గంగోత్రి సాయి… రంగస్థలంలో బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం. ఆయన నటుడు, దర్శకుడు, రచయిత, వివిధ నాటక రంగ అంశాల్లో సాంకేతిక నిపుణుడు కూడా. అనేక నాటికలు, నాటకాలు, సినిమాల్లో గంగోత్రి సాయి విశేష ప్రతిభ కనబర్చారు. అరవింద్ ఆర్ట్స్ సంస్థ ద్వారా తెలుగునాట ఆయన నేతృత్వంలో ప్రదర్శించిన నాటికలు, నాటకాలు అనేకం ఉన్నాయి. అనేక పురస్కారాలూ, ప్రశంసలూ ఆయన్ని వరించి వరించాయి.
గంగోత్రి సాయిగా చిరపరిచితుడైన దాసరి చలపతిరావు రేపల్లె తాలూకా నగరం మండలం కొలగానివారిపాలెంలో 30 జులై 1964న రామారావు, చెలవమ్మ దంపతులకు జన్మించారు. హైస్కూలు స్థాయిలోనే ఏకపాత్రాభినయం, మిమిక్రీతోపాటుగా పలు నాటిక పోటీల్లో పాల్గొనేవారు. ప్రస్తుతం మంగళగిరిలోని సి.కె.బాలుర ఉన్నత పాఠశాలలో వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తాడేపల్లిలో ‘ప్యారీ’ కంపెనీలో పనిచేసే కొద్దిమంది కళాకారులు నాటకాలకు రిహార్సల్స్ చేసేవారు. నాటకరంగంలో అప్పట్లో లెజెండ్‌గా ఉన్న అన్నపరెడ్డి శివరామిరెడ్డి (నూతక్కి) వీరికి శిక్షణ ఇచ్చేవారు. కొన్నిరోజుల పాటు వీటిని పరిశీలించిన సాయి ఆ తర్వాత తను కూడా నాటకాల్లో నటించాలని భావించి శివరామిరెడ్డి వద్ద శిష్యరికం చేశారు. అలా 1990లో నాటకరంగ ప్రవేశం చేశారు. ఆయన వద్ద డైలాగులు, నటన, ఇతర పాత్రల్లోని మెళకువలను నేర్చుకున్నారు.
గంగోత్రి నుంచి అరవింద్ ఆర్ట్స్ వరకూ…
గతంలో గంగోత్రి నాటక సమాజం ద్వారా అనేక నాటక, నాటిక ప్రదర్శనల్లో సాయి నటించేవారు. కాలక్రమంలో నాటక సమాజాలకు ఆదరణ కరువైన నేపథó్యంలో నాటక ప్రదర్శనలు సరిగా జరిగేవి కాదు. ఈ క్రమంలో తన స్నేహితుడు చాగంటి చంద్రశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతో 2004లో అరవింద ఆర్ట్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రముఖ రచయిత వల్లూరు శివప్రసాద్, ప్రముఖ సినీ రచయిత ఆకెళ్ల, కావూరి సత్యనారాయణ, డాక్టర్ డి.విజయభాస్కర్ తదితరుల రచనలతో ఎక్కువ నాటకాలు, నాటికల ప్రదర్శనలు ఇచ్చారు. 1992లో భిలాయి బహుబాషా నాటకోత్సవాల్లో ప్రదర్శించబడి, తృతీయ ఉత్తమ ప్రదర్శన బహుమతి పొందిన ‘తిమిరం’ నాటిక ద్వారా ఎ.శివరామిరెడ్డి దర్శకత్వంలో నటుడిగా సాయి వెలుగులోకి వచ్చారు. 1994లో గంగోత్రి పెదకాకాని నాటక సమాజంలో అడుగుపెట్టారు. 12 ఏళ్లపాటు నాటికలు, నాటకాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు ధరించి బహుమతులు పొందారు. నాటక రంగంలో గంగోత్రిసాయిగా గుర్తింపు పొందారు. 2004లో అరవింద ఆర్ట్స్ నాటక సమాజాన్ని స్థాపించారు.
ఏరువాక సాగాలి, ఏకాకి నౌక చప్పుడు, దేవుడా! దేవుడా!!, ధ్వంస రచన, రంకె, పడుగు, క్షతగాత్రగానం, ఆగ్రహం, స్వర్గానికి వంతెన, మనస్విని, ఏటిలోని కెరటం, అరవైదాటారు ఎందుకు?, నక్షత్రం, జరుగుతున్న కథ, అదుగో వాళ్ల పల్లె .. వంటి నాటికల్లో నటించారు. పలు నాటికలకు దర్శకత్వం వహించారు. ఇదొక విషాదం,మీ ఇల్లెక్కడ, కొత్త నాయకుడు, ఇంటింటి బాగోతం, పరుగు, బొమ్మా బొరుసా, బుషి, బహుజన హితాయ, నక్షత్రం, అన్నా జిందాబాద్, మీ ఇల్లెక్కడ .. వంటి నాటకాలు ఆయనకు అనేక బహుమతులను తెచ్చి పెట్టాయి.
సామాజిక అంశాలే ఇతి వత్తాలుగా …
అరవింద ఆర్ట్స్ ద్వారా తాడేపల్లి కేంద్రంగా గత 30 సంవత్సరాలుగా వందలాది నాటిక, నాటక ప్రదర్శనలు ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలపై ప్రదర్శితమైన నాటిక ‘రంకె’ అన్నదాత అగచాట్లను ఎత్తి చూపింది. భీమవరానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటున్న పరిస్థితుల్లో ఈ నాటికను చూసి, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట! ‘పడుగు’ నాటిక చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న దీన పరిస్థితులను తెలియజేసే మరో నాటిక. ఈ నాటిక నంది బహుమతితోపాటు ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంది. బహుభాషా నాటకోత్సవాల్లో ప్రదర్శించబడి నాటకాభిమానుల ప్రశంసలు పొందింది. ఇంకా వల్లూరు శివప్రసాద్ రచనలు ‘ఏరువాక సాగాలి, ఏకాకి నౌక చప్పుడు, దేవుడా! దేవుడా!!, ధ్వంసరచన, రంకె, పడుగు, క్షతగాత్రగానం, ఆగ్రహం, స్వర్గానికి వంతెన, మనస్విని, ఏటిలోని కెరటం వంటి నాటికలు ఆయన దర్శక నటనా నేతృత్వంలో ఎన్నో బహుమతులను గెలుపొందాయి.
నాటక సాహిత్య ప్రచురణ
అరవింద ఆర్ట్స్ సంస్థ ద్వారా ప్రచురణ ద్వారా కూడా సేవ చేస్తున్నారు. 2010లో ‘రూపిక’ నాటక రంగ వ్యాస సంకలనం, 2012లో ఆకెళ్ల ఇదొక విషాదం, మీ ఇల్లెక్కడ నాటకాలను; ఆకెళ్ల నాటకాలు 2వ సంపుటాన్ని ప్రచురించారు. అలాగే ‘నాటక రంగ ప్రముఖులు’ ఛాయాచిత్రాలను సేకరించి లక్షలాది రూపాయలు వ్యయం చేసి ఫ్రేములుగా తయారు చేయించారు. రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, అవనిగడ్డలో ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. 2016లో ‘నాటకరంగ ప్రముఖులు’ కళాకారుల, రచయితల సంక్షిప్త పరిచయంతో పుస్తకంగా ప్రచురించి నంది నాటకాల్లో ఆవిష్కరించారు. వావిలాల నరసింహారావు రాసిన ‘ఈ వైరమింకెంతకాలం’ (2021) పౌరాణిక నాటకం ప్రచురించారు. 2010లో ‘ప్రసిద్ధ తెలుగు నాటికలు’, (58) ‘ప్రసిద్ధ తెలుగు హాస్యనాటికలు’ (50) సంకలనాలకు, 2016లో ప్రచురించిన ‘ప్రసిద్ధ బాలల నాటికలు’ (1912-2000) సంకలనానికి ఉప సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రసిద్ధ తెలుగు నాటకాలు ఆరు సంకలనాలను (1880-2020) 100 నాటకాలతో తానా సంస్థవారితో కలిసి ప్రచురించారు.
నందులు, పురస్కారాలు
నంది నాటకోత్సవాల్లో గంగోత్రి సాయి ప్రదర్శించిన నాటికలు ఐదు బంగారు నందులు, రెండు వెండి నందులు, రెండు కాంస్య నందులను అందుకున్నాయి. సాయి వ్యక్తిగతంగా ఉత్తమ దర్శకుడిగా నాలుగు నందులు, ఉత్తమ నటుడిగా రెండు నందులు, ఉత్తమ ప్రతి నాయకుడిగా రెండు నందులు, హాస్యనటుడు, రంగాలకరణకు కూడా నందులు గెల్చుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, జవ్వాది రామారావు రంగస్థల పురస్కారం, కిన్నెర, హైదరాబాదు వారి ఎన్‌టిఆర్ రంగస్థల పురస్కారం మొదలైన ఎన్నో పురస్కారాలను అందుకొన్నారు.
సామాజిక చైతన్యమే లక్ష్యంగా : గంగోత్రిసాయి అరవింద్ ఆర్ట్స్ అధినేత.
భావితరాలకు నాటక రంగం సమగ్ర చరిత్రను అందించేందుకు కషిచేస్తున్నాం. మా ప్రదర్శనలు సామాజిక ప్రయోజనమే లక్ష్యంగా రూపొందిస్తున్నాం. తెలుగు నాటక రంగంలో జరిగిన కృషిని అందరూ గుర్తు పెట్టుకునేలా పుస్తక ప్రచురణ, ఫొటోల తయారీ, చరిత్ర కూర్పు వంటి పనులను చూపడుతున్నాం.
– యడవల్లి శ్రీనివాసరావు