సంక్రాంతి.. చిన్నా, పెద్దా సందోహాల సంబరం. భోగిమంటలు, పిండివంటలు, రంగవల్లుల సవ్వడి. బొమ్మల కొలువులు, చెరకు గడలు, కోడిపందేలు, ఎడ్ల పందేలు, తిరునాళ్ల సందళ్లతో ఏ ఊరుకాఊరు సంసిద్ధమవుతున్నాయి. ఇతర పండగలకి ఊరు వెళ్లినా, వెళ్లకపోయినా, సంక్రాంతికి మాత్రం ఊరెళ్లాల్సిందేనని ఏడాదంతా ఎదురుచూసే పండుగ ఇది. సెలవుల్లో ఎంచక్కా అమ్మమ్మ, నానమ్మ ఊర్లు వెళ్దామని సంబరపడిపోయే పిల్లలు… చిన్ననాటి తలపులతో ఊరి మీదికి మళ్లిన జ్ఞాపకాలతో పెద్దలు… ఎవరి వీలుని బట్టి వాళ్లు గ్రామాలకు పయనమయ్యే సమయం ఇది. ఊరెళ్లటం అందరికీ సందడే కానీ, ప్రయాణాల వేళ జాగ్రత్తలు పాటించాలి.
సెలవులు కావడంతో ఊళ్లు వెళ్లే జనాలతో రైల్వేస్టేషన్లు, బస్సు స్టేషన్లు కిక్కిరిసి పోతున్నాయి. పిల్లలతో, పెద్దలతో ప్రయాణాలు చేసేవాళ్లుముందస్తు ప్రణాళికలు వేసుకోవాలి.ప్రయాణాల వేళ, అనవసరమైన వాటికి బయటికి వెళ్లొద్దు. ప్రయాణాల్లో వసతులుండే ప్రాంతాల గురించి ముందుగానే తెలుసుకోవాలి. మార్గమధ్యంలో చూడాల్సిన పర్యాటక, చారిత్రక ప్రదేశాలని ముందుగానే బుక్ చేసుకోవాలి. పిల్లలతో ప్రయాణించే వాళ్లు లగేజీలో పాడవ్వని ఆహార పదార్థాలను కచ్చితంగా తీసుకెళ్లాలి.
అదనపు అవసరాలు
ఫోన్‌తోపాటు ఛార్జరు, అదనపు బ్యాటరీ, పవర్‌బ్యాంకులు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. లగేజీ బ్యాగుతో పాటు ఖాళీ బ్యాగు ఒకటి ప్యాక్ చేసుకోవాలి. తేలికపాటి, లోపల ఎక్కువ స్థలం ఉండే బ్యాగులు ఉత్తమం. రాత్రుళ్లు ప్రయాణించే వాళ్లు స్వెట్టర్లు తప్పనిసరిగా ధరించాలి. రగ్గులు, దుప్పట్లు, మఫ్లర్లు తీసుకెళ్లేవారు సాధ్యమైనంతవరకు తేలికపాటివి ఉపయోగించాలి. పట్టణాలు, నగరాల కన్నా గ్రామాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. చలికి పిల్లలకు జలుబు, దగ్గు, విరేచనాలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి డాక్టర్ సలహా మేరకు అవసరమైన ఔషధాలు వెంట తీసుకెళ్లాలి. టీ, కాపీ వంటి వాటికి ప్లాస్క్‌తోపాటు సాసర్, కప్పులు ఉంటే మంచిది.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
కాలనీలు, అపార్ట్‌మెంట్ల నుండి పండక్కి దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు ఇవ్వడం మంచిది. లేదా మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని మీకు బాగా నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు చెప్పడం మేలు. విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం మంచిది కాదు. ద్విచక్ర వాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి. బీరువా తాళాలను వెంటే తీసుకెళ్లాలి. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి. ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి. పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్స్, పాల ప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. ఎప్పటికప్పుడు వాటిని తీసుకెళ్లమని పక్కవారికి చెప్పడం మేలు.
విలువైన వస్తువులు
విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. ఆరుబయట వాహనాలకు హాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ వేయాలి. వాచ్ మెన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం ఉత్తమం. ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్లైన్‌లో ఎప్పటికప్పుడు చెక్‌చేసుకోవాలి.
సాధారణంగా సరైన భద్రతా ప్రమాణాలు పాటించని ఇళ్లల్లో, చీకటి ప్రదేశాలు, పాత గ్రిల్స్, బలహీనమైన తాళాలు ఉన్న ఇళ్లల్లో దొంగలు పడే అవకశాలు ఎక్కువ. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలి. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
సొంతవాహనదారులు
సొంతవాహనాలు, ద్విచక్ర వాహనంలో వెళ్లేవారు పొద్దునే ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఉదయం పొగమంచు అధికంగా ఉంటోంది. దీని వల్ల రహదారిపై ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువ. కాబట్టి పొగమంచు తగ్గిన తర్వాతే ప్రయాణాలు పెట్టుకోవాలి.
ఫాస్టాగ్ సరిచూసుకోండి
వాహనదారులు తమ వాహనాలకు ఫాస్టాగ్ వ్యాలిడిటీ ఉందో లేదో చూసుకోవాలి. సరిపడా నగదు ఉందో లేదో గమనించాలి. బ్లాక్‌లిస్టులో పడితే తిరిగి అప్‌డేట్ కావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉన్నా నగదు లేకపోతే టోల్ బూత్‌లోకి వెళ్లాక లైన్‌లోనే చిక్కుకోవాల్సి వస్తుంది. అప్పటికప్పుడు రీచార్జ్ చేసినా సేవలు అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది.
రోడ్డుపై వాహనాలు నిలపొద్దు
జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. కాబట్టి తక్కువ వేగంతో ప్రయాణించాలి. నిద్ర మత్తులో ఉన్నప్పుడు ప్రయాణం చేయకూడదు. అత్యవసర సమయంలో రహదారుల అధికారులను సమన్వయం చేసుకునే ఫోను నెంబర్లకు సమాచారం ఇవ్వాలి.
బ్లాక్‌స్పాట్‌ల వద్ద భద్రంగా..
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పండగ వేళ వేల సంఖ్యలో వాహనాలు బారులు తీరి ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఆ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లేవారితో 65వ నంబర్ జాతీయరహదారిపై విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. మన రాష్ట్రంలో రాయలసీమ మినహా మిగతా అన్ని ప్రాంతాలకు రోడ్డుమార్గంలో వెళ్లే వారికి ఇదే ప్రధాన రహదారి. ఈ రహదారి నాలుగు లేన్లుగా విస్తరించినప్పటికీ వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు 275 కి.మీ. దూరం ఉంది. అందులో చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం నుంచి కృష్ణా జిల్లా నందిగామ శివారు వరకు 181 కి.మీ. మేర టోల్‌రోడ్డు ఉంది. అయితే ఈ మార్గంలో ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలు (బ్లాక్ స్పాట్లు) చాలా ఉన్నాయి. దండుమల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, చౌటుప్పల్, అంకిరెడ్డిగూడెం, పంతంగి, రెడ్డిబావి, పెద్దకాపర్తి, చిట్యాల, గోపలాయిపల్లి, ఏపీ లింగోటం, కట్టంగూర్, పద్మానగర్ జంక్షన్, ఇనుపాముల, కొర్లపహాడ్, టేకుమట్ల, చీకటిగూడెం, సూర్యాపేట శివారు (జనగామ క్రాస్‌రోడ్డు), మునగాల, ముకుందాపురం, ఆకు పాముల బైపాస్, కొమరబండ వై జంక్షన్ కట్టకొమ్ముగూడెం క్రాస్‌రోడ్డు, రామాపురం క్రాస్‌రోడ్డు, నవాబ్‌పేట, షేర్‌మహమ్మద్‌పేట ప్రాంతాలు ప్రధాన బ్లాక్‌స్పాట్‌లు. ఈ ప్రాంతాల్లో ప్రయాణించేవాళ్లు జాగ్రత్తగా వెళ్లాలి.