తోలుబొమ్మలాటకు తోడుగా …

సాంకేతిక పరిజ్ఞానంతోపాటుగానే సామాజిక, సాంస్కృతిక రంగాల్లో నిరంతరం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టివి, ఇంటర్నెట్‌, ఓటీటీల యుగంలో ప్రజలకు ఒకప్పుడు వినోదాన్ని పంచిన సినిమాలకు సైతం ఆదరణ కరువై థియేటర్లు సైతం మూతపడుతున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాల్లో మాల్స్‌, మల్టీ ప్లెక్స్‌లు వెలుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పూర్వం ప్రజాదరణ పొందిన తోలుబొమ్మలాటకు పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తోట బాలకృష్ణ. తోలుబొమ్మలాటను తిరిగి ప్రజలకు చేరువ చేసేందుకు చేస్తున్న కృషి బాలకృష్ణకు గుర్తింపును తీసుకొచ్చింది. ఇటీవలే ఆయన డాక్టరేట్‌ను అందుకున్నారు.

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం జమునానగర్‌ కాలనీకి చెందిన తోట బాలకృష్ణకు తోలుబొమ్మలాట కళ అంటే ఎంతో ప్రాణం. ఈ కళకు పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. ఈ వృత్తి కళలో నిష్ణాతులైన కుటుంబంలో ఆయన ఏడోతరానికి చెందిన వ్యక్తి. తాత బిక్షమయ్య, పెద్ద హనుమంతు, చిన్న హనుమంతు, పెద్ద నారాయణ స్వామి, రామూర్తి కుటుంబాలు వారసత్వంగా ఈ కళను కొనసాగిస్తున్నారు.

రామ్మూర్తి గారి ఐదుగురి కుమారుల్లో రెండో కుమారుడు వెంకట్రావు. వారసత్వంగా ఆయా కుటుంబాలు ఇదే వృత్తితో ఉండటంతో చిన్నప్పటి నుంచే బాలకృష్ణకు ఈ కళ బాగా అబ్బింది. ఐదో తరగతి చదివే సమయానికే రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, భాస్కర రామాయణం వంటివి కథలు నేర్చుకున్నారు. యక్షగానాలైన కూచికొండ రామాయణం, ధర్మపురి రామాయణం కూడా ఔపోసన పట్టించారు. ఆయన కుటుంబంలో సూరన్న, నాగభూషణం, కొండమ్మ (పెద్దమ్మ), రంగమ్మ (అమ్మ) పెద్ద కళాకారులుగా అప్పటికే గుర్తింపు పొందారు. చదువులో చురుగ్గా ఉంటున్న బాలకృష్ణను వారు మరింతగా ప్రోత్సహించారు. అప్పట్లో ఈ కళకు విపరీతమైన ఆదరణ ఉండటంతో అప్పటి ప్రముఖ కవి, జానపద సంగీత కళాప్రపూర్ణగా ఉన్న విజయవాడ రేడియో స్టేషన్‌ డైరెక్టర్‌ కె.వి.హనుమంతరావు 60 ఎపిసోడ్లుగా ధారావాహికగా ప్రసారం చేయటానికి అవకాశం కల్పించగా 16 కళా బృందాల్లోని 160 మంది పాల్గొన్నారు. ఇది జయప్రదం కావటంతో బాలకృష్ణ కూడా ఈ కళలో బిజీగా మారారు. చదువును ఏడో తరగతితోనే ఆపేయాల్సి వచ్చింది.

ఆధునీకరణతో ఆదరణ

మాధవపట్నంలో ఇప్పుడు మూడు, నాలుగు బృందాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కో బృందం ఏకధాటిగా 25 రోజులపాటు వరుసగా ప్రదర్శనలు ఇచ్చే సత్తా ఉన్న కళాకారులు ఉన్నారు. ఇప్పుడు సినిమాలకే ఆదరణ కరువైన తరుణంలో తోలుబొమ్మలాట ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో రాత్రి 8 గంటల సమయంలో ఆట మొదలు పెడితే సూర్యోదయం అయ్యేవరకూ కథాగానం సాగేది. ఇప్పుడు ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా ఈ కళకు పదును పెట్టి తాజా పర్చితే అరగంట నుంచి గంట రెండు గంటలకు మించి ప్రేక్షకులు ఆదరించే పరిస్థితులు లేవు. అందుకే ఈ కళాకారులు కూడా సమాజ పరిస్థితులకు అనుగుణంగా తమ కళను ఆధునీకరించి సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ సమయంలో ఎక్కువ సందేశం, కళాత్మక అందాలు వచ్చేలా చూస్తున్నారు.

కళారూపానికి పునరుజ్జీవానికి కృషి

ప్రస్తుతం ప్రధాన కథకుడుగా తోట బాలకృష్ణ, సహాయ కథకుడిగా అనపర్తి పాపారావుతో పాటుగా బృంద సభ్యులుగా తోట నాగమణి, హార్మోనియం కళాకారులుగా తోట గణపతిరావు, తోట సత్యం, డోలకిస్టులుగా తోట అంజిబాబు, తోట పోతురాజు, స్త్రీ పాత్రల్లో నాగమణి, ఓడినేని నూకరత్నం, యువకళాకారులు మణికుమార్‌ (కుమారుడు), దుర్గాశాంతి (కుమార్తె) పనిచేస్తున్నారు. ఇటీవల విజయవాడ, నూజివీడు, కాకినాడ తదితర ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రదర్శనలకు ప్రేక్షకులు పెద్దఎత్తున తరలివచ్చారు.

అప్పట్లో అద్భుత కళగా …

కాకినాడ గోరస రాజారావు, పిఠాపురం రాజా వారు, ఆ తర్వాత జమీందారుల కాలంలో తోలుబొమ్మలాట కళకు బాగా ఆదరణ ఉండేది. ఆయా ఆస్థానాల్లో ప్రదర్శనలు ఇస్తూ జీవనోపాధి పొందేవారు. స్వాతంత్య్ర పోరాటంలోనూ ఈ కళ ప్రజలను చైతన్యం చేయటానికి ఎంతగానో ఉపయోగపడింది. కథ ప్రారంభమైన తర్వాత బ్రిటీషు వారు పరిసర ప్రాంతాల్లో లేరని ధృవీకరించుకున్న తర్వాత కేతిగాడు, జుట్టుపోలిగాడు, బంగారక్క పాత్రల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి కృషిచేసేవారు. ఆ తర్వాత ఈ విషయాలను తెలుసుకుని కళాకారులపై బ్రిటీషువారు నిర్బంధం ప్రయోగించేవారు. అయినా వెనుదీయకుండా స్వాతంత్య్ర కాంక్షను తమ కళలో, కథలో భాగం చేసి, ప్రజలకు వినిపించేవారు.
పూర్వం ఏటేటా జరిగే కోటప్పకొండ తిరునాళ్లకు నెలరోజులపాటు కళా ప్రదర్శనలు చేసేవారు. అవి పూర్తయ్యాక బంధురికాలు కలుపుకోవటం, పెళ్ళిళ్లు వంటివి కుదర్చుకోవటం వంటివి గుంటూరు కేంద్రంగా జరిగేవి.

జమునానగర్‌ కాలనీగా గుర్తింపు

ఎపి రంగ స్థల కళాకారుల సమాఖ్యకు అధ్యక్షురాలిగా, పార్లమెంట్‌ సభ్యురాలిగా ఉన్న సమయంలో మాధవపట్నంలో 176 మందికి ఇళ్ల స్థలాల కేటాయింపునకు సినీనటి జమున కృషిచేశారు. తోలుబొమ్మలాట సంఘం కార్యదర్శిగా అనపర్తి త్రినాథరావు, సంఘం స్థానిక అధ్యక్షులుగా తోట రంగారావు కూడా భాగస్వాములై ‘జమునానగర్‌ కాలనీ’గా పేరు పెట్టారు. జమునా కళామందిర్‌ కూడా నిర్మించగా అక్కడ తోలుబొమ్మలాటపై భావితరాలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రాలో 60 వేల మంది, తెలంగాణాలో 55 వేల మంది తోలుబొమ్మల కళాకారులు ఉన్నారని అంచనా.

డాక్టరేట్‌తో ప్రత్యేక గుర్తింపు

కేంద్ర సంగీత, నాటక అకాడమీ సౌజన్యంతో తోట బాలకృష్ణ పిల్లలకు ఏడాది కాలంలో మూడు కథలు నేర్పించారు. ఎపి భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఎనిమిదేళ్ల క్రితం యువ కళాకారులకు కళపైనా, చేతివృత్తిదారుల పరిశ్రమాభివృద్ధి సంస్థ ద్వారా తోలుబొమ్మల తయారీలో బాలకృష్ణ శిక్షణ ఇచ్చారు. ఆ సేవలను గుర్తించిన యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ కౌన్సిల్‌ వారు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. మార్చి 23న పాండిచ్చేరిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ డాక్టరేట్‌ను స్వీకరించారు.

కళాకారులను ప్రోత్సహించాలి : తోట బాలకృష్ణ, తోలుబొమ్మ కళాకారుడు, కాకినాడ.

అంతరించిపోతున్న తోలుబొమ్మలాట కళను ప్రోత్సహించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ చూపాలి. వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, దేవాలయాల్లో ఉత్సవాలు, వేడుకల్లో వంటి కార్యక్రమాల్లో కళాకారులను పిలిపించి ప్రోత్సహించాలి. ఇదే వృత్తిలో పనిచేస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలి.

– యడవల్లి శ్రీనివాసరావు

➡️