ఆ ఊరంతా కళాకారులే. అది కడప జిల్లా మైదుకూరు సమీపంలోని పార్వతీ నగరం. కళలే నమ్ముకుని అక్కడ వందలమంది జీవనం సాగిస్తున్నారు. ఈ ఊరి రూపకర్త కొండపల్లి వీరభద్రయ్య. ఈయన పూర్వీకులు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా గత్పా అంతారం నుంచి తుంగభద్ర, కృష్ణ నదులను దాటి ప్రస్తుత నంద్యాల జిల్లా దీబగుంట గ్రామానికి సంచారం చేస్తూ వలస వచ్చారు. కళాకారుల కుటుంబంలో జన్మించిన వీరభద్రయ్య చిన్నతనం నుంచి యక్షగానంలో అందెవేసిన చేయి. భాగవతార్ బిరుదు అందుకున్న ఆయన రాష్ట్రం నలుమూలల తిరుగుతూ భూమి కొనుగోలు చేసి ఊరు నిర్మించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎంతోమంది అవమానించినా, ఆయన వెనుదిరగలేదు. ఎట్టకేలకు కడప జిల్లాలో ఊరి నిర్మాణం చేపట్టి, తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు.
ఈ ఊళ్లో ఉన్న జనాభాలో ఇప్పటికీ ముప్పాతిక శాతం మంది కళల పైనే ఆధారపడి జీవిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అవకాశం ఉన్నన్ని రోజులూ ఊరూరా ప్రదర్శనలిచ్చి, తరువాత పార్వతీ నగరం చేరుకుంటారు. వీరు సాంప్రదాయ జానపద కళాకారులైనప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా కళలను ప్రదర్శిస్తున్నారు. హార్మోని వాయించే సాంప్రదాయ కళాకారులు క్యాషియో, యమహా కంపెనీలకు చెందిన కీబోర్డు, రిథమ్ ప్యాడ్ అద్భుతంగా వాయిస్తూ, ప్రదర్శనలిస్తూ అందరి చేతా శభాష్ అనిపించుకుంటున్నారు.
వారి కుటుంబాల్లోని పిల్లలు ఉన్నత చదువులు చదివి పలు రంగాల్లో రాణిస్తున్నారు. గ్రామంలో కొందరు ఇంజనీరింగ్, మరికొందరు వైద్య విద్య అభ్యసిస్తున్నారు. ఇంజనీరింగ్ చదివి, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డ వారు కూడా ఉన్నారు.
వీరభద్రయ్య పసిప్రాయం నుంచే యక్షగాన (పగటి వేషాలు, హరికథ, బుర్రకథ హార్మోనియం మృదంగం తబలా, డప్పు, డోలక్ క్యాషియో) కళలను తండ్రి నుంచి నేర్చుకున్నాడు. పదేళ్ల వయసు నుండే ప్రదర్శనలు ఇచ్చి, ఎందరో గొప్ప వ్యక్తుల మన్ననలను పొందారు. తండ్రి వారసత్వంగా 40 హరికథలను నేర్చుకొని 1965 కొండ సుంకేశల ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉత్తర గోగ్రహణం చేశారు. ఆంధ్ర, తెలంగాణ, మద్రాస్, కర్ణాటకలోని చిల్లగట్టు చింతామణి, చిక్బల్లాపూర్ తదితర ప్రాంతాల్లో పదివేలకు పైగా కళా ప్రదర్శనలు ఇచ్చాడు. 25 ఏళ్ల వయసు వరకు నంద్యాల జిల్లా పొన్నాపురంలోనే గడిపాడు. కర్నూలు జిల్లాలో దసరా ఉత్సవాల్లో మాత్రమే హరికథలు చెప్పించేవారు. మిగతా రోజుల్లో ఖాళీగా ఉండాల్సి వచ్చేది. కడప జిల్లాలో అన్ని కాలాల్లోనూ హరికథ చెప్పించుకుంటారని తెలిసి, నంద్యాల జిల్లా నుంచి కడపకి వలస వచ్చారు.
ఆకాశవాణిలో..
1983లో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం హరికథ పోటీల్లో వీరభద్రయ్య ఉత్తీర్ణులయ్యారు. తరువాత కడప ఆకాశవాణి వేదికగా హరికథలు చెప్పాడు. అదే ఏడాది శ్రీ వాఘేశ్వరీ రాయలసీమ యక్షగానం హరికథ, బుర్రకథ కళాకారుల సంఘం ఏర్పాటు చేశాడు. 1988లో 15 ఇళ్ల నిర్మాణంతో ఊరు ప్రారంభమైంది. మొదట ఐదు కుటుంబాల వారు నివసించేవారు. రెండు కుటుంబాల వారు యక్షగానాల కోసం వెళ్తే మిగిలిన మూడు కుటుంబాల వారు ఊరు నిర్మాణ పనులను చూసుకునేవారు. 1990 నాటికి ఊర్లో కుటుంబాల సంఖ్య 40కి చేరింది. ఊరంతా పచ్చదనం ఉండేలా రకరకాల చెట్లు పెంచుతున్నారు. ఊర్లో ప్రత్యేకమైన మురుగు నీటి పారుదల లేదు. అయినా వర్షపు నీరు ఒక్క చుక్క కూడా నిల్వ ఉండదు.
ప్రస్తుతం ఊళ్లో 100 కళాకారుల కుటుంబాలు నివసిస్తున్నాయి. సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో అంతరించిపోతున్న కళకు జీవం పోస్తున్న ఈ కళాకారుల్లో మోటే శ్రీనివాసులు మాటీవీలో రేలారే రేలారే కార్యక్రమంలో తన ప్రతిభ చూపారు. మరో కళాకారుడు నటరాజన్ 18 తబలాలను ఏకకాలంలో వాయించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు. ఊరి కళలు అంతరించిపోకుండా డాక్యుమెంటరీ తీసి సజీవం చేశారు. హైదరాబాద్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు పార్వతీ నగరం గురించి ఒక పుస్తకం వెలువరించటం మైదుకూరుకే గర్వకారణం..
అంతర్జాతీయ రికార్డే లక్ష్యం! : కొండపల్లి నటరాజు, ఇండియన్ బుక్ రికార్డ్ గ్రహీత.
వీరభద్రయ్య సంతానంలో మూడవ వాడిని. చిన్నతనం నుంచి కళలంటే అమితమైన ప్రీతి. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో 2000 నుంచి 2002లో ఎం.ఎ సంగీతం మృదంగం సబ్జెక్టుగా తీసుకొని పూర్తి చేశాను. 2002లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టులో ఔట్సోర్సింగ్‌లో మృదంగ కళాకారునిగా చేరి ఇప్పటికీ పనిచేస్తున్నాను. హైదరాబాదులోని రవీంద్ర భారతి, త్యాగరాజగాన సభ, హరిహర కళాభవనాలలో పెద్ద, పెద్ద కచేరీల్లో సహకార మృదంగం వాయిస్తున్నాను. ప్రస్తుతం పిల్లల చదువు రీత్యా, నా మృదంగ లక్ష్యాల కోసం హైదరాబాదులో ఉంటున్నాను. 2021 సెప్టెంబర్ 17న రవీంద్ర భారతిలో అష్టాదశ తబలానవరాగ తరంగిణి అనే కార్యక్రమం రూపకల్పన చేశాను. ఆ కార్యక్రమంలో 18 తబలాలపై శాస్త్రీయ కృతులను పలికించి అందరూ పార్వతీ నగర్ వైపు చూసేలా చేశాను. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శన చేసి అంతర్జాతీయ రికార్డులు సాధించాలన్నదే నా లక్ష్యం.
కళలే మా జీవనాధారం : యడవల్లి మురళీ కృష్ణ, ప్రోగ్రాం ఆర్గనైజర్
రెండు తెలుగు రాష్ట్రాల్లో మా సాంస్క ృతిక కార్యక్రమాలు ఉంటాయి. నా బృందంలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వివిధ ప్రదర్శనలతో ప్రజలను ఆనందింపజేస్తూ, కళలను బతికిస్తున్నాం. ప్రతి నెలలో సరాసరి పది ప్రోగ్రామ్స్ వస్తాయి. ప్రతి ప్రోగ్రాంకు రూ.60 వేల వరకూ ఆర్జిస్తున్నాం. వచ్చిన డబ్బు సమానంగా పంచుకుంటాం. అన్ని ఖర్చులూ పోను ఒక్కొక్క సభ్యునికి సుమారు రూ.3000 వస్తుంది. నేను పార్వతీనగర్‌కు చెందిన మిరియాల రవికుమార్ గురువు దగ్గర కళలను నేర్చుకున్నాను. ప్రతి ప్రోగ్రాంకు వారి కుటుంబానికి కొంతమొత్తం అందిస్తాము. క్రమశిక్షణకు మారుపేరైన కొండపల్లి వీరభద్రయ్య సాక్షిగా పార్వతి నగర్ ఊర్లో ఉన్నా, ప్రోగ్రామ్స్ చేయటానికి వెళ్ళినా మద్యం, ధూమపానం చేయం. మేమే కాదు, మా ఊళ్లో ఎవ్వరూ మద్యపానం, ధూమపానం చేయరు.
కళలను నేర్చుకోమని ప్రోత్సహిస్తున్నాం : కొండపల్లి ఉమాకాంత్, రాయలసీమ జానపద కళాకారుల సంఘం సెక్రటరీ
మన సంస్కృతిని చాటే జానపద కళలను నేర్చుకోమని భావితరాల వారిని ప్రోత్సహిస్తున్నాం. శిక్షణ ఇస్తూ అదనంగా సంపాదించుకోవచ్చు అని మా విద్యార్థులకు చెబుతుంటా. కళలను నేర్చుకుని కలలను సాకారం చేసుకోవడం కళాకారులకు మాత్రమే ఉన్న అవకాశం. ఆ దిశగా అడుగులు వేస్తున్న మేము, ఎంతో ధన్యులం.
– బొమ్మిశెట్టి రమేష్,
రచయిత, చరిత్ర పరిశోధకులు,
కడప జిల్లా, 98483 73736.