భళా బామ్మలు..

May 16,2024 05:50 #feachers, #jeevana

తెల్ల జుట్టు, చీరకట్టులో, ఎనిమిది పదులు దాటిన ఈ బామ్మలు, బరువులు ఎత్తడం, వేగంగా నడవడం, పరుగెత్తడం, ఈత కొట్టడం, వేగంగా బంతిని విసిరికొట్టడం వంటివన్నీ అవలీలగా చేసేస్తున్నారు. అంతేకాదు, అందంగా తయారై, తమ అభిమాన హీరోలు, హీరోయిన్ల పాటలకు లయబద్ధంగా డ్యాన్స్‌ చేసే యువతతో పోటీ పడుతున్నారు కూడా. ఈ పనులన్నీ యువతకే సాధ్యమని చాలామంది ఢంకా బజాయించి మరీ చెబుతారు. కానీ ఈ బామ్మలు ఆ అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతం వారైనా ఏదైనా సాధించాలి అన్న తపనే, వారిని ఈ రోజు ఇంత ప్రత్యేకంగా నిలబెట్టింది.

బరువులు ఎత్తడంలో మేటి
తమిళనాడుకు చెందిన 82 ఏళ్ల కిట్టమ్మాల్‌ 50 కేజీల బరువును అవలీలగా ఎత్తేయగలదు. సాంప్రదాయ చీరకట్టులో ఆమె బరువులు ఎత్తుతుంటే చూసేవాళ్లు నోరెళ్లబెట్టాల్సిందే. అయితే ఇదంతా ఆమె ఒక్క రోజులో సాధించింది కాదు. దీనివెనుక ఎంతో కఠోర శ్రమ దాగుంది. ‘నేను ప్రతి రోజూ 25 కేజీల బియ్యం బస్తాలను ఎత్తడం ప్రాక్టీస్‌ చేశాను. 25 కుండల నీటిని ఒక్కసారే మోయడంలో కూడా శిక్షణ తీసుకున్నాను. ఇంట్లో ఉంటూనే బరువులు ఎత్త్తడం నేర్చుకున్నాను. నేను ముసలిదాన్నని, నా వల్ల కాదని ఎప్పుడూ అనుకోలేదు’ అంటున్న ఈ బామ్మ బరువులు ఎత్తడమే కాదు, వివిధ పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా గెలుచుకున్నారు.


చెన్నరుకి చెందిన 83 ఏళ్ల కిరణ్‌ బాయ్ కూడా బరువులు ఎత్తడంలో సిద్ధహస్తురాలు. బాల్యం నుంచి ఆటలపై శ్రద్ధ ఉన్న ఈ బామ్మ పెళ్లయిన తరువాత వాటన్నింటికీ దూరంగా జీవించాల్సివచ్చింది. పిల్లలు పెద్దయి, ఇక జీవితంలో విశ్రాంతి దొరికిన తరువాత అనుకోని ప్రమాదం వల్ల కదలకుండా ఒక్కచోటే కూర్చొవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ స్థితి ఆమెకి చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతో జిమ్‌ ట్రైనర్‌ అయిన ఆమె మనవడు తన బామ్మ కోసం ఇంట్లోనే చిన్న చిన్న వర్కౌట్స్‌లో తర్ఫీదు ఇచ్చాడు. బామ్మ గారు నిదానంగా కోలుకున్నారు. తనమీద తనకు అపారమైన నమ్మకం వచ్చింది. ఎంతలా అంటే, తన బరువుకు మించి బరువులు ఎత్తడం ప్రాక్టీస్‌ చేసేంత. ‘నా రోజువారీ పనులు స్వయంగా చేసుకోవాలని మొదట ప్రాక్టీస్‌ మొదలుపెట్టాను. నిదానంగా అధిక బరువులు మోయడం నేర్చుకున్నాను. నా బరువుకి మించి, బరువులు ఎత్తుతుంటే నా చుట్టూ వున్న వారు చాలా ఆశ్చర్యపోయేవారు’ అంటున్న ఈ బామ్మ స్టోరీని తన మనవడు సోషల్‌ మీడియాలో పంచుకున్నప్పుడు లక్షలాది మంది బామ్మగారిని అభినందనలతో ముంచెత్తారు.

పరుగుల రాణి
గతేడాది జనవరిలో 80 ఏళ్ల భారతి ముంబయిలో జరిగిన మారథాన్‌ పాల్గొని వార్తల్లో నిలిచారు. సాంప్రదాయ చీరకట్టులో వచ్చిన భారతి 4.2 కిలోమీటర్ల దూరాన్ని 51 నిమిషాల వ్యవధిలో అవలీలగా చేరుకోగలిగారు. భారతి విజయాన్ని తన మనవరాలు డింపుల్‌ సోషల్‌ మీడియా వేదికలో పంచుకున్నప్పుడు అది బాగా వైరల్‌ అయ్యింది. బామ్మగారి అభిమానగణం పెరిగింది.
అలివిగాని పనులు చేస్తూ, బామ్మలు ఇలా భళా అనిపించుకోవడం ఎప్పటినుండో ఉన్నదే. 2013లోనే లతా భగవాన్‌ అనే 61 ఏళ్ల బామ్మ బారామతి మారథాన్‌లో పాల్గొని వార్తల్లో నిలిచారు. వ్యవసాయ పనులు చేసే లతా బామ్మ ఆ పోటీలో 9,500 మందితో పోటీ పడ్డారు. 3 కిలోమీటర్ల పందెంలో పాల్గొని నగదు బహుమతి కూడా గెలుచుకున్నారు.

ఇంకా ఎందరో …
వారియర్‌ ఆజీ : కరోనా సమయంలో వారియర్‌ ఆజీ చాలా బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఒంటిచేత్తో కర్రసాము చేసిన ఆజీని అభినందించని వారు లేరు. మనవళ్లు, మనవరాళ్లని సాకేందుకు జీవనోపాధి కోసం బామ్మ ఈ కళను ప్రదర్శిస్తున్నారని తెలిసి సోనూసూద్‌ లాంటి ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం చేశారు కూడా.

మిసెస్‌ వర్మ : ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే వారికి మిసెస్‌ వర్మ స్టోరీ తెలియకుండా ఉండదు. 70 ఏళ్ల ఈ బామ్మ తన భర్తతో కలిసి రీల్స్‌ చేస్తూ బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. అందంగా ముస్తాబు అవ్వడం, రకరకాల డ్రస్సెల్లో మిసెస్‌ వర్మ చేసే రీల్స్‌ని లక్షలమంది అనుసరిస్తున్నారు.

గుజ్జిబెన్‌ : మహారాష్ట్రకి చెందిన గుజ్జిబెన్‌ ఊర్మిలా జమ్నాదాస్‌ ఏషర్‌, 70 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా మారి మంచి లాభాలు గడిస్తున్నారు. ‘మామ్‌ మేడ్‌’ పేరుతో గుజ్జిబెన్‌ తయారుచేసిన చిరుతిళ్లు మహారాష్ట్ర వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయి.

ఉషా సోమన్‌ : ప్రముఖ అథ్లెట్‌ మిలింద్‌ సోమన్‌ తల్లి అయిన ఉషా సోమన్‌ 80 ఏళ్ల వయసులో కూడా ట్రెక్కింగ్‌, వర్కౌట్లు చేస్తారు. పరుగు పందెంలో చాలా అవలీలగా పాల్గొంటారు. గతేడాదే సందక్ఫు ట్రెక్‌లో పాల్గొన్న పెద్ద వయసు వ్యక్తిగా ఉషా సోమన్‌ వార్తల్లో నిలిచారు.
ఈ బామ్మలు లాంటి వాళ్లు మనచుట్టూ చాలామందే ఉంటారు. చిన్న వయసు వారు కూడా తమ వల్ల కాదని చేతులెత్తేసిన పనులను అవలీలగా చేసేస్తారు. వారందరికీ జేజేలు చెబుదాం.

➡️