అమ్మ మాట పూలబాట

Jun 9,2024 05:25 #balala katha, #feachers, #jeevana

అనగనగా రామాపురంలో రాజారాం అనే పెద్ద రైతు ఉన్నాడు. అతడు తన పొలంలో జొన్న పంట వేశాడు. పంట ఏపుగా చాలా బాగా పండింది. ప్రతిరోజూ పిచ్చుకలు వచ్చి, జొన్నలను తింటున్నాయి. అందులో ఒక పిచ్చుకమ్మ అక్కడే గూడు కట్టుకుని, గుడ్లు పెట్టింది. పిల్లలు పెద్దయ్యాక, తల్లి పిచ్చుక ఆహారం తేవడం కోసం రోజూ ఉదయం పూట గూడు నుంచి బయటకు వెళ్లి మరల సాయంత్రం వచ్చేది. పిల్లలకి చాలా జాగ్రత్తలు చెప్పి ‘గూడు నుండి బయటకు రావొద్దు’ అని వెళ్లేది.
ఒకరోజు రైతు రాజారాం, కొడుకుని తీసుకుని పొలానికి వచ్చాడు. వస్తూనే ‘నాయనా! జొన్నలు బాగా పండాయి. రేపు చేను అంతా కోసి మన ఇంటికి పట్టుకు వెళ్లాలి’ అని చెప్పాడు. ఆ మాటలు విన్న పిచ్చుక పిల్లలు భయపడుతూ ఉన్నాయి. తల్లి పిచ్చుక సాయంత్రం రాగానే ‘అమ్మ! రైతు వచ్చి రేపు చేను అంత కోయమని తన కొడుకుతో చెప్పాడు. మన గూడు పోతుందని భయంగా ఉంది’ అన్నాయి. ‘హా! ఏమీ కాదు.. మీరేమీ భయపడకండి’ అని చెప్పి మళ్ళీ ఉదయం తల్లి పిచ్చుక మేత కోసం బయటికి వెళ్ళింది.
ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పిచ్చుక పిల్లలన్నీ భయంతో వణుకుతూ ‘అమ్మ,! అమ్మ! మళ్లీ రైతు వచ్చి కొంతమంది మనుషులని తెచ్చి పంట అంతా రేపు కోయాలి… అని చెప్పాడు’ అన్నాయి. ‘ఓ! అదా సంగతి, ఏం ఫరవాలేదు. మీరేమీ భయపడకండి’ అని చెప్పి, షరా మామూలుగా ఉదయం మేతకు బయలుదేరింది తల్లి పిచ్చుక. ఆ రోజు సాయంత్రం మాత్రం, గూడుకు వచ్చిన తల్లి పిచ్చుక తన పిల్లలు చాలా నింపాదిగా కూర్చొని ముచ్చట్లు ఆడుకోవడం చూసి చాలా సంతోషించింది. పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ‘ఏంటీ ఈ రోజు ఆ రైతు పంట గురించి ఏమీ అనలేదా? అందరూ చాలా సంతోషంగా ఉన్నారు’ అని అడిగింది.
‘అదేం లేదమ్మా, ఈ రోజు కూడా రైతు పొలం దగ్గరకు వచ్చాడు. పంట బాగా పండింది. ఆలస్యం చేస్తే నష్టపోతాను. రేపు నేనే కొంతమంది పని వాళ్ళని తెచ్చి చేను కోసి ఇంటికి పట్టుకు వెళ్లాలి’ అనుకుంటూ వెళ్లిపోయాడు. అంతమంది వల్ల కానిది, రైతు ఒక్కడి వల్ల ఏమీ కాదని మేం నింపాదిగా కూర్చున్నాం’ అన్నాయి పిల్ల పిచ్చుకలు. ఆ మాటలు విన్న తల్లి పిచ్చుక, వెంటనే తన గూడుని చెట్టు మీదకి మార్చేసింది. అప్పుడు పిచ్చుక పిల్లలు ‘ఎందుకమ్మా! రోజూ మేం చెబుతున్నా నువ్వు పట్టించుకోలేదు. ఈరోజు మాత్రం, వెంటనే గూడు మార్చేశావు’ అని అడిగాయి
‘తన పని తానే చేస్తానని రైతు పూనుకున్నప్పుడు అది తప్పకుండా జరుగుతుంది. రైతు ఎవరి మీద ఆధారపడడు. తన కష్టాన్ని తానే నమ్ముకుంటాడు’ అని తల్లి పిచ్చుక చెప్పినట్లే, మరుసటి రోజు ఉదయం రైతు చేను అంతా కోసి పంటను ఇంటికి పట్టుకుని వెళ్ళాడు.

– బల్ల కృష్ణవేణి పలాస

➡️