శరీరానికి బలం చేకూర్చి రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో బెల్లం, వేరుశనగలు కలిపి చేసే పప్పుండలు చాలా శ్రేష్టమైనవి. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు, ఆకలి తీర్చి, శరీరానికి కావాల్సిన శక్తినీ, బలాన్ని ఇస్తాయి. వీటిని రోజూ తింటుంటే రక్తహీనత దూరమవుతుంది. వేరుశనగలో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లు, బెల్లంలో ఐరన్, కాల్షియం తదితర శరీరానికి కావాల్సిన పోషకాలుంటాయి. పల్లీలు తరచుగా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. షుగర్ పేషెంట్లు మినహా మిగతావారు రోజుకు 20 గ్రాముల బెల్లం తింటే శరీరానికి మేలు చేస్తుంది.
- పప్పుండలు లేదా చిక్కీలు తినడం వల్ల మహిళల్లో రుతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. అయితే వీటిని మరీ ఎక్కువగా తినొద్దు.
- బెల్లం, వేరుశనగల్లో ఉండే కాల్షియం, ఇతర ప్రొటీన్ల వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.
- పల్లీల్లోని సెలీనియం, బెల్లంలోని మెగ్నీషియం, ఐరన్ కలిసి పునరుత్పత్తి సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేస్తాయి.
- రక్తహీనతని తగ్గించి ఎనీమియా రాకుండా రక్షిస్తాయి. వేరుశనగల్లోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి.
- వేరుశనగల్లోని ఫైబర్, బెల్లంలోని పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ మెటబాలిజంను మెరుగుపరుస్తాయి.
- అయితే వీటిని మితంగానే తీసుకోవాలి. ఎక్కువ తింటే మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.