మీడియాలో వచ్చే సమాచారం తెలుసుకుంటుంటే- గుండె బేజారు అవుతుంది. పిల్లలపై వేధింపులు ఇంత ఘోరంగా జరుగుతున్నాయా అని ఆవేదన కలుగుతోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల అధ్యయనం ప్రకారం చూస్తే- మొత్తం పిల్లల్లో సగం మంది ఏదో ఒక సందర్భంలో శారీరక, మానసిక, లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలుస్తోంది. ఇది ఎంత దారుణమైన విషయం! ఇది పిల్లలకు ఎంత అభద్రమైన సమాజం! వేధింపులకు గురైన పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాలు ఏం కావాలి? వారి భవిష్యత్తు సంగతి ఏమిటి? రోగ పీడితులైన పిల్లలతో ఉన్న సమాజం రోగగ్రస్తం కాదా?
పిల్లలపై జరిగే దారుణాలకు రకరకాలు కారణాలు ఉంటున్నాయి. తొలుత లైంగిక వేధింపుల గురించి చూద్దాం. అనేక విషయాలను కుటుంబ పరువు మర్యాదలకు, స్త్రీల లైంగికతకు లేదా శీలం, పాతివ్రత్యాలకు ముడిపెట్టి చూడటం మన సమాజంలో బాగా పాతుకు పోయింది. అందువల్ల పరువు పేరుతో చాలా సంఘటనలు బయటికి రావడం లేదు. తెలిసినా నోరు మూసుకోవడం మామూలైంది. ఇంకా చెప్పాలంటే సమాజమే నోరు మూయిస్తోంది. ఇంటిగుట్టు బయట పడకూడదు అని వాస్తవాలను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ ధోరణి కూడా పిల్లల మీద లైంగిక వేధింపులు కొనసాగటానికి ఒక కారణంగా ఉంది. ఇలా వేధింపులకు పాల్పడేవాళ్లు బాగా తెలిసినవాళ్లు, ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులూ అయివుంటున్నారు. ఎవరి నుంచి రక్షణ ఉంటుందని, ఉండాలీ అని అందరూ భావిస్తారో అలాంటి వారి నుంచే వేధింపులు ఎదురవ్వడం ఒక అమానుషం. ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో ఇలాంటి సున్నితమైన విషయాన్ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఒక పాత్ర ద్వారా చిత్రీకరించారు. సొంత చిన్నాన్న ఆ అమ్మాయి పట్ల వేధింపులకు దిగుతాడు. తాను ఎవరితోనూ చెప్పలేని స్థితిలో తప్పించుకొని పారిపోవాలని చూస్తుంది కొండచిలువ అని పేరు పెడుతుంది. ఈ పరిస్థితి ఆమె మానసిక అనారోగ్యానికీ దారి తీస్తుంది. ధైర్యం చేసి పిల్లల మీద సాగే వేధింపుల అంశాన్ని తన కథనంలో చేర్చిన శేఖర్ కమ్ముల అభినందనీయుడు. జాగ్రత్త పడాలని, జాగ్రత్తగా ఉండాలని సమాజానికి ఇదొక హెచ్చరిక.
పిల్లల ముందు అనేక విషయాలను మనం మాట్లాడం. స్త్రీ పురుష శరీర భాగాల గురించి గానీ, లైంగిక జీవితం గురించి గానీ ఏనాడూ పిల్లల ముందు మాట్లాడం, చెప్పం. ఒకవేళ వాళ్ళు ఏదన్నా తెలిసి తెలియక ప్రశ్నలు అడిగిగా, ‘నోరు మూసుకో’ అని గద్దిస్తాం. అలా అడగటం తప్పుగా భావిస్తాం. ”పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటున్నాం. నువ్వు బయటికి వెళ్ళు” అని కసురుకుంటాం. కానీ, లైంగిక విజ్ఞానం జీవితంలో ఒక భాగం. అది పిల్లలకు చెప్పాలనే జ్ఞానం మనకు ఉండట్లేదు.
వాస్తవ విషయాలను వాళ్ళకి అర్థం అయ్యేటట్టు చెప్పాలి. వాళ్ల శరీరం గురించి వాళ్లకు తెలియాలి. పిల్లలకు చెప్పకపోవడం వల్ల అది కొన్ని రకాల గందరగోళాలకి దారితీస్తుంది. ఈ గందరగోళం పిల్లల్లో కూడా రకరకాల పైత్యాలకు దారి తీస్తుంది.
ఇక పిల్లలపై జరిగే వేధింపుల్లో భౌతికపరమైనవి, మానసికపరమైనవి కూడా ఉంటాయి. దండం దశ గుణం భవేత్ అనే శ్లోకాలు మన పంతులు గార్లు బాగా ఉదహరిస్తారు. పిల్లలను కొట్టి, తిట్టి దారిలోకి తెచ్చుకోవాలని ఉద్బోధిస్తారు. పిల్లలకు మనసు ఉండదా? వాళ్ళ ఆలోచనలకి, మేధాశక్తికి మనం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వం? కొట్టటం ద్వారా దారిలో పెడుతున్నాం అనుకోవడం తప్పు. ఈ తరం పిల్లలు మనకన్నా ఎక్కువే తెలుసుకుంటున్నారు. కొట్టి తిట్టి దారిలోకి తెచ్చుకోవాలని అనుకుంటే వాళ్లు మారరు. వారిని అర్థం చేసుకొని, తెలుసుకొని, మాట్లాడడం ద్వారా సరైన పౌరులుగా ఎదుగుతారు. తిట్టటం, కొట్టడం అనేది పరిష్కారం కాదు. అలా చేస్తే పిల్లలు రెబల్‌గా తయారవుతారు. కొట్టిన వాళ్ళ పట్ల మాత్రమే కాదు; సమాజం పట్ల కూడా ద్వేషాన్ని పెంచుకుంటారు. దెబ్బల ప్రభావం మనసు మీద పడితే అది అంత తేలిగ్గా పోదు. వాళ్ళ జీవితాంతం వెన్నాడుతుంది. దెబ్బకు దెబ్బ తీయాలని ద్వేషపూరితమైన మనస్తత్వం కూడా పెరుగుతుంది.
ఈ తరహా అజమాయిషీకి కూడా పితృస్వామ్య భావజాలమే కారణం. ఇంట్లో తండ్రి చెప్పినట్టు అందరూ వినాలి. భర్త చెప్పినట్టు వినాలి లేదా పెద్దన్న చెప్పినట్టు అందరూ వినాలి… అన్న భావజాలంలోంచి ఆధిపత్య భావన గూడు కట్టుకుంటుంది. ఎవరు ఏం చెప్పినా వినకుండా పెత్తనం చెలాయిస్తుంది. ఇది మంచి ఫలితాలను ఇవ్వదు. ఆధిపత్యం అంటేనే అప్రజాస్వామికం. ఇతరుల ఆలోచనలకు, ఇష్టాయిష్టాలకు విలువ ఇవ్వదు. ఈ ధోరణి సమస్యలను మరింత పెంచుతుంది తప్ప పరిష్కారం చూపదు.
2007లో కేంద్ర ప్రభుత్వం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక సర్వే నిర్వహించిందట. 13 రాష్ట్రాల్లో ఒక లక్షా 25 వేల మంది పిల్లల్ని కలిసి, మాట్లాడిందట. ఆ సర్వేలో బయటపడ్డ విషయాలు తెలుసుకుంటే మనకు నిద్ర పట్టదు. అంతులో 53 శాతం మంది పిల్లలు వేధింపులకు గురయ్యారట! 56 శాతం మంది పిల్లలు శారీరక వేధింపులకు గురి కాగా, 50 శాతం మంది పిల్లలు మానసిక వేధింపులు ఎదుర్కొన్నారట! ఆడపిల్లలే కాక మగ పిల్లలు కూడా వేధింపులకు గురవుతున్నారట. యునిసెఫ్ 2005-13 మధ్యకాలంలో నిర్వహించిన ఒక సర్వేలో భారతదేశంలోని ఆడపిల్లల్లో నూటికి 42 మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారని తేల్చింది. బయటికి బాగా కనిపిస్తున్న మనుషులలో ఏదో జాఢ్యం పేట్రేగుతూ ఉంది. గొప్పగా మాట్లాడుకునే సమాజం తీవ్ర లోపభూయిష్టంగా ఉంది. దీనిని మనందరం సరి చేయాలి. పిల్లలకు, మహిళలకు భద్రమైన సమాజాన్ని నిర్మించుకోవాలి. సమాజంలో నెలకొని ఉన్న దుర్భర, దుర్మార్గ పరిస్థితులను, వాటి మూల కారణాలను నిర్మూలించాలి. అది సమాజంలోని పౌరులందరి బాధ్యత.
జీవితాంతం ఈ బాధ ఉంటుంది
పిల్లల మీద వేధింపుల ప్రభావం వారి జీవితాంతం ఉంటుంది. ఆ ప్రభావం మెదడు, నాడీ మండలం మీద పనిచేస్తుంది. శారీరక ఆరోగ్యం మీద, మేధో శక్తి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. నిరంతరం లైంగిక వేధింపులు, శారీరక మానసిక వేధింపులు – ఉన్నప్పుడు వాటి ప్రభావం రకరకాలుగా ఉంటుంది. పిల్లల మానసిక స్థితి, వారి సామాజిక జీవితం, ఆరోగ్యం, శారీరక ఎదుగుదల, లైంగిక జీవితం – వీటన్నిటి మీద వాటి ప్రభావం ఉంటుంది.
ఈ వేధింపుల ప్రభావం పిల్లలతోపాటు పిల్లల తల్లిదండ్రులు, దగ్గర బంధువుల మీద కూడా ఉంటుందని ముంబైలోని భాటియా హాస్పిటల్ మానసిక వైద్యులు డాక్టర్ ఫోరం మెటాలియ చెప్పారు. ”పిల్లల మానసిక ఎదుగుదల మీద, భావోద్వేగాల మీద ఈ ప్రభావం దారుణంగా ఉంటుంది. డిప్రెషన్, ఆందోళన, ఏదో తప్పు చేశామని భావన, నేనెందుకూ పనికిరాను అనే ఆత్మన్యూనత, నలుగురిలో కలవలేనితనం వంటివన్నీ చుట్టుముట్టి, పిల్లల వికాసాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి.
పెద్దవాళ్లకు ఉన్నట్లే పిల్లలకీ హక్కులుంటాయి. ఇంకా చెప్పాలంటే పెద్దవారి కన్నా ఎక్కువే ఉంటాయి, ఉండాలి కూడా. పెద్దలు ఈ విషయాన్ని గుర్తెరిగి మసలుకోవాలి. పిల్లలకు ఆదేశాలు ఇవ్వటం మానుకుని సంభాషించటం అలవర్చుకోవాలి. వారి ఇష్టాఇష్టాలను, కష్టసుఖాలను తెలుసుకోవాలి. కనీస లైంగిక విజ్ఞానాన్ని తప్పకుండా అందించాలి. పరువు ప్రతిష్ట, సంప్రదాయాలు వంటి పేరుతో పిల్లల వ్యక్తిత్వాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని దెబ్బతీసే అన్ని ధోరణులకు స్వస్తి చెప్పాలి.
– ఎస్.పుణ్యవతి ఐద్వా జాతీయ కోశాధికారి