తగిన శాస్తి!

Apr 11,2025 02:39 #feachers, #Jeevana Stories, #katha

వైశాఖి వనంలో ఉండే జిత్తుల మారి నక్క తన మిత్రుడైన కుందేలుతో కలిసి అడవిలో ఉత్తర ప్రాంతంలో జరిగే సంబరాలకు బయల్దేరింది. దారిలో నక్కకి ఒక ముల్లు కనిపించింది. కానీ దాన్ని తీయకుండా ముందుకు కదిలింది! ఆ విషయం కుందేలుకు తెలియదు. కొంత దూరం వెళ్ళాక మరొక ముల్లు కుందేలుకి కనిపించింది. అది దానిని తీసి దూరంగా పడేసింది. ‘ఎందుకు ముల్లుని తీసి పక్కన పడేసావ్‌?’ అని అడిగింది నక్క. ‘ఎందుకేంటి ఎవరైనా చూసుకోకుండా దానిమీద కాలు వేస్తే ఇబ్బంది కదా? అందుకని’ అంది కుందేలు.
‘ఎవరికో గుచ్చుకుంటే నీకెందుకు?’ అంది నక్క. ‘అదే పొరపాటు. ఇబ్బంది ఎవరికైనా ఒకటే. మనం సురక్షితంగా ఉండాలని కోరుకోవడం మంచిదే. అయితే ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకూడదు. మన శక్తి ఉన్నంతవరకు ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేయాలి. లేదా ఆ విషయమై ఇతరులను అప్రమత్తం చేయాలి’ అంది కుందేలు. తర్వాత ఇద్దరూ ముందుకు కదిలారు.
సంబరాలు జరిగే ప్రదేశానికి చేరుకున్న ఇరువురూ అక్కడ చాలా సేపు గడిపిన తర్వాత చీకటి పడుతుండగా తిరిగి ఇంటి బాట పట్టారు. కొంత దూరం వెళ్ళాక ‘అమ్మ చచ్చాన్రో!’ అంటూ కింద పడింది నక్క. ‘ఏమైంది నక్క బావ?’ అని కుందేలు నక్కని అడిగింది. ‘నా కాలికేదో గుచ్చుకున్నట్లు ఉన్నది’ అంటూ బాధగా మూలిగింది నక్క.
కుందేలు వెంటనే మిణుగురుల సహాయం తీసుకుని వాటి వెలుతురులో నక్క కాలును చూసింది. పెద్ద ముళ్ళు ఒకటి గుచ్చుకుంది. శక్తినంతా ఉపయోగించి బలంగా దాన్ని బయటికి లాగింది. ‘ఇంతకుముందు ఈ దారిలో మనం వెళ్ళినప్పుడు నాకు ఒక ముల్లు కనిపించింది. దాన్ని తీశాను. దీన్ని చూడలేదు. ఒకవేళ చూసి ఉంటే తీసేవాడిని.. అప్పుడు నీకు గుచ్చుకునేది కాదు!’ అని కుందేలు ఎంతో బాధగా నక్కతో చెప్పింది.
‘నువ్వే నన్ను క్షమించాలి మిత్రమా. ఇందాక మనం వెళుతున్నప్పుడు నేను ఒక ముల్లును చూసాను. తకావాలనే దాన్ని తీయలేదు. అదే ఇప్పుడు నాకు గుచ్చుకున్నట్టు ఉంది. ఎవరికో జరిగితే మనకెందుకులే అని ప్రవర్తించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఇకనుంచి ఆ విధంగా ప్రవర్తించను నాకు బుద్ధి వచ్చింది’ అంది నక్క. నక్కలో వచ్చిన మార్పుకు కుందేలు ఎంతో సంతోషపడి, నక్కను మెల్లగా వైద్యుడైన ఎలుగుబంటి వద్దకు తీసుకెళ్లింది.

– ఏడుకొండలు కళ్ళేపల్లి, మచిలీపట్నం,
94908 32338.

➡️