరాలు బతుకుబండిని తలకిందులు చేసినా మెట్టు మెట్టు పేర్చుకుంటూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలగడం నా జీవితానికి సంతృప్తినిచ్చింది. ఎన్ని సమస్యలు ఎదురైనా, పనే పరమాత్మ అనే భావనతో కష్టించడం నాకు ఆనందాన్ని ఇచ్చింది.
నా ఈ చిన్న జీవన ప్రయాణంలో చదువు నాకు జీవిత సత్యాన్ని, పరమార్దాన్ని తెలిపితే, ఎందరో మహానుభావులు తమ వంతు చేయూతనిచ్చి ఈ సమాజంపై నా మనస్సులో ప్రగాఢమైన కృతజ్ఞతా భావాన్ని నెలకొల్పారు. ఈ సమాజానికి నేను ఎంతో రుణపడి వున్నాను.
– బి.నాగరాజు, ఎం.ఎ, ఎం.ఫిల్, (పిహెచ్.డి),
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్ విభాగం
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల, కృష్ణా జిల్లా. సెెల్ : 99597 06703