దీపావళి గ్రామంలో ఉన్నోడు, సరైనోడు, పెద్దోడు, చిన్నోడు అనే నలుగురు స్నేహితులు ఉండేవారు. ఆ నలుగురిలో ఉన్నోడి మెడమీద పులిపిరి కాయ పుట్టింది. అది చూసిన చిన్నోడు ‘అలాంటిది నాకూ పుట్టింది. మా నాన్న తలవెంట్రుకతో తీసేసాడు’ అని చెప్పి ఒక తలవెంట్రుక తీసి కాయ చుట్టూ గట్టిగా ముడి వేశాడు. నొప్పి భరించలేక గోల గోల చేశాడు ఉన్నోడు. మర్నాటికి పెద్ద పుండు అయిపోయింది. కొడుకుని వైద్యునికి చూపించింది తల్లి. ‘ముందుగా నా దగ్గరికి వచ్చి ఉంటే ఒక్క మాత్రతో పులిపిరి కాయ రాలిపోయేది. సొంత వైద్యం చేసారు. ఇది పెద్ద పుండు అయ్యింది. పది రోజులు మందులు వాడాలి. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోవడమంటే ఇదే’ అని మందులు రాసి ఇచ్చాడు వైద్యుడు.
ఇంటికి వచ్చాక జరిగినదంతా స్నేహితులకు చెప్పాడు ఉన్నోడు. ‘ఒరే! పులిపిరి కాయకు గొడ్డలికి సంబంధం ఏంటిరా?’ అని సందేహం వ్యక్తం చేశాడు సరైనోడు. ‘డాక్టర్ కంటే నీకు తెలుసా? ఏదో ఉండే ఉంటుంది’ అన్నాడు పెద్దోడు. వీళ్ళ మాటలు విన్న ఉన్నోడి తల్లి ‘నేను చెప్తాను రండి’ అని వాళ్ళను పెరట్లోకి తీసుకువెళ్ళి లేతగా ఉన్న చిన్న మొక్కను గోటితో చిక్కింది. లేత మొక్క కాబట్టి విరిగిపోయింది. అదే చెట్టు అయితే గోటితో చిక్కలేము గొడ్డలితోనే నరకాలి’ అని ఆ పక్కనే ఉన్న పెద్ద చెట్టుని చూపించింది. ‘ఈ చెట్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. చిన్న మొక్కగా ఉన్నప్పుడే గోటితో చిదిమేయవలసింది. అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు పెద్దవృక్షమైంది. రాలిన ఆకులతో పెరడంతా చెత్తగా ఉంటోంది. దీనిని ఇప్పుడు గొడ్డలితో నరికించాలి. ఇలాంటప్పుడే గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చావు’ అంటారు’ అని చెప్పింది తల్లి. జరిగిన తప్పును తెలుసుకున్నారు పిల్లలు.
సులువుగా పరిష్కారమయ్యే సమస్యని జటిలం చేసుకునే సందర్భంలో ‘గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోవడం’ అనే నానుడి అలా వాడుకలోకి వచ్చింది.
– కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445.