గదిలో నుంచి రుద్రా! రుద్రా! అని గట్టిగా అరుస్తూ కళ్లెర్ర చేసుకుంటూ గుమ్మంలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళింది వకుళ. తల్లిని చూడగానే బిక్క మొహం వేసుకుని రెండు చేతులూ వెనక్కి పెట్టుకుని నిలబడ్డాడు రుద్ర.
‘ఇక్కడ బల్లమీద పెట్టిన సున్నుండ కనపడలేదు. నువ్వు తీసావా? చెప్పు?’ అని గద్దించింది. ‘ఊహు లేదు. చీమ ఎత్తుకు పోయింది’ అని సమాధానమిచ్చాడు గడుగ్గాయి. ‘నిజం చెప్పు? లేదంటే చురక పెడతాను?’ అంది తల్లి కోపంగా. ‘ఊహు! నేను తియ్యలేదు’ అన్నాడు బేలగా.
‘అబ్బా ఏంటి.. గోల! ఏమైంది? అంటూ పెరట్లోంచి వస్తూ అడిగాడు వకుళ భర్త రాజారావు. ‘కాత్యాయని కోసమని మినపసున్ని ఇక్కడ బల్లమీద పెట్టాను. నేను వీధిలోకి వెళ్లి వచ్చేసరికి మాయమైపోయింది. ఏమయ్యిందని అడిగితే చీమ ఎత్తుకుపోయిందని చెప్తున్నాడు. ఇదీ వీడి వరస’ అంది వకుళ.
భార్యను పక్కకు పిలిచి ‘పిల్లలు మనల్ని అనుకరిస్తారు. జాగ్రత్తగా నచ్చచెప్పాలి. కోప్పడితే కుదరదు’ అని కొడుకు దగ్గరికి వెళ్ళాడు రాజారావు.
‘రుద్రా నీకు కాత్యాయని అంటే ఎంతో ఇష్టం కదా! ఆ మినపసున్ని ఉండ ఎక్కడ ఉందో వెతికి తెచ్చి దానికి ఇవ్వు. నువ్వు మంచి వాడివి కదూ!’ అని అన్నాడు. ‘ఇదిగో’ అంటూ చేతిలో దాచిన మినప సున్ని ఉండని తండ్రికి ఇచ్చాడు రుద్ర. ‘నా బంగారు కొండ, బుద్ధి. అమ్మ అడిగినప్పుడు అబద్ధం ఎందుకు చెప్పావు’ అని అడిగాడు రాజారావు.
‘నిన్న మినపసున్ని అడిగితే కాకి ఎత్తుకుపోయిందని అమ్మ చెప్పింది. అందుకే నేను ఇవ్వాళ చీమ ఎత్తుకుపోయింది అని చెప్పాను’ అన్నాడు రుద్ర అమాయకంగా.
రుద్ర మాటలు విన్న వకుళ, గదిలో నుండి బయటికి వచ్చి. ‘క్షమించు నాన్న. నిన్న కావాలనే అలా అబద్దం చెప్పాను. ఇంకెప్పుడూ చెప్పను. నువ్వు కూడా అబద్దం చెప్పకూడదు. సరేనా!’ అని రుద్రని దగ్గరికి తీసుకుంది. ‘అమ్మా ఇక మీదట నేను అబద్ధం చెప్పను. బుద్ధిగా ఉంటాను’ అన్నాడు రుద్ర. తల్లీకొడుకులు ఒకరికొకరు వాగ్దానాలు చేసుకోవడం చూసి రాజారావు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బయటికి వెళ్లాడు.
– కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445.