నిజమైన స్నేహితుడు

May 7,2025 02:27 #feachers, #jeevana, #katha

ఇద్దరు స్నేహితులు సెలవురోజు ఊరు వెలుపల షికారుకెళ్లారు. తోవలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరూ వాదించుకున్నారు. వాదన ఎక్కువై మొదటివాడు, రెండోవాడిని చెంపపై కొట్టాడు. దెబ్బతిన్నవాడు అక్కడున్న ఇసుకపై ‘ఈ రోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు’ అని రాశాడు. మళ్లీ ఇద్దరూ ముందుకు నడిచారు.
మరి కొంత దూరం వెళ్లాక ఇద్దరికీ దాహం వేసి ఓ మడుగు దగ్గరకు వెళ్లారు. చెంపదెబ్బ తిన్న మిత్రుడు ముందు నీళ్లలోకి దిగాడు. అక్కడ ఊబి ఉంది. అతడు ఊబిలోకి కూరుకుపోతుండగా గట్టు మీద ఉన్న మొదటి మిత్రుడు కర్ర సాయంతో అతన్ని బయటకు లాగాడు. బయటకి వచ్చిన రెండో మిత్రుడు అక్కడ ఉన్న ఓ బండరాయిపై ‘ఈ రోజు నా మిత్రుడు, ప్రమాదం నుండి నన్ను కాపాడాడు’ అని రాశాడు.
మొదటి విషయాన్ని ఇసుకపై, రెండోదాన్ని రాయిపై ఎందుకు రాశావని మొదటివాడు అడిగాడు. ‘ఇసుకపై ఏదైనా రాస్తే గాలి వీచి, కాసేపటికి చెరిగిపోతుంది. స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు. అందుకే అలా రాశాను. అదే సహాయం చేస్తే శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపై రాశాను’ అని చెప్పాడు.
నీతి : స్నేహితులే కాదు, ఎవరు తప్పు చేసినా క్షమించి మరిచిపోవాలి. వారు చేసిన సాయం మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి.

– యు.రుష్మిక, 6వ తరగతి, గీతాంజలి హైస్కూలు,
రంగాపురం, రెడ్డిగూడెం మండలం,
ఎన్‌టిఆర్‌ జిల్లా, 98853 04643.

➡️