ఎంత చెట్టుకు అంత గాలి

Nov 5,2024 03:22 #chinnari katha, #jeevana, #katha

ఆనంద నిలయం అపార్ట్‌మెంట్లో, ఉద్యోగ విరమణ చేసిన తెలుగు మాస్టారు సుందరం ఉన్నారు. సెలవు రోజుల్లో అపార్ట్‌మెంట్‌ పిల్లలకి కథలు చెప్పడం ఆయన అలవాటు. ఓ సెలవు రోజు పిల్లలంతా మాస్టారు దగ్గరకి వెళ్లారు. మాస్టారు కథ చెప్పడం ప్రారంభించారు.
‘పార్వతీపురం అనే గ్రామానికి చాలా దూరం నుండి ఒక బాటసారి వస్తున్నాడు. దార్లో కాస్త సేదతీరుదామంటే అక్కడ నీడనిచ్చే ఒక్క చెట్టు కూడా లేదు. దాహం తీర్చుకుందామంటే బావి కూడా లేదు. చాలా నీరసించిపోయాడు. ఎలాగోలా గ్రామానికి చేరుకుని అక్కడే ఉండిపోయాడు. కొన్ని రోజుల తరువాత గ్రామ పొలిమేరలో ఒక జామ మొక్కను, ఒక వేప మొక్కను నాటాడు. మంచినీళ్ల బావిని కూడా తవ్వించాడు.
కొన్ని సంవత్సరాలకు చెట్లు పెద్దవయ్యాయి. బాటసారులకు నీడనిస్తూ, పండ్లు ఇస్తూ ఉన్నాయి. ఒక రోజు జామ చెట్టు, వేప చెట్టుతో ‘నేను అందరికీ చక్కని పండ్లని ఇస్తున్నాను. నీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు’ అని వెటకారంగా అంది. వేప చెట్టు నవ్వి ఊరుకుంది. బాటసారులు జామపండు తిని, బావిలోని నీటిని తాగి, వేప చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నారు. సేదతీరుతూ ‘ఆహా!.. ఈ వేప చెట్టు ఎంత చల్లని గాలిని ఇస్తుంది’ అని కొందరు, ‘అవును ఈ చెట్టు లేకపోతే మనం ఎంతగానో అలసిపోయే వాళ్లం’ అని మరి కొందరూ అన్నారు.
బాటసారుల మాటలు ఒక ఉడుత విన్నది. అది వెళ్లి జామ చెట్టుతో ‘నీ పండ్లు తింటున్న ప్రతి ఒక్కరూ వేప చెట్టునే మెచ్చుకుంటున్నారు.. ఎందుకంటే నీవు అంతగా గాలిని ఇవ్వలేవు. నీ ఆకులు దళసరిగా ఉంటాయి. వేప చెట్టు మాత్రం అలా కాదు. అది ఇచ్చే గాలి వల్ల ప్రతి కొమ్మ కదులుతుంది. దాని ఆకులు ఆ గాలిని చల్లబరుస్తాయి. అది బాటసారులకు ఎక్కడలేని హాయిని ఇస్తుంది’ అని అంది. ఆ మాటల్లో నిజం గ్రహించిన జామచెట్టు, వేప చెట్టు దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగింది.
‘పిల్లలూ.. ఇదీ కథ.. ఈ కథకి మీలో ఎవరైనా పేరు పెడతారా? అని మాస్టారు తన చుట్టూ ఉన్న పిల్లలని అడిగారు. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ మాస్టారు అన్నాడు చివర్లో కూర్చొన్న రవి. ఆ సమాధానం విని మాస్టారు, పిల్లలూ ఒకేసారి చప్పట్లు కొట్టారు.

యు.విజయశేఖర రెడ్డిి,
99597 36475.

➡️