ఒకప్పటిలా ఇప్పుడు ఏదీ లేదు. ఆచారం పేరుతో ఆర్భాటాలు ఎక్కువయ్యాయి. పెళ్లి, పేరంటం, బారసాల, రజస్వల.. ఫంక్షన్ ఏదైనా.. తాహతుకి మించి ఖర్చులు చేస్తున్నారు. అయితే ఇదంతా గతం.. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు డ్యాన్సులు వేసే ఆచారం గతం నుండే ఉంది. చావుకి, తదనంతర క్రతువులకు పాటలు పాడే సంస్కృతి గురించి కూడా తెలుసు. అలాగే బీహార్ రాష్ట్రంలో ‘బాజీకా నాచ్’ పేరుతో పెళ్లిళ్లు, ఫంక్షన్లకు డ్యాన్సర్లతో నృత్యాలు చేయించే ఆచారం ఎప్పటి నుండో ఉంది. ఇప్పుడు అది చావుకి కూడా పాకింది. ఈ పైత్యం ఇంకా ముదిరి చచ్చిన వాళ్ల హోదాని తెలియజేసేందుకు, వాళ్ల కులం గొప్పతనాన్ని చెప్పేందుకు తుపాకీలతో బహిరంగంగా కాల్పులు జరుపుతున్నారు. ఇలా చేస్తున్నప్పుడే బుల్లెట్ తగిలి ఇటీవల ఓ యువకుడు మరణించాడు. ఈ మొత్తం వ్యవహారంలో సనాతనం, మనువాదం ముసుగులో కులం పెద్ద పీట వేస్తోంది. డ్యాన్సర్లని పిలవడం వెనుక మహిళల పట్ల అసభ్య ప్రవర్తన పెచ్చుమీరుతోంది.
బీహార్‌లో భోజ్‌పూర్, ఔరంగాబాద్, రోహతాస్ వంటి చోట్ల చావులను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతోంది. పొట్ట కూటి కోసం పెళ్లిళ్లు, పండగలకి డ్యాన్సులు వేసే మహిళలకు చావులకు కూడా డ్యాన్సులు వేయమని ఆహ్వానాలు అందుతున్నాయి. చేతుల్లో తుపాకీలు పట్టుకుని, గాల్లో కాల్పులు జరుపుతూ రాత్రంతా నృత్యాలు చేయడం వారి పని. తుపాకీ కాల్పులు లేకపోతే ఆ చావు కార్యక్రమం పూర్తికానట్లే అని అక్కడ చాలామంది పెద్దలు భావిస్తున్నారు.
సాధారణంగా సమాజాన్ని ప్రభావితం చేసిన, గౌరవప్రదమైన వ్యక్తులు మరణిస్తే వారి గౌరవార్థం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తారు. ఆ కార్యక్రమంలో గాల్లోకి తుపాకీలు పేల్చడం ఆనవాయితీ. సరిగ్గా ఇక్కడ కూడా ఇదే జరుపుతున్నామంటారు అక్కడి పెద్దలు. అయితే ఇక్కడ ఆ వ్యక్తి గౌరవం కంటే అతని కులం పైచేయిగా ఉంటుంది.
15 ఏళ్లుగా డ్యాన్సింగ్ వృత్తిలో ఉన్న పాట్నాకి చెందిన ఓ డ్యాన్సర్ తన అనుభవాన్ని ఇలా చెబుతోంది. ‘మేము పెళ్లిళ్లకి డ్యాన్సులు వేస్తాం. ఇప్పుడు చావులకి కూడా పిలుపులు వస్తున్నాయి. అయితే పెళ్లయినా, చావైనా మాకు పెద్దగా తేడా కనిపించడం లేదు. అవే పాటలు, డ్యాన్సులు, పొట్టి పొట్టి బట్టలు వేసుకుని రమ్మని కూడా ఆదేశాలు ఉంటాయి. డబ్బులు తీసుకోవాలంటే వాళ్లు చెప్పిన పని చేయాలని అసభ్య సంజ్ఞలు చేస్తారు. విపరీతంగా ప్రవర్తిస్తుంటారు’ అని ఆమె చెబుతున్నారు.
‘పాటల ఎంపిక కూడా ఆయా వ్యక్తుల కులాన్ని బట్టి ఉంటుంది. వాళ్ల కులాన్ని, హోదాని గొప్పగా చూపించేందుకు తుపాకీలతో కాల్చమని కూడా ఆదేశిస్తుంటారు. మొదట్లో మేము చాలా భయపడేవాళ్లం. కానీ ఇప్పుడు అలవాటైపోయింది’ ఆమె తన అనుభవాన్ని చెబుతోంది.
అసలు ఈ సంస్కృతి ఎందుకు వచ్చింది? దీని పర్యవసనాలు ఏంటి అనేదానిపై ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ పీజీ కాలేజీ లెక్చరర్ రామ్ నారాయణ ఇలా అంటున్నారు. ‘భోజ్‌పూరీ సంస్కృతిలో చావు సందర్భాల్లో విషాదగీతాలు ఆలపించడం ఎప్పటి నుండో ఉంది. ‘మృత్యు గీత్’, ‘నిర్గున్ గీత్’, ‘శ్రీ నారాయణి’ పేరుతో వాటిని పిలుస్తారు. ఈ పాటలన్నీ సంతాపం తెలిపేవిగా ఉంటాయి. చనిపోయిన వ్యక్తుల గౌరవార్థం వాళ్లని గుర్తుకు తెచ్చుకుంటూ అప్పటి కప్పుడు ఆశువుగా పదాలు కట్టి పాడే వారు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ఆచారంలో కులం తిష్టవేసుకుపోతోంది. ఇది సమాజంలో అనైక్యతకి దారితీస్తుంది. ఈ సంస్కృతి అనాదిగా వస్తున్న జానపద సంస్కృతికి విరుద్ధంగా ఉంటోంది. సామాజిక విలువలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మారు మూల గ్రామాలు, అక్షరాస్యత లేని ప్రజల్లో ఈ విష సంస్కృతి ప్రబలడం లేదు. 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలోనే అత్యధిక అక్షరాస్యత గల ప్రాంతాలుగా రోహతాస్(73.37), భోజపూర్(72.79) ఉన్నాయి. ఈ నిష్పత్తి దశాబ్దకాలంలో పెరిగింది కూడా! అంటే చదువుకున్నోళ్లు ఎక్కువగా ఉన్న చోటే ఈ కులవిషసంస్కృతి విజృంభిస్తోంది. మహిళలను తక్కువ చేసి చూడడం పెరిగిపోతోంది.
సంస్కృతి, సాంప్రదాయం పేరుతో కులాలు, మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టడం మనువాదకుల నైజం. మహిళలను చులకనగా చూడడం వారి ఆనవాయితీ. పాలకులు ఈ తీరుగా ఉంటే సమాజం ఏ రీతిగ నడుస్తుంది? అనడానికి పై ఉదాహరణలే ప్రతిబింబాలు..