గురి పెడితే ‘పతకమే’!

Oct 7,2024 06:10 #feachers, #Jeevana Stories, #Sports

‘ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
బతుకు అంటే గెలుపూ
గెలుపు కొరకె బతుకు’ అంటూ సాగిన పాట ‘భద్రాచలం సినిమాలోనిది. అక్షరాల ఈ పాటను నిజం చేస్తూ గుంటూరు నగరానికి చెందిన నేలవల్లి ముఖేష్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌లో రాణిస్తున్నాడు. ప్రస్తుతం పెరూలో జరుగుతోన్న ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఐదు బంగారు పతకాలు సాధించి సత్తా చాటాడు. చిన్నప్పటి నుంచీ ముఖేశ్‌కి షూటింగ్‌ అంటే అమితమైన ఇష్టం. అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆ క్రీడలో ప్రోత్సహించారు. పాఠశాలలోని సమ్మర్‌ క్యాంపులో వ్యాయామ ఉపాధ్యాయుడు ముఖేష్‌తో పిస్టల్‌ పట్టించి చేసిన ప్రయోగం నెలలోనే ఫలితాన్నిచ్చింది. ఆ స్కూల్‌లోనే నిర్వహించిన జిల్లా స్కూల్‌ గేమ్స్‌ షూటింగ్‌ పోటీలో రజత పతకం గెలిచాడు. ముఖేష్‌ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు శిక్షణ నిమిత్తం అకాడమీలో చేర్పించారు. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.
అంతర్జాతీయ క్రీడావేదికపై ఆంధ్రా క్రీడాతార తళక్కుమంది. తన గురికి తిరుగులేదని నిరూపిస్తూ గుంటూరు నగరంలోని శ్రీనగర్‌ నాలుగో లైన్‌కు చెందిన నేలవల్లి శ్రీనివాసరావు, మాధవి దంపతుల కుమారుడే యువ షూటర్‌ నేలవల్లి ముఖేష్‌. శ్రీనివాసరావు న్యాయవాది కాగా, తల్లి మాధవి ఇంగ్లీషు ఉపాధ్యాయిని. ముఖేష్‌ గుంటూరులోని లిటిల్‌ ఫ్లవర్‌ ఇంగ్లీషు మీడియం స్కూలులో చదివాడు. ఇంటర్‌ విజ్ఞాన్‌లో పూర్తిచేశాడు. ప్రస్తుతం కె.ఎల్‌ యూనివర్శిటీలో బిటెక్‌ మూడో సంవత్సరం (సిఎస్‌ఐటి) చదువుతున్నాడు. 10, 25, 50 మీటర్ల పిస్టల్‌ విభాగంలో షూటర్‌గా రాణిస్తున్నారు. 2019 వరకూ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో గుంటూరులోని ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ షఉటింగ్‌ స్పోర్ట్‌లో నాగిశెట్టి సుబ్రహ్మణేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకుని జాతీయ క్రీడాకారుడిగా ఎదిగాడు.

25, 50 మీటర్ల షూటింగ్‌ స్పోర్ట్స్‌లో ఆంధ్ర ప్రదేశ్‌లో శిక్షణకు అవసరమైన టార్గెట్‌ పరికరాలు, శిక్షకులు లేకపోవటంతో పూనేలోని ఒలింపిక్‌ పతక విజేత గగన్‌ నారంగ్‌కు చెందిన ‘గన్‌ ఫర్‌ గ్లోరీ షూటింగ్‌ అకాడమీ’లో చేరాడు. అక్కడ అంతర్జాతీయ కోచ్‌లు సికె చౌదరి, ఓరు కనెప్‌ (జర్మన్‌) వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. ఎస్‌ఎఐ సౌజన్యంతో ‘ఖేలో ఇండియా’, గగన్‌ నారంగ్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ పౌండేషన్‌ ద్వారా ‘ప్రాజెక్ట్‌ లీప్‌’ పథకం ద్వారా ఈ శిక్షణను పొందుతున్నాడు. ఇప్పటికే అనేక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పలు పతకాలు గెల్చుకున్నాడు. 2019 నుంచి ఇప్పటివరకు ఖేలో ఇండియా తో పాటు జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ లలో పదుల సంఖ్యలో పతకాలు గెలిచాడు. 2022లో జరిగిన జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో 25 మీటర్ల పిస్టల్‌లో 2 జాతీయ రికార్డులు నెలకొల్పాడు.

పెరూలోనూ పతకాల పంట
సెప్టెంబర్‌ 26 నుంచి ఈనెల ఏడోతేదీ వరకూ పెరూ దేశ రాజధాని లిమాలో ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ కొనసాగుతోంది. భారత జట్టు క్రీడాకారులు విశేష ప్రతిభతో పతకాల పట్టికలో దేశాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు. వీరిలో ముఖేష్‌ సరికొత్త రికార్డులతో పతకాలు సాధించాడు. 25 మీటర్ల ఫిస్టల్‌ విభాగంలో 585/600 స్కోర్‌తో బంగారు పతకం గెలిచాడు. మన దేశానికే చెందిన సూరజ్‌ శర్మ 583/600 రజత పతకం గెలవగా, ఉక్రెయిన్‌కు చెందిన మెడుషేవ్స్కి వ్లాదిస్లావ్‌ కాంస్య పతకం గెలిచారు. ఈనెల ఒకటో తేదీన అర్ధరాత్రి జరిగిన ఈ 25 మీటర్ల పిస్టల్‌ టీం విభాగంలో కూడా ముఖేష్‌, సూరజ్‌ శర్మ, ప్రద్యుమ్న సింగ్‌లతో కూడిన భారత జట్టు 1729 పాయింట్లతో స్వర్ణం గెలిచింది. పోలాండ్‌ జట్టు 1726 పాయింట్లతో రజత పతకం గెలవగా, ఇటలీ జట్టు 1712 పాయింట్లతో కాంస్య పతకం గెలిచింది. మంగళవారం పోటీలు పూర్తయ్యే సమయానికి భారత జట్టు పది స్వర్ణ, ఒక రజత, మూడు కాంస్య పతకాలతో పట్టికలో ప్రథమ స్థానంలో నిలిచింది.

ఐదు బంగారు పతకాలు, రెండు కాంస్యాలు
వరల్డ్‌ జూనియర్‌ షూటింగ్‌ చాంఫియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ ఫిస్టల్‌ టీం విభాగంలో ముఖేష్‌, ప్రమోద్‌, ఉమేష్‌ చౌదరిలతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకం గెలిచింది. సెప్టెంబర్‌ 30న అర్ధరాత్రి జరిగిన ఈ పోటీలో ముఖేష్‌ భారతజట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్డ్‌ విభాగంతో పాటు 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌, రాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌, స్టాండర్డ్‌ పిస్టల్‌, 50 మీటర్ల ఫ్రీ పిస్టల్‌ విభాగాలలో కూడా ముఖేష్‌ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో బంగారు పతకాన్ని ముఖేష్‌ సాధించాడు. ఈ పోటీల్లో మొత్తంగా ఐదు బంగారు, రెండు కాంస్య పతకాలు సాధించాడు. ఓవరాల్‌ ప్రతిభతో విశ్వవేదికపై తన సత్తా చాటాడు. ఒలంపిక్‌ వేదికపై తన సత్తా చాటి షూటింగ్‌లో చాంఫియన్‌గా నిలుస్తారని ఆశిద్దాం.

ప్రపంచ చాంఫియన్‌షిప్‌ లక్ష్యం : నేలవల్లి ముఖేష్‌
10, 25, 50 మీటర్ల విభాగాల్లో ప్రపంచస్థాయిలో చాంఫియన్‌షిప్‌గా నిలవటమే లక్ష్యం. అప్పటి వరకూ విశ్రమించేది లేదు. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ విభాగాల్లో పోటీల్లో సత్తా చాటాను. భారత దేశానికి ప్రపంచస్థాయి గుర్తింపు తేవటానికి ఒలంపిక్స్‌లో పతకం గెలిచి ప్రపంచచాంఫియన్‌గా నిలవాలన్నదే నా లక్ష్యం. ఆ దిశగా నాకు అకాడమీ కోచ్‌లు శిక్షణ ఇస్తున్నారు. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. యూనివర్శిటీ అండగా నిలబడుతోంది.

– యడవల్లి శ్రీనివాసరావు

➡️