పరిహారం కోసం ఆడబిడ్డల వేలం!

Dec 5,2024 05:55 #feachers, #Jeevana Stories

అక్కడ.. ఆమెని సంతలో పశువుని అమ్మినట్లు అమ్మేస్తున్నారు. వేలం పేరుతో ఆమె గౌరవాన్ని అంగట్లో సరుకుని చేస్తున్నారు. ఆచారం పేరుతో సాగుతున్న ఈ దారుణంలో తండ్రే ఆమెని విక్రయానికి పెడతాడు. భర్త నుండి విడిపోవాలనుకున్నందుకు, అతనికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించేందుకు ఆమె అమ్ముడవుతుంది. తండ్రి, భర్త, అత్తమామల సమక్షంలో అంగట్లో వస్తువులా ఆమెని కూర్చోబెడుతున్న ఈ ఆచారం మధ్యప్రదేశ్‌, రాజ్‌గఢ్‌ జిల్లాలో ‘ఝగ్డా నాత్రా’గా కొన్నేళ్లుగా యథేచ్ఛగా అమలవుతోంది.

కూతుళ్లని, కోడళ్ళని విక్రయానికి పెడుతున్న ఈ పంచాయతీ సమావేశాలని ‘కూతుళ్ల మార్కెట్లు’ అని పిలుస్తారు. ఈ విషయాల గురించి అక్కడి అధికారులకు, పాలకులకు తెలుసు. అయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మనువాదం, సనాతనం తలకెక్కిన పెద్దలు ఆ ఆడపిల్లలకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు.

రాజ్‌గఢ్‌లో చాలా గ్రామాల్లో ఈ ఆచారం అమలవుతోంది. అక్కడ వేలం వేయబడ్డ, వేలానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిలు ఉన్న కుటుంబాలే ఎక్కువ. అత్తింటి నుండి వచ్చేసిన కూతుర్లని వేలానికి పెట్టాల్సిన దుర్గతిలో ఎందరో తండ్రులున్నారు. భర్తల వేధింపుల నుండి కూతుళ్లని విముక్తి చేయాలంటే ఆచారం పేరుతో ఇళ్లు, పొలాలు అమ్ముకున్న పుట్టింటివారు అక్కడ ఎక్కడ చూసినా కనబడతారు.
ఏళ్ల తరబడి సాగుతున్న ఈ ఆచారంలో బలైన ఎందరో బాలికలు, యువతులు అక్కడ కోకొల్లలు. వేలానికి వెళ్లడం ఇష్టం లేక, డిమాండ్‌ చేసిన సొమ్ము ఇవ్వలేని ఆడపిల్లల కుటుంబాలు గ్రామాల్లో దోషులుగా చలామణి అవుతారు. పిల్ల అత్తింటి నుండి వేధింపులు, బెదిరింపులు వారిని ఊపిరితీసుకోనివ్వవు. చివరికి బలవంతంగానైనా సరే పంచాయతీకి వెళ్లాల్సిందే. ఆ ఇంటి పిల్ల వేలానికి కూర్చోవాల్సిందే.
‘నేను వేలానికి వెళ్లను. అమ్ముడవ్వడం ఇష్టం లేదు’ అంటున్న 24 ఏళ్ల కౌసల్య అక్కడే ఉంది. కొన్ని రోజుల్లో వేలానికి సిద్ధం కమ్మని, పంచాయతి పెద్దల నుండి ఆమెకి ఆదేశాలు వచ్చాయి. మరో ఇంట్లో భర్త నుండి విడిపోయిన 21 ఏళ్ల యువతి చదువుకోవాలని ఆశ పడుతోంది. కానీ ఆమె వేలంలో రూ.18 లక్షలకు అమ్ముడైపోయింది. ఈ వేలంతో అత్తింటివారు, పుట్టింటివారు చాలా సంతోషపడిపోయారు. కానీ అక్కడే, ఆ పెద్దలంతా నుంచొన్నచోటే ఆమె చదువు కోరిక భూస్థాపితమైపోయింది.
పోలీసులు, పాలకులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న ఈ వ్యవహారం ఏ సంస్కృతికి ఆనవాళ్లు..? మనువాదం, సనాతనం అంటూ గొప్పలు చెప్పే వాళ్లు ఈ కుసంస్కారంపై నోరు మెదుపుతారా?
ఈ తరహా సంఘటనలు వేలల్లో జరుగుతున్నా, పోలీసు స్టేషను వరకు వచ్చిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేదు. ఈమధ్యే వెలుగులోకి వస్తున్నాయి. అయితే 2019 నుండి ఇప్పటి వరకు కేవలం వెయ్యి లోపు కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆచారం, పర్యావసనాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని మానవ హక్కుల కమిషన్‌ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సందర్భం ఒకటి

చదువుకోవాలనుకుని కలలుగన్న చిన్నారికి యుక్త వయసు రాకుండానే ఓ తండ్రి పెళ్లిచేశాడు. అత్తారింటికి అడుగుపెట్టిన దగ్గర నుండి ఆ పసిది ఎన్నో చిత్రహింసలు పడింది. అక్కడ ఆమెని తిట్టారు, కొట్టారు, వాతలు పెట్టారు. బాధలు భరించలేక తను పుట్టింటికి వచ్చేసింది. ఆ బంధాన్ని తెంచుకోవాలని తల్లీదండ్రీ భావించారు. పరిహారంగా పెద్ద మొత్తం చెల్లించాలని భర్తింటి వారు డిమాండ్‌ చేశారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఆ తండ్రి, సంతకు పశువుని తీసుకెళ్లినట్లుగా బిడ్డని తీసుకుని పంచాయతీకి వెళ్లాడు. ‘ఝగ్డా నాత్రా’గా పిలవబడే ఆచారం అమలు చేసేందుకు అక్కడ పెద్దలందరూ సిద్ధంగా ఉన్నారు. వారంతా తనకి ధర నిర్ణయించారు. వేలానికి సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఇప్పుడు ఎవరు తనని వేలంలో కొనుక్కుంటారో వాళ్లు భర్తింటివారికి డబ్బులు చెల్లించాలి. ఇంతటితో ఆ వ్యవహారం ముగిసినట్లే.. అత్తింటికి న్యాయం జరిగి, పుట్టింటికీ భారం వీడి ఆ పిల్ల మరో ఇంటి గుమ్మంలో అడుగుపెడుతుంది. అక్కడా అలాంటి వేధింపులే ఎదురైతే.. ఆ పిల్ల ఎన్ని సార్లు వేలంలో కూర్చోవాలి? జవాబులేని ప్రశ్న ఇది..

సందర్భం రెండు

యుక్త వయసు వచ్చిన పిల్లకి పెళ్లి చేసి పంపించాడు తండ్రి. భర్త తాగుడికి బానిస. నిత్యం ఆమెకి నరకం చూపించాడు. కొన్ని నెలలు కూడా గడవకముందే తనని, తన తల్లీదండ్రిని బాగా చూసుకోవడం లేదని పుట్టింటికి పంపించేశాడు. విడాకులు ఇవ్వకుండా ఏళ్లకుఏళ్లు గడుపుతున్నాడు. విడాకులు కావాలంటే రూ.లక్షల్లో పెద్ద మొత్తం చెల్లించాలని యువతి తల్లిదండ్రులకు భర్త కండిషన్‌ పెట్టాడు. అంత సొమ్ము తండ్రి ఇవ్వలేడు. ఇరు పక్షాలు ‘ఝగ్డా నాత్రా’కి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పుడు తండ్రి, భర్త సమక్షంలో ఆమె వేలానికి సిద్ధమైంది.

సందర్భం 3

పెళ్లయిన ఏడాదికే భర్త చనిపోయాడు. ఆమె పుట్టింటికి వెళ్లానుకుంది. అత్తామామ ససేమిరా అన్నారు. ఎంతో పోరాడింది. ‘చదువుకుంటాను. బతుకు బాగు చేసుకుంటాను’ అని బతిమాలింది. మామ కనికరించాడు. అయితే ఓ కండిషన్‌ పెట్టాడు. ‘ఝగ్డా నాత్రా’కి సిద్ధం కమ్మన్నాడు. ఆమెకి మరో మార్గం లేదు. వేలానికి కూర్చొంది. ఎవరైనా పెద్ద మనసుతో ఆమెని కొనుక్కొని చదివిస్తారని ఆమె ఆశ. కానీ అక్కడ అంత విశాల హృదయులు ఎవరూ లేరు.
ఇక్కడే ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. వేలం జరిగేటప్పుడు ఓ పోలీసు అధికారి అక్కడికి వచ్చాడు. తనకి న్యాయం జరుగుతుందని ఆమె భావించింది. కానీ, ఆ రక్షక భటుడు ‘పిల్లని కోడలిగా కాదు.. కూతురుగా చూసుకోవాల’ని మామతో దేవుని ముందు ప్రమాణం చేయించి వదిలేశారు. అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించే అధికారం ఉన్నా అలా చేయలేదు. ఈ ఉదంతాన్ని ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అప్పటి నుండే ఆ ప్రాంతంలో జరిగే దారుణాలు వెలుగుచూశాయి.

➡️