విదేశాలకు వెళ్లే ముందు జాగ్రత్త!

చదువు, ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లాలనేది చాలామంది రంగుల కల. అక్కడికి వెళ్తే తమ జీవితాల్లో వెలుగు నిండుతుందని సంపాదన బాగా ఉంటుందని, మంచి జీతాన్ని, జీవితాన్ని అనుభవించొచ్చుననే ఆశతో ఎక్కువమంది విదేశాలకు వెళ్లాలనుకుంటారు. అలాంటివారు ముందుగానే తగిన సమాచారం తెలుసుకోవాలి.

ప్రపంచంలోని పలు దేశాలు ఇప్పుడు తమ దేశంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర దేశాల వారిని ఆహ్వానిస్తున్నాయి. అక్కడి ప్రభుత్వాలు చదువుకునేందుకు కొన్ని రాయితీలు, చదువు పూర్తయిన తర్వాత తమ దేశంలో ఉద్యోగాలు చేసుకోవటానికి అవకాశాలు కల్పిస్తుండటంతో మన దేశం నుంచి లక్షలాది మంది విద్యార్థినీ విద్యార్థులు వెళ్తున్నారు. కొందరు అక్కడే స్థిరపడుతున్నారు కూడా. గతంతో పోలిస్తే నేడు మారుమూల ప్రాంతాల నుంచి కూడా 10 నుండి 15 మంది వరకూ విదేశాలకు వెళ్లిన వారు ఉంటున్నారు.

జీవనోపాధి కోసం

భవన నిర్మాణ రంగం, క్లీనింగ్‌, డ్రైవర్లుగా, సెక్యూరిటీ తదితర విభాగాల్లో పనిచేసేందుకు చాలామంది గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నారు. మహిళలైతే ఇళ్లల్లో పనులు చేసేందుకు వెళ్తున్నారు. విదేశాలకు వెళ్లిన వారు కారణాలు ఏమైనా అక్కడ పడే ఇబ్బందులు అనేకం ఉంటున్నాయి. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారు స్వదేశానికి తిరిగి రావాలంటే నానా యాతనలు పడుతున్నారు. అన్ని ధృవీకరణ పత్రాలు, వీసా, పాస్‌పోర్టు వంటివి ఉంటే ఇబ్బందులు ఉండవు. కానీ విదేశాలకు పంపుతామని కొందరు డూప్లికేట్‌ పత్రాలు సృష్టించటం, అక్రమ పద్ధతుల్లో పంపిస్తుండటంతో అక్కడికి వెళ్లిన వారు ఆ తర్వాత ఇబ్బందులు పడుతున్నారు.

అక్రమార్కులతో జాగ్రత్త

‘ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. విదేశాలకు వెళ్తే సంపాదించుకుని అప్పులు తీర్చుకోవచ్చు, పిల్లల భవిష్యత్తుకు తోడ్పాటు ఉంటుందని, ఇల్లు కట్టుకోవాలని చాలామంది ఆశతో వెళ్తున్నారు. అలాంటి వారి ఆశలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు మోసగిస్తుంటారు. చదువు, ఉద్యోగం పేరుతో విదేశాలకు చాలా తక్కువ డబ్బుతో పంపిస్తామని కొందరు ఏజెంట్లు నమ్మి ముందే డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత వీసా, పాస్‌పోర్టులు ఏర్పాటు చేయకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల అధీకృత ఏజెంట్లు, కన్సల్టెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లటం చాలా ఉత్తమం. సక్రమంగా వలస వెళ్ళని వారు జైలు పాలవ్వడం, జరిమానాలు కట్టాల్సి రావడం జరుగుతుంది. ఎలాగోలా విదేశాలకు వెళ్లాలనే ఆలోచన సరైంది కాదు.
విదేశాలకు వెళ్లాలనుకునే వారు అధీకృత ఏజెంట్లు, కన్సల్టెంట్ల ద్వారానే వెళ్ళాలి. ఆ కంపెనీ వివరాలు పూర్తిగా తెలుసుకుని వీసా వచ్చాక మాత్రమే వెళ్ళాలి. ప్రతిదాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించటం మంచిది.

ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తం

ఆకర్షణీయమైన హామీలతో కూడిన బ్రోచర్లను కొందరు ఆన్‌లైన్‌ మోసగాళ్లు సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. యువత అవి చూసి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటున్నారు. వీరి సమాచారాన్ని సేకరించిన ఆన్‌లైన్‌ మోసగాళ్ళు వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌క్రైంలకు పాల్పడే ముఠాలు కూడా పెద్దఎత్తున సైట్లలో పొంచివున్నాయి. అందువల్ల విదేశాలకు వెళ్లే వారికి అక్కడి విధివిధానాలపై అవగాహన చాలా ముఖ్యం. ఉన్నత చదువులు చదివి పై చదువుల కోసం వెళ్లే వారికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. స్థానికంగా పరిశ్రమల్లో పనిచేసి, ఆ అనుభవంతో కంపెనీ సాయంతోనూ విదేశాలకు వెళ్లే వారికి అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కన్సల్టెన్సీల ద్వారా విదేశాల్లో ఉద్యోగంలో స్థిరపడాలనుకునే వారికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. డబ్బులు తీసుకుని విదేశాలకు పంపే సంస్థలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బడిముబ్బడిగానే ఉన్నాయి. అయితే కన్సల్టెన్సీలు నమ్మకమైనవి ఉన్నత శ్రేణికి చెందినవి కూడా ఉన్నాయి. కొన్ని మోసపూరితమైనవీ ఉన్నాయి. అందువల్ల మనం ఎంచుకునే సంస్థ, వ్యక్తులను సరిగ్గా పరిశీలించి ఎంపిక చేసుకోవాలి. కంపెనీ గతం, దీని ద్వారా వెళ్లిన అభ్యర్థుల సమాచారం, మిగతా వివరాలు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవటం మంచిది. కొన్ని కన్సల్టెన్సీలు తమ వ్యాపారం కోసం అభ్యర్థులను తప్పుడు మార్గాలు, నకిలీ ధ్రువపత్రాల సాయంతో విదేశాలకు పంపాలని చూస్తుంటాయి. అభ్యర్థులు కూడా తమ పని సులువుగా అవుతుందనే ఆశతో వారికి సహకరిస్తుంటారు. విదేశాల్లోని అధికారులు గుర్తిస్తే చాలా చిక్కుల్లో పడతారు. అందువల్ల నకిలీ ధ్రువపత్రాలతో వెళ్తే ఎప్పటికైనా ప్రమాదకరమే అనేది తెలుసుకోవాలి.

ప్రపంచ వ్యాప్తంగా మన భారతీయులు

మన భారతీయులు ప్రపంచమంతా విస్తరించివున్నారు. ఐక్య రాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో ఇప్పటివరకూ అత్యధికంగా వలస వెళ్లిన వారు భారతీయులే. భారత్‌ తర్వాత మెక్సికో, రష్యా, చైనా, సిరియా ఉన్నాయి. భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2020 విదేశాల్లోని ప్రవాస భారతీయులు, భారతీయ మూలాలున్న వారు 3.2 కోట్లు. ఇందులో భారతీయ పౌరసత్వం ఉన్న వారు సుమారు 1.4 కోట్లు, భారతీయ సంతతివారు 1.8 కోట్లు. అమెరికాలో ఎక్కువగా మనవారు 45 లక్షల మంది వరకూ ఉన్నారు. ప్రవాస భారతీయులు ఉన్న దేశాల్లో యూఎఇ, సౌదీ అరేబియా, అమెరికా, కువైట్‌, ఖతార్‌, ఒమన్‌, నేపాల్‌, మలేషియా,యూకే తదితర దేశాలు ఉన్నాయి. ఆ తర్వాత మారిషస్‌లో ఉన్నారు. మినీ ఇండియాగా చెప్పుకునే ప్రాంతాల్లో లండన్‌ సౌతాల్‌, మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ బ్రిక్‌ఫీల్డ్స్‌, అమెరికా షికాగో నగరంలోని డెవాన్‌ ఎవెన్యూ, సింగపూర్‌, ప్యారిస్‌లోని రూదుఫాబో తదితర ప్రాంతాలను మినీ ఇండియాగా చెబుతుంటారు.

ఇవి పాటించటం మేలు

  • అవకాశాలు మళ్లీ రావంటూ ఏజెన్సీలు తొందరపెట్టినా, ఒప్పించే ప్రయత్నం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
  • ఎంచుకున్న సంస్థ హిస్టరీ, ఇతర వివరాలు తెలుసుకోవాలి.
  • వెళ్లాలనుకుంటున్న దేశం, అక్కడ జాబ్‌ ఆఫర్‌ చేస్తున్న కంపెనీ పూర్తి వివరాలు, జీతం ధృవీకరించుకోవాలి.
  • ప్రతి విషయంలోనూ ఇచ్చిన సమాచారం వాస్తమా? కాదా? బేరీజు చేసుకోవాలి
  • ‘చాలామంది వెళ్తున్నారు’ అనే భ్రమలో వెళ్లేందుకు సిద్ధపడితే ప్రమాదాల్లో పడతారు.
  • బ్యాక్‌లాగ్స్‌ పూర్తిచేయలేక, పట్టా చేతిలో లేనివారు, త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్రమార్కుల బారిన పడి ఇబ్బందులు పడతారు.
  • ఎవ్వరినీ గుడ్డిగా నమ్మొద్దు. ప్రాసెసింగ్‌ ఫీజు పేరుతో డబ్బులు అడగ్గానే ఇవ్వొద్దు.

– చక్రవర్తి మద్దాల (ఎన్‌ఆర్‌ఐ), ఆస్ట్రేలియా, కెరీర్‌ బాబా మేనేజింగ్‌ డైరెక్టర్‌, రిజిస్టర్డ్‌ మైగ్రేషన్‌ ఏజెంట్‌ ఆస్ట్రేలియా, లైసెన్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ అడ్వయిజర్‌, న్యూజిలాండ్‌ : సెల్‌ : 9849511112

➡️