కోవిడ్… ఎయిడ్స్… గుండెపోట్లు… ఇలా భయంకరమైన వ్యాధులు ఏమైనా వాటి నియంత్రణ కోసం ఆయన అనేక పరిశోధనలు చేశారు. మన రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధిపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన డాక్టర్లలో ఆయన పేరు అగ్రస్థానంలో ఉంటుంది. భయపెట్టే రోగాలను సులభంగా ఎలా ఎదిరించాలో ప్రజానీకానికి తెలియజేశారు. బాధితుల్లో ధైర్యాన్ని నింపటమే కాకుండా, సులభమైన మెళకువలు పాటించటం ద్వారా సాంక్రమిత వ్యాధుల నుంచి ఎలా భయటపడొచ్చో వివరిస్తున్నారు. భయంకరమైన రోగాలున్న వారిని సైతం ఆదరించి అక్కున చేర్చుకొని వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడేస్తుంటారు. ధైర్యంగా ఉంటే రోగం నయమవుతుందని ఊపిరిలూదుతుంటారు. ఆయనే ప్రముఖ సాంక్రమిత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ యనమదల మురళీకృష్ణ. కాకినాడలో గత 24 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు.
డాక్టర్ యనమదల మురళీకష్ణ… మూడు దశాబ్దాలుగా ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు తనవంతుగా కృషిచేస్తున్నారు. కేవలం రెండు ఔషధాలతో హెచ్‌ఐవిని జీరో లోడ్‌కు చేర్చొచ్చునని 20 ఏళ్ల క్రితమే ప్రయోగాత్మకంగా ఆయన నిరూపించారు. శాస్త్రీయ ఆధారాలతో 2004లో ఫ్రాన్స్‌లో జరిగిన సదస్సులో పరిశోధనా సారాంశాన్ని సైతం సమర్పించారు. కాల పరీక్షలో నెగ్గిన ఈ చికిత్సా విధానం ఇప్పుడు ప్రపంచానికి ప్రామాణికంగా నిలిచింది. 1996 నుంచి ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవి చికిత్సలో మూడు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాల కాంబినేషన్‌ను అమలు చేస్తున్నారు. 2000 నుంచి డాక్టర్ మురళీకృష్ణ ప్రధానంగా రెండు ఔషధాల కాంబినేషన్‌లతోనే వైద్యాన్ని అందిస్తున్నారు. హెచ్‌ఐవి వైరల్ లోడును కనిష్టంగా (అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు గుర్తించలేనంత) తక్కువస్థాయి (అన్‌డిటెక్టబుల్)కి తీసుకురావటమనేది హెచ్‌ఐవి (యాంటీ రెట్రో వైరల్) ట్రీట్మెంట్ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన యాంటీ రెట్రో వైరల్ ఔషధాల సంఖ్య 25కు పైనే ఔషధాలు ఉన్నాయి. గతంలో హెచ్‌ఐవి చికిత్స తీసుకోని (యాంటీ రెట్రోవైరల్ నైవ్) పేషెంట్స్‌లో రెండు ఔషధాల కాంబినేషన్ చికిత్స మెరుగైన ఫలితాలు ఇస్తుందని ఆయన ప్రపంచానికి చాటిచెప్పారు. అందుబాటు లోని మందులు, హెచ్‌ఐవి క్రిమిపై పూర్తి అవగాహనతో ఇలా రెండు యాంటీ రెట్రో వైరల్ ఔషధాల కాంబినేషన్ చికిత్స మెరుగైన ఫలితాలను అందిస్తుందని తన అధ్యయనాలతో నిరూపించారు. ఈ విషయమై శాస్త్రీయ ఆధారాలతో 2004లో ఫ్రాన్స్‌లో జరిగిన 13వ ఇంటర్నేషనల్ సింపోజియం ఆన్ హెచ్‌ఐవి, ఎమర్జింగ్ ఇన్ప్‌క్షన్ డిసీజెస్ సదస్సులో యనమదల పరిశోధనా సారాంశాన్ని సమర్పించారు. 2022 చివరి నుండి ఈ రెండు ఔషధాల కాంబినేషన్ చికిత్సను ఒక విధానంగా అన్ని అంతర్జాతీయ ఎయిడ్స్ చికిత్స మార్గదర్శకాలలో చేర్చారు. కొత్తగా హెచ్‌ఐవి నిర్ధారించబడిన వారికి రెండు ఔషధాల యాంటీ రెట్రో వైరల్ కాంబినేషన్ చికిత్స విధానాన్ని ఇవ్వొచ్చునని సూచించారు.
రోగుల జీవన ప్రమాణాల పెంపు
గత 24 సంవత్సరాల్లో డాక్టర్ మురళీకృష్ణ 6500 మందికి పైగా హెచ్‌ఐవి బాధితులకు చికిత్సలు చేశారు. వారి జీవిత కాలాన్ని వృద్ధి చేసి, జీవన ప్రమాణాలను పెంచేశారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో మైక్రోబయాలజీలో ఎండి చేసిన ఆయన 1997 నుంచి హెచ్‌ఐవి నియంత్రణ కోసం నిరంతరం తన కృషిని కొన సాగిస్తూనే ఉన్నారు. హెచ్‌ఐవి రోగుల్లో వ్యాధి తీవ్రత అంచనాకు సీడీ4 లింఫోసైట్ కణాల సంఖ్య, హెచ్‌ఐవి వైరల్ లోడ్ పరీక్షలు చేస్తారు. ఇవి బాగా ఖరీదైనవి. అన్ని చోట్లా లభ్యం కావు. ఎయిడ్స్ జబ్బులో అధికంగా ప్రాణాలు తీసేది క్షయ వ్యాధి. దీని భారిన పడిన రోగుల్లో ఖరీదైన పరీక్షల స్థానంలో చౌకగా దొరికే ‘మాంటూ’ (ట్యుబర్ క్యులిన్) పరీక్షను ఉపయోగించొచ్చునని మురళీకృష్ణ ప్రతిపాదించారు. హెచ్‌ఐవి జబ్బులో క్షయవ్యాధి గురించి శాస్త్రీయ పరిశోధన చేశారు. 2000లో దక్షిణాఫ్రికాలోని దర్బన్‌లో జరిగిన 13వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సులో తన పరిశోధనా సారాంశ పత్రాలను ఆయన సమర్పించారు. ఆ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన 5000 పైగా పరిశోధనల్లో 25 అత్యుత్తమ పరిశోధనలను ఎంపిక చేసి అతిపెద్ద మెడికల్ వెబ్‌సైట్ ‘మెడ్ స్కేప్’ ప్రచురించింది. డాక్టర్ మురళీకృష్ణ పరిశోధనకు మెడ్ స్కేప్ ఎంపిక చేసిన అత్యుత్తమ పరిశోధనల్లో చోటు దక్కడం తెలుగు వారికి గర్వ కారణం.
వైద్య సాహిత్యంతో ప్రజలకు భరోసా
హెచ్‌ఐవిపై వివిధ పత్రికల్లో 50 వరకు పరిశోధనాత్మక వ్యాసాల ద్వారా మురళీకృష్ణ ప్రజల్లో అవగాహన కల్పనకు కృషిచేశారు. 2000లో ఆయన ప్రచురించిన ‘ఎయిడ్స్’ పుస్తకం గొప్ప జనాదరణ పొందింది. కోవిడ్ పీడ సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ భరోసానిచ్చారు. పలు టీవీ చర్చల్లో పాల్గొని ప్రజలకు భరోసాని ఇచ్చారు. ‘కోవిడ్-ఎయిడ్స్-నేను’ పేరుతో 2022 జనవరిలో ఆయన ప్రచురించిన ఆత్మ కథాత్మక వైద్య ఆరోగ్య గ్రంథం మేధావులు, సామాన్యుల నుంచి ఆదరణ చూరగొంది. 2024 మార్చిలో ‘హెచ్‌ఐవి ఎయిడ్స్’ పుస్తకాన్ని తెలుగులో ప్రచురించారు. మే నెలలో ‘హెచ్‌ఐవి ఎయిడ్స్ ఇన్ ఇండియా అండ్ డెవలపింగ్ కంట్రీస్’ పుస్తకాన్ని వెలువరించారు.
హోమ్‌కేర్‌తో కరోనా నుంచి విముక్తి
ఏస్పిరిన్ – ప్రెడ్నిసొలన్ – ఎజిత్రోమైసిన్ లతో తేలికపాటి కోవిడ్ జబ్బుకి ఇంటి వద్దనే చికిత్స తీసుకోవడానికి రూపొందొంచిన ఈ కిట్టు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి భరోసాను ఇచ్చింది, వేలాది మందికి ప్రాణాలను నిలిపింది. కోవిడ్ తర్వాత ఏస్పిరిన్ వాడకంతో గుండె పోటు ముప్పును నివారించొచ్చునని తెలియజేశారు.
జిమా ప్రశంసతో ప్రత్యేక గుర్తింపు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), దేశంలో అత్యధిక వైద్యులు చదివే ‘జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ (జిమా) డాక్టర్ మురళీకృష్ణ కషికి ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చింది. ఎయిడ్స్ వ్యాధి విస్తృతంగా వ్యాపించిన అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాధి తీరు తెన్నులను గురించి ఈ ఏడాది మేలో ప్రచురించిన ‘హెచ్‌ఐవి ఎయిడ్స్ ఇన్ ఇండియా అండ్ డెవలపింగ్ కంట్రీస్’ పుస్తకాన్ని జాతీయస్థాయిలో జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నవంబరు 2024 సంచికలో విశేషంగా ప్రస్తావించారు. వృద్ధిలో ఉన్న దేశాలు, పేద దేశాల నుండి ఇంతవరకు ఎయిడ్స్ పై ఈ తరహా పుస్తకాలు లేని లోటును ఈ పుస్తకం పూరించిందన్నారు. డాక్టర్ మురళీకృష్ణ లోతైన అధ్యయనం, విస్తృత అనుభవంతో రాసిన ఈ పుస్తకం వైద్యులు – ఆరోగ్య విధానకర్తలు – సామాన్యులకు కూడా ఎయిడ్స్ జబ్బు గురించి తగిన అవగాహన ఇస్తుందనటంలో సందేహం లేదు.
చికిత్సలకు ప్రపంచస్థాయి ప్రాచుర్యం – డాక్టర్ యనమదల మురళీకష్ణ
ప్రముఖ సాంక్రమిత వ్యాధుల నివారణ నిపుణుడు, కాకినాడ. సెల్ : 94406 77734
2000 ప్రారంభం నుంచి నేను ఎక్కువ మందికి రెండు ఔషధాల కాంబినేషన్ వైద్యాన్ని అందిస్తున్నా. 2022 సెప్టెంబర్‌లో అమెరికా ప్రభుత్వ హెచ్‌ఐవి చికిత్సా మార్గదర్శకాలు, అక్టోబర్‌లో యూరోపియన్ ఎయిడ్స్ క్లినికల్ సొసైటీ మార్గదర్శకాల్లోనూ ఈ రెండు ఔషధాల కాంబినేషన్ చికిత్సను చేర్చారు. కాలపరీక్షలో నెగ్గిన నా చికిత్సా విధానం ఇప్పుడు ప్రపంచానికి ప్రామాణికంగా ఉంది.
– యడవల్లి శ్రీనివాసరావు