పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి టపాసులు కాల్చుతూ జీవితాల్లో వెలుగులు నింపే పండుగ. ఆనందంగా జరుపుకునే ఈ దీపావళి ఎవ్వరి జీవితాల్లో విషాధాన్ని నింపకూడదు. అందుకనే దీపావళి పండుగను సంబరంగా జరుపుకుంటూనే ప్రమాదాలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నివారించగలం. ఏమాత్రం అజాగ్రత్త, ఏమరపాటుతో ఉన్నా ప్రమాదాల పాలై గాయాలపాలు కావటం ఖాయం. ఇలా జరిగితే కుటుంబాల్లో విషాధం మిగులుతుంది. ఆనందాల దీపావళి అందరి ఇళ్లల్లో సరికొత్త వెలుగుల జిలుగులు నింపాలని ఆశిద్దాం. ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ శాఖలు సంయుక్తంగా కృషిచేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు.
మిగతా పండుగలకు భిన్నంగా దీపావళి పండుగను జరుపుకుంటాం. మిగతా పండుగల్లో పిండివంటలు, కుటుంబాలు సంతోషంగా కలుసుకోవటాలు ఉంటాయి. ఈ దీపావళి పండుగలో అదే మందుగుండు సామాగ్రిని వెలిగించి సంతోషాలను ప్రదర్శించటం తెలిసిందే. చిచ్చుబడ్డులు, కాకరపువ్వొత్తులు, బాంబులు, మతాబులు, టపాసులు ఇలా అనేక రకాలైన మందుగుండు సామాగ్రి పేలే స్వభావాన్ని ఉన్నవే. అందువల్ల ఎక్కువగా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. తస్మాత్ ప్రతిఒక్కరూ ఎంతో జాగురూకతతో వ్యవహరించాల్సివుంటుంది. మందుగుండు సామాగ్రి తయారీ, పంపిణీ, విక్రయాల సమయంలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ మూడుచోట్ల ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన పౌరులుగా మనందరి బాధ్యత. వీటితోపాటుగా ప్రభుత్వం తరపున అగ్నిమాపక,పోలీసు, రెవెన్యూశాఖలు కూడా తమవంతుగా బాధ్యతను నిర్వహించాల్సివుంది. క్షేత్రస్థాయిలో అగ్నిమాపకశాఖాధికారులు లైసెన్సుల జారీలోనూ, అక్రమంగా తయారు చేసే వారిపైనా చర్యలు తీసుకోవాల్సివుంది. ఆయిల్ క్యాన్లు, గ్యాస్ సిలిండర్లు, తదితర మండే పదార్థాలకు దూరంగా టపాసులు కాల్చాలి. అందరూ ఒకేచోట గుమిగూడి కాల్చొద్దు. పొడవాటి క్యాండిల్స్, అగరవత్తులను మాత్రమే వాడి టపాసులను కాల్చాలి. కాల్చేటప్పుడు కళ్లద్దాలను ధరించటం మేలు. ప్రమాదం జరిగినప్పుడు అధైర్యపడకుండా కొద్దిసేపు ధైర్యంగా ఉండి ఆలోచన చేయటం, అగ్నిమాపకశాఖకు తెలియజేయటం ద్వారా చాలావరకూ ప్రాణనష్టం, ఆస్తినష్టం కూడా జరగకుండా కాపాడొచ్చు.
అగ్నిమాపకశాఖ సూచనలివే..
- లైసెన్సు వ్యాపారుల వద్దే మందుగుండు సమాగ్రిని కొనుగోలు చేయండి. చట్టబద్ధమైన నాణ్యమైనవి దొరుకుతాయి. ప్రమాదాలను తగ్గించటానికి ఇవి దోహదపడతాయి.
- బహిరంగ ప్రదేశాల్లోనూ బాణా సంచా కాల్చకూడదు
- భవనాలు, వాహనాలకు దూరంగా మందుగుండు సామాగ్రి పేల్చుకోవాలి
- కాల్చేటప్పుడు బక్కెట్టుతో నీటిని అందుబాటులో ఉంచుకోవాలి.
- సిల్కు దుస్తులు ధరించరాదు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి
- పిల్లలను పరిరక్షించాలి.
- మండేవాటిని అలా వదిలేయొద్దు. పూర్తిగా ఆరిపోయే వరకూ చూడాలి.
- టపాసులు పక్క పక్కనే కాకుండా కాస్త దూరం పాటించి కాల్చుకోవటం మేలు.
- పిల్లలు, పెద్దలూ సురక్షితమైన దూరాన్ని పాటించాలి
- ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండి టపాసులు కాల్చుకోవాలి.
- గాలి వేగంగా వీస్తుంటే ఇల్లు లేదా గడ్డివాములపై పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల దిశను గమనిస్తూ ఉండాలి.
- మనుషులు, భవనాలు, ఇళ్లపై కాల్చిన టపాసులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
భద్రత కోసం…
- ఇంటిలోపల టపాసులు వెలిగించొద్దు. కిటకీల దగ్గర, ఇంటి ఆవరణలోనూ వెలిగిస్తే ప్రమాదాలు జరుగుతుతాయి.
- మండే పదార్ధాలు ఉండే చోట టపాసులు పెట్టొద్దు. కాల్చొద్దు. గ్యాస్ సిలిండర్లు, పెట్రో ఉత్పత్తులు, వాహనాలు ఉన్న చోట్ల కాకుండా దూరంగా వెళ్లి కాల్చాలి.
- కాలని టపాసులను మళ్లీ వెలిగించొద్దు. ఒక్కోసారి అమాంతంగా పేలే ప్రమాదం ఉంటుంది.
అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తప్పించుకునే మార్గాలను అన్వేషించండి..
- నూనెదీపాలు, కొవ్వొత్తులు, ప్రత్యేకంగా కర్టెన్లు వంటి వాటికి దగ్గర పెట్టొద్దు.
- ఏదైనా గాయం లేదా శరీరం కాలితే వెంటనే వైద్యుని సహాయం తీసుకోవాలి.
- సరైన మార్గదర్శకం లేకుండా సొంత వైద్యం చేయొద్దు
లైసెన్సు లేకుండా తయారు చేస్తే కఠిన చర్యలు :-మాదిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్ జనరల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ
మొదటగా టపాసులు (బాణాసంచా) తయారుచేయటానికి కొంతమంది లైసెన్సులు తీసుకుంటారు. మరికొందరు అనధికారికంగా చేసేస్తుంటారు. చట్టప్రకారం లైసెన్సు తీసుకున్న వాళ్లే తయారు చేయాలి. దానికి కూడా పరిమితి ఉంటుంది. కానీ అనైతికంగా, చట్టవిరుద్ధంగా కొందరు తయారుచేస్తుండటం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరికొందరు తాత్కాలిక లైసెన్సులు పొంది తయారుచేస్తున్నారు. పద్ధతి ఏదైనా భద్రతా చర్యలు పాటించకపోతే బాణాసంచాల పేలుడు జరుగుతుంది. విద్యుద్ఘాతం వంటివి చోటుచేసుకున్నా పేలుళ్లు జరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో కాకుండా దూరప్రాంతాల్లో బాణాసంచా తయారీ, గొడౌన్లలో భద్రపర్చటం ఎంతో మేలు.
పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థ : దీపావళి పండుగ నేపధ్యంలో అగ్నిప్రమాదాల నియంత్రణకు గాను అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ శాఖల ద్వారా సమన్వయంతో కృషిచేస్తున్నాం.
అవుట్ బౌండ్ కాల్ సెంటర్ : మా శాఖ ద్వారా ఏర్పాటుచేసిన టోల్‌్‌ఫ్రీ నంబరు, హెల్ఫ్‌లైన్‌కు వచ్చే కాల్స్‌కు సంబంధించిన ఫీడ్ బ్యాక్‌ను కూడా తీసుకుంటున్నాం. గతంలో రాష్ట్రంలో ఎక్కడ ప్రమాదం జరిగిన ఫైర్ సర్టిఫికెట్ విజయవాడ కేంద్రంలోనే ఇవ్వాల్సివచ్చేది. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చాం. మంటలను ఆర్పేందుకు వెళ్లే అగ్నిమాపక సిబ్బందే వెనువెంటనే ఆ పత్రాన్ని తయారుచేసి ఇచ్చే ఏర్పాటుచేశాం. మా శాఖ ద్వారా అందుతున్న సేవల నాణ్యత గురించి తెలుసుకు నేందుకు అవుట్‌బౌండ్ కాల్ సెంటరు ద్వారా బాధితులకు ఫోన్ చేసి వివరాలను తెలుసుకుంటున్నాం. తద్వారా సేవల్లో నాణ్యత మరింతగా పెరిగింది. ఎన్‌ఒసిలు, ఫైర్ సర్టిఫికెట్ల జారీలోనూ, లైసెన్సుల మంజూరు విషయంలోనూ ఇదే పద్ధతి అవలంభిస్తున్నాం. చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. మా శాఖతోపాటు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఎఫ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తదితర శాఖల సమన్వయంతో ప్రమాదాల నియంత్రించటానికి కృషిచేస్తున్నాం.
-యడవల్లి శ్రీనివాసరావు