వర్షాకాలం.. జాగ్రత్త సుమా ..!

Jun 27,2024 04:05 #Jeevana Stories

వర్షాకాలం మొదలైంది. ఓ వైపు ఎండలు కాస్తున్నా ఇంకోవైపు అడపా దడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సీజన్‌ మారిన క్రమంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎక్కువమంది దగ్గు, జలుబు, విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
మే నెలలో కాసే మాదిరిగా ఉదయం పూట ఎండలు ఉండటం, సాయంత్రానికి కల్లా చల్లబడి వర్షం వస్తుండటం ఇటీవల కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ వాతావరణం వైరస్‌ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత సీజనల్‌లో వైరల్‌ ఇన్ఫెక్షన్లు, జ్వరాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 100 మందిలో 30 మందికి జలుబు, 20 మంది జ్వరంతో కూడిన వైరల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
అప్రమత్తత అవసరం
వర్షాకాలంలో విష జ్వరాలు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. కొన్ని రోజులపాటు తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటాయి. జ్వరంతో పాటుగా తీవ్రమైన తలనొప్పి, ఒళ్లునొప్పులతో రోగులు బాగా నీరసించిపోతుంటారు. ఒక్కోసారి ఆరోగ్యం బాగా క్షీణించి, ఓపిక నశించి నడవలేని పరిస్థితులు కూడా నెలకొంటాయి. ఇంకొందరు వంటిపై దద్దుర్లతో ఇబ్బందులు పడుతుంటారు. మరికొందరు దురదలతో బాధపడుతుంటారు. ఆహారం కలుషితమైన పరిస్థితుల్లో కొందరు వాంతులు, విరేచనాలు సంభవిస్తాయి. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు ఇప్పుడే వ్యాపిస్తుంటాయి. ఈ సమస్యలకు వాతావరణంతో పాటు కలుషిత నీరు, ఆహారం కూడా కారణం. పోషకాహారం తీసుకోకపోయినా, పాడైపోయిన, కల్తీ ఆహారం తీసుకున్నా కూడా ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. రక్తంలో ఉండే తెల్ల రక్త కణాల సంఖ్య క్రమంగా తగ్గడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు పిల్లలు, పెద్దల్లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి.
లక్షణాలు- ప్రభావాలు
విష జ్వరం సోకితే ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరసం, నిస్సత్తువ, చర్మంపై దద్దుర్లు, వికారం, తలనొప్పి, ఆకలి మందగించడం, గొంతునొప్పి, ముక్కు కారడం, దగ్గు, గొంతు నొప్పి, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ జ్వరం వల్ల శరీరం పైభాగం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వైరస్‌ చాలా శక్తివంతంగా ఉంటే
నరాలపై కూడా ప్రభావం ఉంటుంది. దానితో వివిధ రకాలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రాథమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
జ్వరాలకు సంబంధించిన లక్షణాల్లో రెండు, మూడు కనిపించినా రోగికి ఎక్కువగా నీళ్లు తాగించాలి. దీని వల్లన శరీరం డిహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. తర్వాత రోగికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. తేలికపాటి ఆహారం ఇవ్వాలి. ముఖ్యంగా రోగి ఆందోళనకు గురికాకుండా చూసుకోవాలి. తాజా కొత్తిమీరతో చేసిన టీ, మెంతి వాటర్‌ తాగించాలి. పెద్దవాళ్లకైతే బార్లీ నీరు, గంజి తాగించడం మంచిది.
వైద్యుల సలహా కీలకం
టైఫాయిడ్‌, మలేరియా, అతిసార, వైరల్‌ ఫీవర్‌, జ్వరం వంటివి విపరీతంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించటం మేలు. వ్యాధి తీవ్రత విపరీతంగా ఉండి, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తారు. డెంగ్యూ లక్షణాలు కన్పిస్తే ‘ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌’ పరీక్ష చేస్తారు. విపరీతమైన చలి జ్వరం ఉంటే మలేరియాగా అనుమానించి ‘ర్యాపిడ్‌ డయాగ్నొస్టిక్‌ టెస్ట్‌ పరీక్ష చేస్తారు.
గొంతునొప్పిని అశ్రద్ధ చేయొద్దు
ఈ సీజన్‌లో ఎక్కువమంది తరచూ ‘గొంతు నొప్పి’కి గురౌతుంటారు. దీనికి 90 శాతం వైరస్‌లే కారణం. కాబట్టి దానిని తగ్గించేందుకు గోరు వెచ్చటి నీటిలో ఉప్పు వేసుకొని తరుచుగా పుక్కిట పట్టటం, లేదా మార్కెట్లో లభించే యాంటీసెప్టిక్‌ సిరప్‌ నీటిలో వేసుకొని పుక్కిట పట్టటం మంచిది. గొంతు నొప్పి తగ్గకున్నా, తెల్లటి చీము పొక్కుల వంటివి కనబడుతున్న వైద్యుడిని కలవాలి.

తడి వాతావరణం పట్ల అప్రమత్తం
ప్రస్తుత సీజన్‌లో తడి వాతావరణంతో జ్వరాలు చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్నాయి. నీరు, ఆహార పదార్థాలు ఒకరు తీసుకున్నవి మరొకరు తినకుండా ఉండటం ఎంతో మేలు. సాధారణంగా జ్వరం వస్తే సుమారుగా తొమ్మిదిరోజులు వరకూ ఆ ప్రభావం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చల్లదనానికి శరీర భాగాలు శక్తి హీనంగా మారిపోతాయి. సూక్ష్మక్రిములు సులువుగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
ఈ జాగ్రత్తలు పాటించాలి
– వర్షాల్లో తడవకుండా ఉండాలి
– అతి చల్లదనం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
– గొడుగు, రెయిన్‌ కోటు తప్పనిసరిగా ధరించాలి.
-కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
– ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలి.
– పిల్లల లంచ్‌ బాక్స్‌లో పండ్లు ఎక్కువగా పెట్టాలి. నూనె పదార్థాలు తక్కువగా ఇవ్వాలి.
-జలుబు చేస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

➡️