ఆహా! ఏమి రుచి.. తినరా మై మరచి

Feb 22,2024 10:28 #feature
  • రూ.20కే ప్లేట్‌మీల్స్‌… కేరాఫ్‌ ‘మన భోజనశాల’

చక్కటి, చిక్కటి పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు… కొవ్వులను పెంచని భోజనం.. షడ్రుచులను మైమరిపించేలా భోజనం.. కూరలు.. పచ్చళ్లు… అంతా ఆర్గానిక్‌ పద్ధతులతో పండించిన బియ్యం, కూరగాయలతో ఘుమఘులాడించే వంటలు… ‘ఆహా! ఏమి రుచి..తినరా మైమరచి’ అన్న పద్ధతుల్లో రుచికరమైన వంటకాలు ‘మన భోజనశాల’లో ప్రత్యేకం. ఇక్కడ శుచి, శుభ్రతకు కూడా పెద్దపీట వేస్తారు. అంతా హై టెక్నాలజీతో, హైజెనిక్‌ ఫుడ్‌ ఇక్కడ ప్రత్యేకం. పోషకాలు ఎక్కడా వృథా పోనివ్వకుండా ఆహార పదార్థాల్లోనే ఉండేలా ఇక్కడ వంటకాల్లో మరో ప్రత్యేకత. వంట, తయారీ, కూరగాయలు కోయటం, తరగటం వంటి వాటికి యంత్రాలను ఉపయోగిస్తారు. విజయవాడ నగరానికి అనునిత్యం వివిధ పనులపై దూరప్రాంతాల నుంచి ప్రతిరోజూ సుమారు 2.50 లక్షల మంది వరకూ వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి వారిలో కొందరికైనా క్షుద్బాధను తీర్చటంలో విజయవాడలోని ‘మన భోజనశాల’ కృషి చేస్తోంది.. సాధారణంగా విజయవాడలో భోజనం చేయాలంటే హోటళ్లలో రూ.80 నుంచి నాణ్యతను బట్టి రూ.250 వరకూ ఉంది. ఈరోజుల్లో రూ.20కు ప్లేటు ఇడ్లీ కూడా రాని పరిస్థితి! టీ, కాఫీ కూడా రూ.20 పెడితే గాని దొరకటం కష్టంగా మారింది. భోజనానికి ఇంత డిమాండ్‌ ఉన్న పరిస్థితుల్లో విజయవాడకు చెందిన ఈశ్వర్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో నగరంలోని శిఖామణి సెంటరు (బ్లోసమ్‌ ఆసుపత్రిని ఆనుకుని, బందరు రోడ్డులో పశువుల ఆసుపత్రి సిగల్‌కు ఎదురు రోడ్డులో) ‘మన భోజనశాల’ను నిర్వహిస్తున్నారు. రూ.20కే ప్లేట్‌మీల్స్‌ (అయినా కడుపునిండా అన్నం పెడుతున్నారు) పెట్టే భోజనశాల ఉంది. ప్రతిరోజూ ఇక్కడికి వందలాది మంది వచ్చి ఎంచక్కా కడుపు నిండా భోజనం చేసి తమ పనులు హాయిగా చేసుకుంటున్నారు. సేవాభావంతో…ఉద్యోగం, వ్యాపారరంగంలో పనిచేసి ఆ తర్వాత తమకున్న సంపాదనలో ఎంతో కొంత సేవ చేయాలనే భావనతో ఇద్దరు స్నేహితులైన సాక్షి ఆదినారాయణ, ఆయన మిత్రుడు ఈశ్వరరావు ‘ఈశ్వర్‌ ఛారిటీస్‌’ ఏర్పాటు చేసి ‘మన భోజనశాల’ను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ 500 మంది వరకూ భోజనాన్ని రూ.20కే అందిస్తున్నారు. ఇక్కడ తయారు చేసే భోజనానికి ప్లేట్‌ ఒక్కింటికి రూ.60 వరకూ అవుతోంది. అయినా రూ.40ని నిర్వాహకులు భరిస్తూ రకరకాల ఐటమ్స్‌తో నాణ్యమైన, వేడివేడి భోజనాన్ని కడుపు నిండా పెడు తున్నారు. ఎవరూ అర్ధాకలి, ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతో అందిస్తున్నారు.- యడవల్లి శ్రీనివాసరావు

మెనూ ఇలా…

                   సొంత భవనమే కావటంతో దానిలో సేవాభావంతో ఉన్న ఐదుగురు ఉద్యోగులను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచే పని ప్రారంభించి భోజనాన్ని తయారు చేస్తారు. భోజనంలో రెండు, మూడు రకాల కూరలు, ఒక కప్పు అన్నం (500 గ్రాములు), సాంబారు, మజ్జిగ ఇస్తారు. ఏదో ఒకటి రోటి పచ్చడి కూడా ఉంటుంది. మంచి రుచి కోసం వాము కలిపిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా అందజేస్తారు.

యాజమాన్యానికి అభినందనలు

                అడిగిన వారికి కాదనకుండా చక్కటి భోజనాన్ని తిన్నంత పెడుతున్నారు. ఇక్కడ సిబ్బంది చేసే సర్వీస్‌ కూడా చాలా చక్కగా ఉంది. శుభ్రత, పరిశుభ్రత చాలా బాగుంది. నాణ్యమైన బియ్యంతో వండిన అన్నం, వేడివేడిగా తాజా కూరగాయలతో చేసిన కూరలు, మజ్జిగా, పచ్చళ్లు అన్నీ చక్కగా ఉన్నాయి. నేను తృప్తిగా తినకలిగిన మోతాదులో తినేశా. తక్కువ ఖర్చుతో క్వాలిటీ ఫుడ్‌ ఇస్తున్న యాజమాన్యానికి ధన్యవాదాలు

                                                                                                         – షేక్‌ మున్వర్‌ షరీఫ్‌, కంకిపాడు

 

ఆపన్నుల ఆకలి తీర్చటమే ధ్యేయం

                    కులం, మతం, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా సేవాభావంతోనే మన భోజనశాలను ఏర్పాటుచేశాం. నా మిత్రుడు ఈశ్వరరావు, నేనూ కలిసి నిర్వహిస్తున్నాం. 2022 దసరాకు ప్రారంభించాం. నాటి నుంచి నేటి వరకూ రూ.20కే ప్లేట్‌మీల్స్‌ను అందిస్తున్నాం. అత్యంత క్వాలిటీ ఫుడ్‌ను అందించటమే మా లక్ష్యం. వీలైనంత మందికి నాణ్యమైన ఇంటి భోజనం అందించటమే మా లక్ష్యం. అందుకే రెండు మూడేళ్ల క్రితంనాటి పాత బియ్యాన్ని వాడుతున్నాం. తద్వారా అన్నం మంచి క్వాలిటీగా వస్తుంది. ప్రతిరోజూ 10 రకాల కూరగాయలను వినియోగిస్తున్నాం. వాటిలో 10 రకాల దినుసులను వాడుతుంటాం. కూరలు, చెట్నీలు, సాంబారు, రసం, మజ్జిగ ఇలా మేము ఇచ్చే అన్ని ఆహార పదార్థాలు అత్యంత క్వాలిటీతో ఉంటాయి. – సాక్షి ఆదినారాయణ, మన భోజనశాల నిర్వాహకులు

 

పోషకాలతో కూడిన ఆహారం

                    హోటల్‌లో భోజనం తినాలంటే రూ.100 వరకూ చెల్లించాలి. అందులోనే మరింత నాణ్యమైన భోజనం కావాలంటే ఇంకా ఎక్కువ మొత్తం కావాలి. నిత్యం వివిధ పనులపై నగరానికి వచ్చే నా లాంటి వారు చాలామంది ఉంటారు. చాలా రద్దీ ప్రదేశంలో ఇలాంటి భోజనశాల ఉండటం పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు. -మద్దాలి శ్రీనివాస్‌, కోలవెన్ను, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లా

సేవల్లో ఆనందం..పొందుతున్నాం

ప్రతిరోజూ మావంతుగా సేవాభావంతో కొంతమందికైనా భోజనాన్ని పెట్టగలుగుతున్నాం. రేటు తక్కువైనా ఆహారం ఎక్కువగా అందించటంతోపాటు శుభ్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. వంట సామగ్రితోపాటు సర్వింగ్‌ ప్లేట్లు అన్నీ కూడా వేడినీటితో అత్యంత శుభ్రంగా ఎప్పటికప్పుడు కడిగిచ్చేస్తుంటాం. ఇంట్లో ఏ విధంగా వండుతామో అదే పద్ధతిలో ఇక్కడా వంటలు తయారు చేయిస్తున్నాం. – సాక్షి మణి, ఆదినారాయణ సహచరి

➡️