క్షమాపణ

అనగనగా ఇస్తాపూర్‌ అనే రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు భైరవుడు. రెండో కొడుకు గజేంద్రుడు. భైరవుడు ఎప్పుడూ రాజ పదవి కోసం ఆలోచించకుండా ప్రజలతో కలిసి పనిచేసేవాడు. వారితోనే ఉండేవాడు. అది చూసి గజేంద్రుడు అన్న భైరవుడి మీద పగను పెంచుకున్నాడు.
కొంతకాలం తర్వాత మహారాజుకి ఆరోగ్యం చెడిపోయింది. ‘ఇక పరిపాలన నావల్ల కాదు పెద్దవాడు భైరవుడు ప్రజల మెప్పును పొందాడు. కాబట్టి భైరవుని మహారాజుగా ప్రకటిస్తాను’ అని మంత్రులతో చెప్పాడు. ఈ విషయం విన్న గజేంద్రుడు తండ్రిపై కోపాన్ని పెంచుకున్నాడు. తండ్రి తినే భోజనంలో విషం కలపమని ఒక భటునికి చెప్పాడు. ఆ భటుడు నేరుగా అన్న భైరవుని దగ్గరికి వెళ్లి, గజేంద్రుడు చేయమన్న పనిని గురించి చెప్పాడు. ఆవేశంతో రగిలిపోయిన భైరవుడు తమ్ముని వద్దకు బయలుదేరాడు. భటుని ద్వారా విషయాన్ని తెలుసుకున్న మహారాజు భైరవుడిని ఆపి, ‘నాయనా భైరవా! నాకు నువ్వు ఎంతో.. గజేంద్రుడు అంతే. మీరు నాకు రెండు కళ్ళు. అతన్ని క్షమించి వదిలేయి’ అని అన్నాడు.
‘నాన్న నన్ను క్షమించండి. ఆవేశంలో ఇలా వచ్చాను. తమ్ముడు నాకు కుడి భుజం లాంటివాడు. వాడిని నేను ఎలా చంపుతాను అనుకున్నారు. మందలించడానికి బయలుదేరాను’ అని అన్నాడు. ‘మహారాజుగా తమ్ముడినే ప్రకటించండి’ అని కూడా చెప్పాడు.
ఆ రోజు రాత్రే, ‘గజేంద్రుడుని రాజుగా చేయమ’ని ఓ లేఖలో రాసి మంత్రికి అందజేస్తాడు మహారాజు. అయితే గజేంద్రుడు మంత్రి వద్దకు వెళ్లి ఆ లేఖను మారుస్తాడు. మరుసటి ఉదయమే మహారాజుగా ప్రకటించే ఆ లేఖలో భైరవుడి పేరు ఉంటుంది. మహారాజు, భైరవుడు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. వెంటనే గజేంద్రుడు ‘నాన్న నన్ను క్షమించండి. నేను మీ ప్రాణాలు తీయాలనుకున్నా.. నన్ను క్షమించి వదిలేసారు. నాకు రాజ్యం వద్దు. మీరు ఉంటే చాలు. అన్ననే మహారాజుగా చేయండి’ అని తండ్రి కాళ్ళపై పడ్డాడు గజేంద్రుడు. గజేంద్రుడు మనసు మారినందుకు అందరూ సంతోషించారు. భైరవునికి మహారాజుగా పట్టాభిషేకం చేశారు.

– సంపత్‌ కుమార్‌, 9వ తరగతి,
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కోదాడ,
సూర్యాపేట జిల్లా, తెలంగాణ.

➡️