అందాల సీతాకోకచిలుక

Apr 4,2024 04:45 #jeevana

లావణ్యకు సీతాకోకచిలుకలు అంటే ఎంతో ఇష్టం. వాటిని పట్టుకుంటుంది. సరదా ఆడుకుంటుంది. ఆ తర్వాత వదిలేస్తుంటుంది. అవి రివ్వున ఎగిరిపోతుంటాయి. ప్రతిరోజూ తనకు ఇది ఒక దిన చర్యగా మారింది. ఓ రోజు ఎక్కువగా తన ఇంటి వద్దకు సీతాకోక చిలుకలు వచ్చాయి. కొన్నింటిని పట్టుకుంది. మళ్లీ వదిలేసింది. అయితే వీటిలో సరికొత్తగా ఇంద్రధనస్సును పోలిన రంగులతో ఓ సీతాకోక చిలుక అబ్బురపర్చింది. ఎంచక్కా దానిని పట్టుకునే ప్రయత్నం చేసింది. అయినా దొరకలేదు. ఇంటి పరిసర ప్రాంతాల వరకూ పరుగెత్తింది. అయినా దొరకలేదు. వీధి చివరి వరకూ ప్రయత్నించింది. అది అందినట్లే అందుతూ పారిపోతూ ఉంది. రొప్పుతూ ఇక నా వల్ల కాదంటూ ఆగిపోయి రోడ్డుపై నడవలేక కూర్చుండిపోయింది.
ఈలోగా ఇంట్లో తన వంట కార్యక్రమాలు పూర్తి చేసిన తల్లి అమల కూతురును భోజనానికి పిలిచింది. ఎంత పిలిచినా పలుకలేదు. ఇంటి బయటకు వచ్చి రోడ్డుపై చూస్తే కుమార్తె రోడ్డుపై కూర్చుని ఉంది. తల్లి పిలుపుతో కుమార్తె లేచి ఇంటికి పరుగున చేరుకుంది. ‘అమ్మా.. ఈరోజు నేను సరికొత్త సీతాకోక చిలుకను చూశాను. అది ఇంద్రధనస్సును పోలిన రంగులతో చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. దానిని పట్టుకోవటానికి ఎంతో ప్రయత్నించాను. కానీ అది దొరక్కండా తప్పించుకుంది’ అంటూ చెప్పింది. అప్పుడు తల్లి స్పందిస్తూ ‘నువ్వు అమ్మ ఇంటికి ఎలా వచ్చావో… అదేవిధంగా సీతాకోకచిలుక కూడా తన అమ్మ వద్దకు వెళ్లి ఉంటుందిలే…’ అంటూ నచ్చచెప్పింది. ”అవునా.. అయితే.. ఓకే” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది లావణ్య.

-పి.విర్షిత, 4వ తరగతి,
ఎంపిపిఎస్‌ వానపాముల (హెచ్‌డబ్ల్యు),
పెద పారుపూడి మండలం, కృష్ణా జిల్లా.

➡️