గోపీ అనంతవరం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. గోపీకి చదువుకోవడం చాలా ఇష్టం. తల్లి దండ్రులు, గురువులు చెప్పిన మాటలు తప్పకుండా పాటిస్తాడు. ఒక రోజు పాఠశాలకు వెళ్తుండగా దారిలో సెల్ ఫోన్ దొరికింది. గోపీ దానిని తీసుకోని ఇటు అటు చూసాడు. అప్పుడు ఒక పెద్దాయన చాలా కంగారుగా దూరం నుండి అటు ఇటు చూస్తూ వస్తున్నాడు. గోపీ అతని దగ్గరికి వెళ్ళి ‘ఈ సెల్ ఫోన్ మీదేనా’ అని అడిగాడు. అది చూసి ‘నాదే, దారిలో వెళ్తునప్పుడు పడిపోయింది’ అన్నాడు పెద్దాయన. గోపీ ఆ ఫోను అతనికి ఇచ్చేశాడు. అప్పుడు ఆ వ్యక్తి ఎంతో సంతోషంతో గోపీకి వంద రూపాయలు ఇవ్వబోయాడు. కానీ గోపి ఆ డబ్బులు తీసుకోలేదు.
ఆ రోజు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ‘ఈ వారంలో మీరు చేసిన మంచి పనులు చెప్పండి’ అని ఒక్కొక్కరిని అడిగారు. విద్యార్థులు తమ ఇంట్లో అమ్మానాన్నకు తాము చేసిన పనులు చెప్పారు. గోపీ సెల్ ఫోన్ విషయం చెప్పాడు. ‘శభాష్ గోపి, ఇతరుల వస్తువులు ఎప్పుడూ తీసుకోకూడదు. ఒక వేళ దొరికితే వారికే తిరిగి ఇవ్వాలి. మంచి పని చేసావు’ అంటూ ఉపాధ్యాయుడు మెచ్చుకున్నారు. జేబులో నుండి పెన్ను తీసి తనకి బహుమతిగా కూడా ఇచ్చారు. తోటి విద్యార్థులు కూడా గోపీని అభినందించారు.
మల్లు గారి అక్షయ, 7వ తరగతి,
జక్కాపూర్ ఉన్నత పాఠశాల,సిద్దిపేట జిల్లా.