చందమామ

Apr 14,2025 02:20 #feachers, #jeevana, #kavithalu

నింగిలోని చందమామ
నేలపైన జాబిలమ్మ

నింగిలో మబ్బుల చాటు దాగి
దోబూచులాడుతున్న చందమామ
వెదజల్లుతున్న వెన్నెలను ఆదమరచి
సొగసరి చుక్కలతో చేరి మైమరచి
ఆటలలో మునిగిపోయే

ఇంతలో నేలపై చిన్నారుల
కేరింతల సవ్వడి నింగి
అంచులను తాకి దద్దరిల్లె
ఆ సవ్వడికే ఉలిక్కిపడి
ఒకింత ఆశ్చర్యం వలకబోస్తూ
వంగి తొంగి చూసె
ఆ మామ కాని మామ

నేల పైన చిట్టి చిట్టి జాబిలమ్మలు
దొంగ పోలీస్‌ ఆడుతూ అచ్చం తనలాగే
దాక్కుంటు స్నేహితులతో చేరి
కవ్వింతలు కేరింతలతో
ఆటలు ఆడుతూ సందడి చేస్తుంటే
వారి చిరు ధరహాసాలతో
మరో వెన్నెల విరబూసిందక్కడ

ఆడి పాడి అలసిన ఆ పసివాళ్ళు
కునుకు రాగానే కూనలమ్మ రాగాలతో
చందమామ రావే.. జాబిల్లి రావే..
నిద్రపుచ్చగ రావే..
అంటూ జోల పాట పాడగా
అది వింటూ మురిసిపోతూ..
అలసిపోయి ఆదమరిచి
నిద్రలోకి జారుకుంది ఆ నెలరేడు

– నేదూరి భాను సాయి శ్రేయ, నరసాపురం,
93924 67155.

➡️