ఆయుర్వేద వైద్య విధానంలో ప్రకృతి పరంగా లభించే సంప్రదాయ వనమూలికల ద్వారా వివిధ రోగాలను సులభంగా నయంచేయొచ్చు. చలికాలంలో వచ్చే ఆస్తమా లేదా ఉబ్బసం వ్యాధిని నయం చేసే వైద్య పద్ధతులు ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్నాయి. ఆస్తమా సోకిన వారు భయపడకుండా సులభంగా డాక్టరు సూచించే ఆయర్వేద తైలాలు, మూలికలు, మిశ్రమాలు, మందులను వాడటం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తమా బాధితులతో పోలిస్తే మనదేశంలో 13 శాతం మంది బాధపడుతున్నారు. మరణాల్లో 42 శాతం మనదగ్గరే సంభవిస్తున్నాయి.
ఏటేటా శీతాకాలంలో చల్లటి వాతావరణం, ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి తగ్గిపోతుండటం తెలిసిందే. ఈ కాలంలో సామాన్యంగా ప్రతిఒక్కరిలో రోగ నిరోధక శక్తి మరింత పడిపోయి ఆస్తమా తీవ్రరూపం దాల్చుతుంది. ఇలాంటి సమయంలోనే ప్రతిఒక్కరిలోనూ తమలో ఉన్న అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తుంటాయి. గాలి, నీటిలో క్రిమికీటకాల వ్యాప్తి ద్వారా కూడా వ్యాధులు వ్యాపిస్తుండటం సర్వ సాధారణంగా జరిగేదే. అయితే దగ్గు, జలుబు, ప్లూ వంటి ఇన్ఫెక్షన్లు చలికాలంలో అతిత్వరగా వ్యాప్తి చెందుతాయి. సైనస్ వంటి సమస్యలు ఉన్న వారు ఈ కాలంలో అత్యంత జాగ్రత్తగా మెలగటం ఉత్తమం. కీళ్ల నొప్పులు, చర్మవ్యాధుల సమస్యలు కూడా మామూలుగా ఉన్నవి తీవ్రంగా మారుతుంటాయి. పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వ్యాధి ముదరకముందే నిపుణులైన వైద్యుల సలహాలు తీసుకుంటే తద్వారా వాటిని సకాలంలో నియంత్రించటానికి అవకాశం ఉంటుంది. తీవ్రత పెరిగితే నియంత్రణకు కొంత సమయం పడుతుంది.
పిల్లల నుంచి పెద్దల వరకూ…
ఆస్తమా వ్యాధి చిన్న పిల్లల నుంచి పెద్ద వారిలో వచ్చే శ్వాస సంబంధితమైన వ్యాధి. ప్రధానంగా ఊపిరితిత్తుల్లోని గాలి గొట్టాల సమస్య. దీనికి మూలం అలర్జీ. మనం ముక్కుతో పీల్చుకునే గాలి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల లోపలికి చేరుకుంటుంది. ఈ శ్వాసనాళం పై నుంచి రెండుగా చీలుతూ వచ్చి మళ్లీ చిన్న చిన్న గొట్టాలుగా విడిపోతూ..అతి సూక్ష్మమైన గాలి గదుల్లోకి చేరవేస్తుంది. సాధారణంగా దుమ్ము, ధూళి ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు దగ్గు వస్తుంది. ఇది హాని కారకాలు లోపలికి ప్రవేశించకుండా, వాటిని బయటకు నెట్టేయడానికి శరీరం చేసే ప్రయత్నమే. అయితే ఆస్తమా వచ్చే స్వభావం (అటోపీ) గల వారికి ఇలాంటి మామూలు విషయాలే పెద్ద సమస్యగా మారతాయి. దుమ్ము, ధూళి, పుప్పొడి, రసాయనాలు వంటివి తగిలినప్పుడు లోపల అలర్జీ ప్రేరేపితమై గాలిగొట్టాలు విపరీతంగా స్పందిస్తుంటాయి. అస్తమాకు మూలం ఇదే. గాలిగొట్టాలకు అలర్జీ కారకాలు తగిలినప్పుడు రోగనిరోధక కణాలు అతిగా స్పందిస్తాయి. దీంతో వాపు ప్రక్రియ (ఇన్‌ప్లమేషన్)మొదలవుతుంది. అప్పుడు గాలిగొట్టాల గోడలు ఉబ్బి, లోపలికి మార్గం సన్నబడుతుంది. గాలిగొట్టాల్లో జిగురుద్రవం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది లోపలే చిక్కుకుపోతుంది. చుట్టుపక్కలా వాపు మాదిరి మార్పులు మొదలవుతాయి. దీంతో శ్వాసతీసుకోవటం, వదలటం కష్టమైపోతుంది. ఫలితంగా దగ్గు, పిల్లికూతలు, ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది
ఆస్తమా ఉన్న వారిలో ఆయాసం, దగ్గు బాగా ఇబ్బంది పెడతాయి. శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్-డి తగ్గిపోతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి పడిపోయి ఆస్తమా తీవ్ర రూపం దాల్చుతుంది. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 30 నుంచి 35 సంవత్సరాల పెద్దవారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో వస్తే దానిని చైల్డ్ హుడ్ ఆన్సెట్ ఆస్తమా అని, పెద్దల్లో అయితే అడల్డ్ ఆన్సెట్ ఆస్తమాగా పిలుస్తుంటారు. న్యూమోనియా, జలుబు వంటివి కూడా ఎక్కువగా పీడిస్తుంటాయి. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు తగ్గకుండా ముదిరితే ఆస్తమాకు దారితీస్తుంటుంది.
ఆయుర్వేదంలో ఇలా తగ్గించుకోవచ్చు
హెర్బల్ టీ : వాము, తులసి, మిరియాలు, అల్లం ఉపయోగించి కొన్ని హెర్బల్ టీలను తయారుచేసుకోవచ్చు. ఆస్తమా వ్యాధి నివారణకు ఇది దోహదపడుతుంది.
వాసక : ఇది ఒక శక్తివంతమైన భారతీయ మూలిక. ఇది ఉబ్బసం, బ్రోన్కైటిస్, అధిక శ్లేష్మ స్రావానికి చికిత్స చేస్తుంది. ఒక టీస్పూన్ వాసక రసాన్ని, రెండు టీ స్పూన్ల తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు.
యష్టిమధు : యష్టిమధు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కల్గివుంది. ఉబ్బసం లక్షణాలకు ఉపశమనం చేస్తుంది. ఒక కప్పు యష్టిమధు టీ రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఉబ్బసం సమస్యలు తగ్గుతాయి.
మిరియాలు, తేనే మిశ్రమం : ఆస్తమాతో ఇబ్బంది పడుతుంటే వెంటనే మిరియాలు, తేనె, ఉల్లిపాయరసం మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతుంటే వెల్లుల్లి రెబ్బల రసాన్ని వేడి నీటిలో కలిపి తాగించటం మంచిది. ఈ మిశ్రమాన్ని భవిష్యత్తు అవసరాల కోసం కూడా సిద్ధం చేసుకుని ఉంచొచ్చు. వేడి నీటి కాపడం ద్వారా కూడా ఛాతీ కండరాలు వదులవుతాయి. సాధారణ శ్వాసను పునరుద్ధరించటంలో సహాయపడుతుంది.
మంచి ఆహారం, జీవన శైలి ముఖ్యం : ఆస్తమా ఉన్న రోగులకు మంచి ఆహారాన్ని అందించాలి. ఒత్తిడిలేని జీవితాన్ని గడపాలి. పేలవమైన జీర్ణక్రియ మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. అదనపు టాక్సిన్స్ నిర్మించబడతాయి. రోజంతా పుష్కలంగా నీటిని తాగటం వల్ల శ్లేష్మస్రావాలు, సన్నగా, వదులుగా ఉంటాయి. తద్వారా అవి వాయు మార్గాలను అడ్డుకోకుండా ఉంటాయి.
రెగ్యులర్ థెరపీ : క్రమం తప్పకుండా ఆందోళన, ఒత్తిడిని ఎదుర్కొనే వారికి థెరపీ సెషన్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉబ్బసం ఉన్న వారికి శారీరక, మానసిక ఒత్తిడి తగ్గటానికి అవగాహన కల్పిస్తారు.
వ్యాయామం చేయాలి : ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఉబ్బసం ఉన్న వారికి ఈత చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇవి చేయాలి
ఆహారం : తేలికగా అరిగే వేడిగా ఉండే ఆహార పదార్థాలను తినాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. తేనె, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, అల్లం, పుదీనా, ఉసిరి వంటివి తరచుగా తీసుకుంటూ ఉండాలి. పాతబియ్యం, పెసలు, ఉలవలు, పొట్లకాయ వంటివి ఆహారంలో భాగమయ్యేలా చూసుకోవాలి. చలిలో బయటకు వెళ్లినప్పుడు చెవిలో దూది పెట్టుకోవాలి. పసుపు వేసిన వేడి నీటితో ఆవిరి పట్టాలి. అను తైలం లేక ఆవు నెయ్యిని రెండు చుక్కలు చొప్పున రెండు ముక్కు రంధ్రాల్లో వేయాలి.
చేయకూడనివి
- నిల్వ ఉన్న ఆహారపదార్థాలు తినరాదు
- చల్లటి పదార్థాలు, పానీయాలు సేవించొద్దు
- పెరుగు, అరటిపండు, బెండకాయ, కొబ్బరి, బంగాళదుంప, మైదా పిండి, శనగ పిండి, వేరుశెనగగుళ్లు, చేపలు, మినుములు, తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మేలు
రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం…
- అగస్త్య హరితకీ రసాయనం, చ్యవన ప్రాశ రసాయనం
- కుష్మాండ రసాయనం, దగ్గు ఉన్నప్పుడు హరిద్రాఖాండా, తాళిసాధి చూర్ణం, మొదలైనవి తీసుకోవాలి. శీతోసలాడి చూర్ణం, సీతాఫలాల చూర్ణం మొదలైనవి వ్యాధి తీవ్రను తగ్గించటానికి దోహదపడతాయి.
-డాక్టర్ కూరపాటి శ్రీనివాస్,
అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాల, విజయవాడ