‘ఆపరేషన్‌’ ముగిసిన తర్వాత…’

నాలుగు రోజుల పాటు భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దేశం యావత్‌ వీక్షించింది. ‘యుద్ధం ఎంత కాలం జరుగుతుందో! ఎన్ని ప్రాణాలు బలౌతాయో’ అని కొందరు విచారపడ్డారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌పై భారత ప్రభుత్వం కురిపించిన మరఫిరంగులకు ప్రతీకారం తీరిందని ఇంకొందరు సంతోషపడ్డారు. అయితే ఈ రెండు భావోద్వేగాలకు భిన్నమైన పరిస్థితుల్లో సరిహద్దు ప్రజలు ఉన్నారు. యుద్ధం ముగిసిన సంతోషం వాళ్ల ముఖాల్లో ఎక్కడా కనిపించడం లేదు. కూలిపోయిన ఇళ్లు, బాంబు దాడుల్లో కళ్లముందే ప్రాణాలు కోల్పోయిన ఆప్తులను తలుచుకొని నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు అక్కడున్నవారంతా..

కాల్పుల విరమణ తర్వాత సొంత ఇళ్లకి చేరుకునే వారు కొందరైతే, శిథిలమైన శకలాలను చూసి తట్టుకోలేక ఇంకా పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్న వారు మరికొందరు. ఈ ఉద్రిక్తల్లో మొత్తం 20 మంది పౌరులు మరణించినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. డజన్లకొద్దీ జనాభా గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఇళ్లు కూలిపోయి, నిలువ నీడలేక వేలకొలది ప్రజల బతుకు దుర్భరంగా తయారైంది.

అరవై ఐదేళ్ల సయ్యద్‌ బేగమ్‌ ఇంటిపై మే 9 అర్ధరాత్రి బాంబు షెల్స్‌ పడ్డాయి. బారాముల్లా జిల్లా గింగిల్‌ గ్రామంలో ఆమె నివసిస్తోంది. ఆ రోజు రాత్రి 9:30కి బేగమ్‌, తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిని విడిచి సురక్షిత ప్రాంతానికి బయల్దేరింది. మార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు బాంబుల వర్షం ఆ గ్రామాన్ని తాకుతూనే ఉంది. ఆ భయంకర శబ్దాలకు వృద్ధురాలు, బలహీనురాలైన బేగమ్‌ తీవ్రంగా కలత చెందింది. ఆ భయంతో ఇప్పటికీ ఆమె గొంతు పెగలడం లేదు. ఆ కుటుంబంలోనే ఏడేళ్ల చిన్నారిని తన తండ్రి భుజాలపై ఎత్తుకుని తీసుకొచ్చాడు. నాన్న భుజంపై సురక్షితంగా ఉన్న ఆ చిన్నారి తల ఎత్తి తన ఇంటివైపు చూసింది. అప్పుడు ఓ బాంబు అమాంతం వాళ్ల ఇంటిపై పడింది. క్షణాల వ్యవధిలో పెద్ద పెద్ద మంటలు చెలరేగి ఇల్లు కూలిపోయింది. ఆ దృశ్యం ఆ చిన్నారి మనసును తీవ్రంగా బాధించింది. యుద్ధం ముగిసింది.. ఇంటికి వెళ్దాం అని తండ్రి చెబుతున్నా ఆ చిన్నారి ఇంటికి రానని మారాం చేస్తోంది. చిన్నారి తండ్రి అలీ ఆ బిడ్డ పరిస్థితి గురించి ఇలా చెప్పాడు. ‘ఇంటి గురించి మాట ఎత్తితే చాలు, తను భయంతో ఏడుస్తోంది. మమ్మల్ని కూడా ఇంటికి వెళ్లొద్దని ఆపేస్తోంది’.

ఈ పరిస్థితి అలీ ఒక్కడిదే కాదు; జమ్మూ కాశ్మీర్‌ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న అందరి పరిస్థితి ఇదే. సరిహద్దు గ్రామం పూంచ్‌లో 14 మంది పౌరులు చనిపోతే వారిలో నలుగురు చిన్నారులే ఉన్నారు. వారిలో నిమిషాల వ్యవధిలో కవలిద్దరినీ పోగొట్టుకున్న తల్లీదండ్రీని ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు. ఉరి, పూంచ్‌ జిల్లాల్లో ఇప్పటికీ చాలామంది పాఠశాలల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాల్లోనే నివసిస్తున్నారు.
కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన తరువాత పూంచ్‌జిల్లా వాసి వక్బర్‌ అజీజ్‌ ఇలా అంటున్నాడు. ‘దీనివల్ల ఏం సాధించాం? చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చాలా ఇళ్లు శిథిలాలుగా మారాయి. ఈ విస్తృత పరిణామాలు, విధ్వంసం పాకిస్తాన్‌కి మన సమాధానమా? దీంతో ఇక పాకిస్తాన్‌ మాపై కాల్పులు జరపదా? దీనికి ఎవరు హామీ ఇస్తారు?’ అని అజీజ్‌ ప్రశ్నిస్తున్నాడు.

ఈ కాల్పుల గురించి మరో స్థానికుడు, 90 ఏళ్ల సైద్‌ హుస్సేన్‌ ఇలా అన్నారు. ‘1947-48 ఇండో పాక్‌ యుద్ధం తర్వాత సరిహద్దు గ్రామాలపై ఫిరంగి దాడులు జరగడం ఇదే మొదటిసారి. 1965, 1971, 1999 యుద్ధాల సమయంలో అంటే ఉగ్రవాదం శిఖరాగ్రంలో ఉన్నప్పుడు కూడా మేం ఇంతలా ప్రభావితం కాలేదు. భారత్‌-పాక్‌ మధ్య మూడు యుద్ధాలు జరిగాయి. కానీ ఉగ్రవాద సమస్య అలాగే ఉంది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం తప్ప ఏం లాభపడ్డాం’ అని ప్రశ్నిస్తున్నాడు.
ఉరిలోని మార్కెట్లు ఇంకా జనాలు రాక వెలవెలబోతున్నాయి. గింగిల్‌ గ్రామనివాసి అలీ తన ఇంటి పరిస్థితి గురించి ఇలా చెబుతున్నాడు. ‘మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. ఆమె కళ్లు ఉబ్బిపోయి ఉన్నాయి. వెంటనే చికిత్స చేయించాలి. కానీ మేము పునరావాస కేంద్రంలో తలదాచుకున్నాం. మా ఇల్లు కూలిపోయింది. బిడ్డలను తీసుకుని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి. అమ్మని చూస్తే భయంగా ఉంది’ అని వణుకుతున్న గొంతుతో మాట్లాడాడు.
అలీ భార్య తను ఎదుర్కొన్న పరిస్థితి గురించి ఇలా అంటోంది. ‘మా గ్రామానికి దూరంగా బాంబు మోతలు తరచూ వినపడేవి. కానీ ఎప్పుడూ అవి మాపై పడతాయని అనుకోలేదు. పెద్ద పెద్ద శబ్దాలతో మా ఇళ్లపై బాంబులు కురవడం ప్రత్యక్షంగా చూసిన నేను ఇప్పటికీ రాత్రుళ్లు నిద్రపోలేకపోతున్నాను. పిల్లలు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు’ అని భయం నిండిన కళ్లతో చెబుతోంది.

యుద్ధం సంభవించినప్పుడు సరిహద్దు ప్రాంత ప్రజల పరిస్థితుల గురించి ఉరి, కమలకోటె నివాసి మున్నీర్‌ హుస్సేన్‌ ఇలా అంటున్నారు. ‘మేము సరిహద్దు వాసులం. యుద్ధం జరిగేటప్పుడు దేశంలో అన్ని ప్రాంతాలకు అదొక వార్త. చర్చించుకునే పెద్ద అంశం. కానీ మాకు అది జీవన్మరణ సమస్య. నిలువనీడ కూల్చేసే విపత్తు. కొన్నేళ్లపాటు వెంటాడే భయంకర భూతం’. అని ఆవేదన నిండిన కళ్లతో చెప్పాడు.

➡️