మార్పు

Feb 17,2025 03:08 #jeevana, #katha

లత అనే అమ్మాయి గొల్లలపాలెం అనే ఊరిలో వాళ్ళ అమ్మతో పాటు నివసిస్తుంది. లత ఒకరోజు ఐస్క్రీమ్‌ కొనుక్కోవాలి అనుకొంది. వాళ్ళ అమ్మని అడిగింది. వాళ్ళ అమ్మ ‘నా దగ్గర డబ్బులు లేవు’ అని అంది. దాంతో లతకి బాగా కోపం వచ్చింది. ‘అమ్మ ఏమీ కొనదు’ అనుకుంటూ ఏడ్చుకుంటూ బడికి వెళ్లిపోయింది. టీచర్‌ అటెండెన్స్‌ వేస్తుండగా లత పలకలేదు. దాంతో టీచర్‌ లత దగ్గరకి వచ్చి ‘ఏం లత అలా ఉన్నావు’ అని అడిగారు. అప్పుడు లత ‘మా అమ్మని ఏం కొనమన్నా కొనదు. ఇప్పుడు కూడా ఐస్‌క్రీమ్‌ అడిగితే డబ్బులు లేవు అంది’ అని చెప్పింది. ‘మా అమ్మపై నాకు చాలా కోపంగా ఉంది. అందుకే మీరు అటెండెన్స్‌ వేసినప్పుడు వినిపించుకోలేదు’ అంది. అప్పుడు టీచర్‌ ‘అలా అమ్మని బాధ పెట్టకూడదు’ అని చెప్పారు. ‘ఎందుకు బాధపెట్టకూడదు టీచర్‌’ అని లత ఎదురు ప్రశ్నించింది. ‘అమ్మ మనల్ని కని పెంచుతుంది. ఎంతో కష్టపడి బడికి పంపుతుంది. అమ్మ ఎప్పుడూ మనకి మంచి జరగాలని, మనం ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకుంటుంది’ అని చెప్పారు. అమ్మ గురించి టీచర్‌ చెప్పిన మాటలు విన్న లతకి దుఃఖం వచ్చింది. అమ్మని అనవసరంగా అవి కొను, ఇవి కొను అని మారాం చేస్తున్నాను. ఇక మీదట అలా చెయ్యకూడదు అని మనసులో అనుకుంది. స్కూల్‌ అయ్యాక ఇంటికి వెళ్లి అమ్మని గట్టిగా హత్తుకొని అమ్మకి క్షమాపణ చెప్పింది. ‘నిన్ను ఇంక ఎప్పుడూ బాధపెట్టను అమ్మా’ అని చెప్పింది. లతలో వచ్చిన మార్పుకు అమ్మ ఎంతో సంతోషించింది.

జోగ నవ్యశ్రీ, 4వ తరగతి,
ఎంపీపీఎస్‌ గొంపవాణిపాలెం,
కే కోటపాడు మండలం, అనకాపల్లి జిల్లా.

➡️