అరసవిల్లి గిరిధర్ … తెలుగు చిత్రకళా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన డిజిటల్ గీతల మాంత్రికుడుగా పేరుపొందారు. అనేక పుస్తకాలకు ముఖచిత్రాలుగా ఆయన గీసిన బొమ్మలు, చెక్కిన అక్షరాలూ అదనపు ఆకర్షణను, అందాన్ని చేకూర్చుతున్నాయి. చిరు దరహాసంతో తన పని తాను నిశ్శబ్దంగా, ప్రశాంతంగా చేసుకుపోయే గిరిధర్ తెలుగు చిత్రకళకు ఒక వెలుగు దీపం. పలు పుస్తకాల ముఖచిత్రాలపై అందమైన సంతకం. మూడు దశాబ్దాలుగా చిత్ర కళలో సరికొత్త సృజనను ప్రదర్శిస్తూ, అందరూ మెచ్చే కళా ఖండాలకు ఊపిరి పోస్తున్నారు గిరిధర్. ఫోరం ఫర్ ఆర్టిస్ట్ సంస్థ బృందంలో సభ్యుడిగా ఉంటూ తన వంతుగా చిత్ర కళా ప్రపంచంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనర్, గిన్నిస్‌బుక్ రికార్డీ ఈశ్వర్ ఆయన మావయ్యే.
కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి చెందిన అరసవల్లి విశ్వనాథబాబు, రాధాదేవిల కుమారుడే గిరిధర్. 1973, ఫిబ్రవరి 4న జన్మించారు. ఆయన తండ్రి కమర్షియల్ డిజైన్ ఆర్టిస్ట్‌గా విజయవాడలో స్థిరపడ్డారు. మచిలీపట్నంలో చిలకలపూడిలో ఆభరణాల తయారీకి డిజైనింగ్ చేస్తూ ‘నిర్మల ప్రాసెస్’ నిర్మల బాబుగా, ఎవి బాబుగా పేరుపొందారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న గిరిధర్ బాల్యం నుంచి ఇంట్లో ఉండే ఆర్ట్ వాతావరణానికి అలవాటు పడ్డారు. తెలియకుండానే చిత్రకళాకారుడిగా ఎదిగారు. పదో తరగతికి వచ్చే సమయానికి తండ్రి విజయవాడలో మొట్టమొదటి ఆఫ్‌సెట్ ప్రింటింగ్, సన్‌రైజ్ ఆఫ్ సెట్ ప్రింటింగ్స్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో వ్యాపారంలో అవాంతరాలు ఏర్పడటంతో నాన్నకు వృత్తిలో అండగా నిలబడ్డారు. ఒక పూట కాలేజీ, రెండోపూట ఆర్ట్ డిజైనింగ్‌లో కమర్షియల్ ప్రొడక్ట్ వర్క్ చేసేవారు.
ఆధునిక టెక్నాలజీతో సృజనాత్మకంగా…
తనంతటగా తానే చిత్రకళలో మెళకువలను దిద్దుకున్నారు. డిగ్రీపూర్తయ్యాక 1997లో చిత్రకారుడిగా స్థిరపడ్డారు. 1988 వరకూ కుంచెతోనే బొమ్మలు గీశారు. కంప్యూటర్ డిప్లమో, మైసూర్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బిఎఫ్‌ఎ) కోర్సు చేశాక చాలా సులభంగా, సృజనాత్మకంగా డిజిటల్ పయనంలో డిజైనింగ్, పెయింటింగ్ వర్కులు ప్రారంభించారు. కాన్వాస్ పెయింటింగ్, కలర్ పెయింటింగ్ సహా అన్ని రకాల వర్కులూ చేస్తున్నారు. డిజిటల్ ప్యాడ్‌పై గీతలు గీస్తూ ఆధునిక టెక్నాలజీని ఒంటబట్టించుకున్నారు. ఆ తర్వాత విజయవాడలోని ప్రసిద్ధి చెందిన బుక్ పబ్లిషింగ్ హౌస్‌లన్నింటిలోనే భాగస్వామ్యమై ఆయా సంస్థలు ప్రచురించే పుస్తకాలకు ముఖచిత్రాలు గీసేవారు. అలా 28 ఏళ్లలో 7500లకు పైగా పుస్తకాలకు ముఖచిత్రాలు వేశారు. శ్రీశ్రీ మహాప్రస్థానం కాఫీ టేబుల్‌బుక్ ఎడిషన్‌లో ప్రతి పేజీని అందంగా తీర్చిదిద్దటంలో గిరిధర్ గారి అసమాన్య ప్రతిభ కనబడుతుంది.
ప్లెయిర్ ఎయిర్ పెయింటింగ్‌కు అవార్డు
గత కొంతకాలంగా గిరిధర్ ప్లెయిన్ ఎయిర్ పెయింటింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. చారిత్రక, పర్యాటక, ప్రకృతి దృశ్యాలున్న ప్రదేశాలకు వెళ్లి అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చేసే పెయింటింగ్‌పై దృష్టి సారించారు. గత నాలుగేళ్లుగా ప్రతి ఆదివారం మిత్రబృందంతో పలుచోట్లకు వెళ్లి అక్కడి సుందర దృశ్యాలను తన కుంచె ద్వారా చిత్రీకరిస్తున్నారు. ఇలాంటివి ఇప్పటివరకూ వందలకుపైగా చేశారు. సోషల్‌మీడియా ద్వారా ఆయన బొమ్మలుకు విశేషాదరణ లభించేది. మిగతా ఆర్టిస్టులు కూడా చేస్తుండటంతో తమ ఆలోచనా పరిధి విస్తృతికి, టెక్నిక్స్ వంట పట్టించుకోవటానికి, స్నేహితులు అయ్యేందుకు దోహదపడుతోంది. ఇలా ఫేస్‌బుక్ స్నేహంతోనే బిజూ పట్నాయక్ లెజిస్లేటివ్ బయోగ్రఫీ బుక్‌కి ఆయనే ముఖచిత్రం గీచారు. ఈ పుస్తక రచయిత, జర్నలిస్టు, రాజ్యసభలో జాయింట్ సెక్రటరీ రమాకాంత్ దాస్ ఢిల్లీ పార్లమెంట్ హౌస్‌లో గిరిధర్‌ను ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ కల్చలర్ డిపార్ట్‌మెంట్, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్స్ చేసిన ఉగాది, సంక్రాంతి చిత్రకళా శిబిరాల్లో గిరిధర్ కళాఖండాలు పలు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందుకున్నాయి. ప్రఖ్యాత ఆర్టిస్ట్ ప్రభాకర్ అనుపోజు గారి సతీమణి అనుపోజు జయశ్రీ స్మారక చిత్ర కళా స్మారక పురస్కారం అందుకున్న మొదటి డిజిటల్ ఆర్టిస్ట్‌గా నిలిచారు.
సృజనాత్మక రూపకల్పనకు …
పిల్లలకు ఏది నేర్పినా సులభంగా నేర్చుకుంటారు. అలాంటి పిల్లలకు చిన్నప్పుడే వారికి ఇష్టమున్న కళల్లో నైపుణ్యాన్ని నేర్పిస్తే వారు మంచి సృజనాత్మక ఆలోచనాపరులుగానూ, వ్యక్తులుగానూ తయారవుతారు. ఆయన ఫోరం ఫర్ ఆర్టిస్ట్ సంస్థలో ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ పిల్లల్లో ఉంటే బిడియం, ఒత్తిడిని పోగొట్టి వారిని నిపుణులుగా తయారు చేసేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. జాషువా సాహిత్య, సాంస్కృతిక వేదిక సలహాదారుగా కొనసాగుతూ సాంస్కృతిక వైభవం కోసం పాటుపడుతున్నారు. విజయవాడ గవర్నరుపేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె)లోని బాలోత్సవ భవన్‌లో తెలుగు సాహిత్యాన్ని, సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసిన 32 మంది వైతాళికుల చిత్రాలను రూపకల్పన చేసే అవకాశం గిరిధర్‌కు దక్కింది. పురోగమన సంస్కృతి పేరుతో ఈ వైతాళికుల చిత్రాల ఆవిష్కరణ జరిగింది.
జాతీయస్థాయిలో గుర్తింపు
ఇంటర్నేషనల్ వాటర్ కలర్ సొసైటీ (ఐడబ్ల్యుసిఎస్) గతంలో నిర్వహించిన గ్లోబల్ వాటర్ సమ్మిట్‌కు ఆయన గీచిన చిత్రం ఎంపికైంది. టాల్‌స్టారు 190వ జయంతి సందర్భంగా ఆయన బుక్స్ రీ ప్రింట్ నేపధ్యంలో టాల్‌స్టారు చిత్రాన్ని వాలర్ కలర్స్‌తో వేసి ఐడబ్ల్యుసిఎస్‌కు పంపటంతో ఈ ఎంపిక జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత చిత్రకారులు పంపిన 1700 ఎంట్రీల్లోంచి ఎంపిక చేసిన 130 పెయింటింగ్స్‌లో గిరిధర్ టాల్‌స్టారు బొమ్మ బాగా ఆకట్టుకుంది. 2018 నవంబర్‌లో షిల్లాంగ్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌లో ఆ చిత్రమే ఆయనకు ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టింది.
చిత్రకళకు పూర్వవైభవం కోసం… : అరసవిల్లి గిరిధర్, చిత్రకళాకారుడు
రెగ్యులర్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ ఏర్పాటుద్వారా చిత్రకళను విస్తారంగా సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. చిత్ర కళ దైనందిన జీవితంలో భాగస్వామ్యమైపోవాలంటే, ప్రజల్లో దాని పట్ల ఆకర్షణ, ఆరాధనాభావం పెరగాలంటే, రెగ్యులర్ ఎగ్జిబిషన్లు జరగాల్సివుంది. జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ తరహాలో ప్రత్యేక గ్యాలరీలను తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటుచేస్తే చిత్ర కళకు బాగా ఆదరణ పెరుగుతుంది. హైదరాబాద్‌లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మైసూరులో చిత్రకళాపరిషత్ ఆర్ట్ గ్యాలరీలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. బెంగళూరులో ఏటా జనవరి మొదటి ఆదివారం కర్నాటక ప్రభుత్వమే చిత్ర సంత నిర్వహిస్తోంది. మన రాష్ట్రంలో కూడా అలాంటి చిత్ర సంతలు జరిగితే చిత్ర కళను భావితరాలకు అందించిన వారం అవుతాం. పుష్ప, గేమ్ ఛేంజర్ సినిమాలకు పనిచేశాను.
-యడవల్లి శ్రీనివాసరావు