చాలా సులభంగా పెరిగే కలబంద మొక్క మన చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. ఔషధ గుణాలు, పోషకాలు, రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం కూడా ఈ మొక్కలో ఉన్నాయి.
- కలబందలో విటమిన్లు ఎ, సి, బి6, బి12, ఇ, ఫోలిక్ యాసిడ్, ముఖ్యమైన ఖనిజాలైన కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్‌లను కలిగి ఉంటుంది.
- చలికాలంలో గానీ, వేసవిలో కలబంద గుజ్జును చర్మానికి పలుచని పూతలా రాసుకొని, తరుచూ మర్దన చేస్తూ ఉంటే చర్మం పొడిబారడం, ఎండిపోయినట్లు, నిర్జీవంగా మారదు. మృదువుగా ఉంటుంది.
- ముఖానికి ఫేస్‌వాష్‌కు బదులుగా కలబంద గుజ్జును రాసుకుని అరగంట తర్వాత సబ్బుతో కడిగితే మృతకణాలు, జిడ్డు తొలగి కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. ఈ గుజ్జును చంకల్లో రాసుకుని అరగంట తర్వాత కడిగితే చెమట వాసన పోతుంది.
- చర్మం కాలిన్పుడు, కోసుకున్నప్పుడు, శరీరంలో అక్కడక్కడ గడ్డలు కట్టినప్పుడు కలబంద జెల్ రాస్తే ఉపశమనం కలుగుతుంది. గాయం త్వరగా తగ్గుతుంది.
- కలబందలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి. మొటిమల వల్ల వచ్చే ఎరుపు, వాపు తగ్గుతుంది.
- కలబంద గుజ్జు శరీరానికి రాసుకుని ఎండలోకి వెళితే ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వేడి వల్ల చర్మం కమిలిపోకుండా ఉంటుంది.
- ఈ గుజ్జును తేనెలో కలిపి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహం, రక్తపోటును అదుపు చేయడంలో సహాపడుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి.
- తలలో చుండ్రు, పుళ్లు, ఇన్ఫెక్షన్లు, దురద వచ్చినప్పుడు ఈ గుజ్జును రాసి, గంటపాటు ఉంచాలి. ఆ తర్వాత గాఢత తక్కువ ఉన్న షాంపుతో తలస్నానం చేస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది. ఇలా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.